కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తయారు చేయగా కేంద్ర కేబినెట్ ఆమోదించిన ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ఢీకరణ బిల్లు 2013’ ముసాయిదాను రాష్ట్రపతి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ పరిశీలన నిమిత్తం పంపారు. బిల్లు మొత్తంగానూ, అంశాలవారీగానూ శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు ముసాయిదాపై ఏమి అభిప్రాయపడుతున్నదీ రాష్ట్రపతికి తెలియజేయాలని చెబుతూ అందుకు జనవరి 23ను తుది గడువుగా రాష్ట్రపతి నిర్దేశించారు. సదరు బిల్లు ముసాయిదాకు రాష్ట్రపతి రాసిన కవరింగ్ లెటర్ లోని అంశాలు ఇలా ఉన్నాయి.
“సంబంధిత భాగస్వాములతో విస్తృతంగా చర్చించిన అనంతరం, ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రం తెలంగాణను ఏర్పాటు చేయడానికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణించిన తర్వాత భారత ప్రభుత్వం ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ఢీకరణ బిల్లు, 2013’ ను ప్రతిపాదిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకూ, తత్సంబంధితంగానూ తదనుగుణంగానూ తటస్ధించే విషయాలకూ సంబంధించిన బిల్లు సాధ్యమైనంత ఆచరణాత్మక శ్రీఘ్ర తరుణంలో పార్లమెంటులో ప్రవేశపెట్టవలసి ఉంది.”
“ఈ బిల్లులో పొందుపరచబడిన ప్రతిపాదన ద్వారా ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతము మరియు సరిహద్దులూ అలాగే సదరు రాష్ట్రంలోని నిర్దిష్ట ప్రాదేశిక భాగాలను వేరు చేయడం ద్వారా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రమూ ప్రభావితం అవుతాయి. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్ 3 కి అనుగుణంగా నేను ఇందు మూలంగా సదరు బిల్లును ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చట్ట సభకు జనవరి 23, 2014 లోపు తన అభిప్రాయాలను వ్యక్తం చేసే నిమిత్తం పంపడమైనది.”
ఈ భాగాన్ని ది హిందూ పత్రిక అందజేసింది. ఇందులో పత్రికలు చెప్పినట్లు బిల్లుపై మొత్తంగానూ, అంశాలవారీగానూ శాసన సభ తన అభిప్రాయం చెప్పవచ్చని ఎక్కడా లేదు. కవరింగ్ లెటర్ లోని కొంత భాగాన్నే ది హిందూ పత్రిక ప్రచురించిందేమో తెలియదు. లేదా ఆ మేరకు బిల్లు ముసాయిదా పీఠికలో ఏమయినా ఉన్నదేమో తెలియదు.
