భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ – పార్ట్ 5
–
గ్రామీణ సమాజంలో పై పొరలో ఉన్నవారు తమ యాజమాన్యంలో ఉన్న భూములను, శ్రమ సాధనాలను గ్రామాల్లోని భూమిలేని పేదల శ్రమశక్తితో కలిపి ఉత్పత్తి తీస్తున్నారనేది నిజమే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో స్వేచ్ఛా శ్రమ శక్తితో కూడిన స్ధానిక మార్కెట్లు రూపొందుతున్నాయని చెప్పేందుకు ఆధారం లేదు. కూలీలకు సాంప్రదాయ రేట్ల ప్రకారమే వస్తు రూపేణా కూడా కూలి చెల్లిస్తున్నారు.
గ్రామీణ భారతంలో ఆర్ధిక-పారిశ్రామికవేత్త తరహా శక్తులు (economic entrepreneurial) ఆవిష్కృతం కాకుండా బ్రిటిష్ భూమి శిస్తు విధానం అడ్డుపడింది. శాశ్వత సెటిల్మెంట్ మరియు రైత్వారీ సంస్కరణలు రెండింటిలోనూ ఉన్నత సెక్షన్లు పెద్దగా ఉత్పాదకతా సామర్ధ్యం లేని ఆదాయ పద్ధతులను ఎంచుకున్నారు. భూములను సబ్ లీజుకు ఇవ్వడం, వడ్డీలకు అప్పులు ఇవ్వడం, వ్యాపారం ఇలాంటి పద్ధతుల్లో కొన్ని. అదనపు కౌలు అద్దె లేదా అధిక వడ్డీ రుణాలను ఆదిమ (పెట్టుబడి) సంచయంగా పరిగణించడానికి వీలు లేదు. ఎందుకంటే అతిముఖ్యంగా ఇందులో ఒక ఉత్పత్తిదారుడి స్ధానంలో మరొకరిని ప్రతిక్షేపించడం మాత్రమే జరిగింది తప్ప వ్యవసాయ యాజమాన్య పద్ధతిలో ఎలాంటి మార్పూ సంభవించ లేదు. కౌలు అద్దె ఒత్తిడి మరియు వడ్డీదారుల డిమాండ్ల మేరకు వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారీకరణ పెరిగింది గానీ ఉత్పత్తి క్రమం పెద్ద మొత్తంలో వ్యాపారీకరణ చెందడానికి ఈ పద్ధతులే ఆటంకం అయ్యాయి.
భారత దేశంలో బ్రిటిష్ పాలన స్ధిరపడే ప్రక్రియ పూర్తి అయ్యాక పలు సమస్యలను లేవనెత్తింది:
మొదటిది: భూస్వామ్య వర్గాల అధికారాన్ని ధ్వంసం చేయడానికి సంబంధించిన సమస్యలు.
రెండోది: భూస్వామ్య వర్గాల మధ్య ఉండే అంతర్గత వైరుధ్యాలు.
భూములకు సంబంధించి వివిధ సెటిల్మెంట్ల ప్రభావాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. వ్యాపార పెట్టుబడి ప్రవేశించినపుడు అది పెట్టుబడిదారీ విధానంగా అభివృద్ధి చెందుతుందని కొందరు సామ్రాజ్యవాద యజమానులు భావించారు. వాస్తవంలో అది వ్యవసాయ వ్యాపారాన్ని ప్రోత్సహించింది తప్ప వ్యవసాయ ఉత్పత్తివిధానం వ్యాపారీకరణ చెందడానికి దోహదపడలేదు. వ్యవసాయంలో పెట్టుబడి సమకూరకుండానే గ్రామాల్లోకి వర్తక పెట్టుబడి ప్రవేశించడానికి సామ్రాజ్యవాద విధానాలు దోహదం చేశాయి.
