దేవయాని అరెస్టు వల్ల ఏర్పడిన సమస్యను నేరుగా ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం తయారుగా లేనట్లు కనిపిస్తోంది. న్యూయార్క్ లోని ఐరాసలో భారత తరపు రాయబారి అధికారిగా దేవయానిని ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం ద్వారా దేవయానికి పూర్తి స్ధాయి రాయబార రక్షణలు పొందే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఐరాసలో భారత రాయబారిగా దేవయాని ఇక పూర్తి స్ధాయి రక్షణలు పొందవచ్చు. వియన్నా ఒప్పందాల ప్రకారం దేవయానికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఇప్పుడు అమెరికాపై ఉంది.
న్యూయార్క్ లోని ఐరాస శాశ్వత రాయబార కార్యాలయం (Permanent Mission of India – PMI) బాధ్యతలు నిర్వహించే అధికారిగా దేవయానిని బదిలీ చేసినట్లు ప్రభుత్వం లోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. ఐరాస కార్యాలయం అధికారి ఎంబసీ అధికారులతో సమానంగా పూర్తి స్ధాయి రాయబార రక్షణ (diplomatic immunity) కలిగి ఉంటారని తెలుస్తోంది. ఇలాంటి బాధ్యతలకు బదిలీ చేయడం ద్వారా పని మనిషి వీసా కేసు విషయంలో దేవయానిపై అమెరికా యు.ఎస్.మార్షల్ సర్వీసు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిరోధించినట్లయింది.
డిప్యూటీ కాన్సల్ జనరల్ అధికారిగా కూడా దేవయాని అత్యున్నత ఐ.ఎఫ్.ఎస్ అధికారిగానే విధులు నిర్వర్తించారు. కానీ అమెరికా చట్టాల ప్రకారం ఎంబసీ అధికారులతో సమానంగా కాన్సల్ అధికారులకు రాయబార రక్షణ వర్తించదు. ఈ విషయమై అనేక సంవత్సరాలుగా భారత ప్రభుత్వం అమెరికాతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. కాన్సల్ అధికారులకు కాన్సల్ విధులు నిర్వర్తించ్చేటప్పుడు మాత్రమే రాయబార రక్షణ ఉంటుంది. వ్యక్తిగత విధులు నిర్వర్తించే సమయంలో రక్షణ వర్తించదు.
అందుకే అమెరికా పోలీసులు కుట్ర పూరితంగా దేవయాని తన పిల్లలను పాఠశాల వద్ద దింపే సమయాన్ని ఎంచుకున్నారు. ఆ సమయాన్ని వారు కాకతాళీయంగా ఎంచుకోలేదు. నిబంధనల ప్రకారం ఆమె కాన్సల్ జనరల్ విధులు నిర్వర్తించేటప్పుడు -కాన్సల్ కార్యాలయానికి వెళ్ళే సమయంలో గానీ, కాన్సల్ కార్యాలయంలో ఉన్నప్పుడూ గానీ లేదా తాను కాన్సల్ విధుల్లోనే ఉన్నానని ఆమె చెప్పుకోగల మరే సమయంలో గానీ- ఆమెను అరెస్టు చేసినట్లయితే వియన్నా సూత్రాలను ఉల్లంఘించినట్లు అయ్యేది. అందుకే వారు ఒక పధకం ప్రకారం ఆమె వ్యక్తిగత విధుల్లో ఉన్నపుడు -పిల్లలను పాఠశాలలో దింపుతున్నపుడు- కాపుగాచి అరెస్టు చేశారు.
ఇంత పక్కాగా పాఠశాలకు వెళ్ళిన సమయంలోనే పోలీసులు ఆమెను పట్టుకున్నారంటే ఆమె దినచర్యలను వారు కొన్ని రోజులుగా పరిశీలించి ఉండాలి. అనగా మన రాయబార అధికారి పైన వారు ప్రత్యక్షంగానే నిఘా పెట్టి ఉండాలి. భారత రాయబార అధికారిపై నిఘా పెట్టడం మరో నేరం అవుతుంది. ఇది కూడా వియన్నా సదస్సు సూత్రాలకు విరుద్ధమే. వీటిని అడిగే నాధుడే ఇండియా తరపున ఎవరూ లేకపోవడం భారత దేశం దౌర్భాగ్యం. పార్లమెంటులో మాత్రం ప్రతి ఒక్కరూ వీరాలాపాలు వల్లించినవారే.

పింగ్‌బ్యాక్: దేవయానిని ఐరాసకు తరలించిన ఇండియా | ugiridharaprasad
ఇదేదో బాగానేవుందే. రెండు పిల్లులు, కోతి, రొట్టిముక్క కధలా. భారత్,అమెరికాలు రెండు పిల్లులైతే, కోతి వేషాలు వేసి అమెరికా దృష్టిలోపడిన దెవయాని తంతే బూర్లగంపలోపడినట్లు, అంట్లు తోముకునేదానితో ఘర్షణపడి అందలమెక్కి ఇటు తను అటు దేశానికి మధ్య జరిగిన అప్రదిష్టలో ఆయాచితంగా గౌరవప్రతిశ్ఃటలు సంపాదించుకుని తన అదృష్టానికి సానపెట్టుకుంది. అసలు భారత్ అమెరికాని ఎప్పుడు ఎదిరించి సత్తాచూపింది కనుక, అన్ని దద్దమ్మ వేషాలు. చేతకానివాడికి సొల్లు కార్చడమనే సామెత ఈ విషయంలో అక్షరాలా రుజువైంది.