రెవిన్యూ ఖర్చులను గమనించినట్లయితే వాస్తవం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. వివిధ అంశాల వారీగా ఖర్చులను కింది పట్టికలో చూడవచ్చు. అంకెలు శాతాలను సూచిస్తాయి.
| అంశం | 1841-50 | 1851-60 | 1861-70 | 1871-80 | 1881-90 |
| వసూళ్లపై రెవిన్యూ ఛార్జీలు మొ.వి | 22.10 | 17.84 | 18.36 | 13.99 | 11.55 |
| పౌర పాలన | 22.25 | 21.60 | 18.43 | 17.55 | 15.15 |
| వడ్డీ | 10.69 | 09.88 | 11.33 | 09.25 | 06.02 |
| సైన్యం | 43.64 | 41.69 | 33.56 | 31.95 | 27.85 |
| ప్రజా పనులు | 01.15 | 06.23 | 13.92 | 20.59 | 25.27 |
| కరువు | – | – | – | 03.40 | 02.10 |
| ఇతరములు | 00.30 | 01.90 | 03.40 | 01.00 | 12.11 |
పట్టిక: Emerging Capital in Indian Agriculture (July 1988 పేజీ 246) by Ambica Ghosh నుండి
–
రెవిన్యూలో సగటున 2/3 వంతు సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే ఖర్చు చేయడాన్ని పై పట్టికలో గమనించగలం. శాశ్వత సెటిల్మెంట్లు లేని చోట కూడా అధిక ఆదాయం రాబట్టుకోడానికి మెరుగయిన మౌలిక నిర్మాణ వసతులను అభివృద్ధి చేశారు.
వ్యవసాయ రంగంలో ఇటువంటి పరిస్ధితి బ్రిటిష్ కాలం అంతటా కొనసాగింది.
ఈ తరహా ఆర్ధిక అభివృద్ధి గురించి బుచానన్ ఈ కింది విధంగా సంక్షిప్తీకరించారు.
“భారత దేశం చవిచూసిన మార్పులను పారిశ్రామిక విప్లవంగా కంటే వ్యాపార మార్పులుగా చెప్పడమే ఉచితం అవుతుంది. రైల్వేలలోనూ, విదేశీ వాణిజ్యంలోనూ వేగంగా వచ్చిన మార్పులు వాణిజ్య పంటలలో స్పెషలైజేషన్ కు దారితీసింది. భారతీయ రైతులకేమో ముడి వ్యవసాయ ఉత్పత్తులకు బదులుగా చవక వినియోగదారీ సరుకులను అందజేశారు. స్వయం సమృద్ధమైన స్ధానిక ఆర్ధిక వ్యవస్ధ స్ధానాన్ని అంతర్జాతీయ పోటీ ఆక్రమించింది…” (పై పుస్తకం; పేజీ 252).
బెంగాల్ గవర్నర్ చే నియమించబడిన ఆర్ధిక నిపుణుడు మెక్ నీల్ 1872 లోనే ఇలా వ్యాఖ్యానించారు. “…దరిమిలా ఒక ప్రశ్న తనకు తానుగా ఉద్భవిస్తుంది: దేశంలో అనేక రెట్లు వసూలు చేయబడిన పన్ను ఆదాయం ఫలాలను ఎవరు అనుభవించారు? ప్రభుత్వం నిర్దిష్ట మొత్తాన్ని అనుభవించగా జమీందారులు (భూస్వాములు) లాభాల్లో కొంత భాగాన్ని స్వాయత్తం చేసుకున్నారు. కానీ చాలా చిన్న మొత్తం మాత్రమే రైతుల (వ్యవసాయదారులు) చేతికి వచ్చింది… మొత్తం మీద చూస్తే వ్యవసాయదారుల పరిస్ధితిలో కొంత మెరుగుదల వచ్చిందనడంలో సందేహం లేదు. కూలీల/కార్మికుల వేతనాల డబ్బు విలువ మరియు చిన్న చిన్న ఆస్తుల లాభాలు కూడా కొంత పెరిగిన మాట నిజమే. అయినప్పటికీ వ్యవసాయదారులు ఇంకా తమ తక్షణ అవసరాలు మాత్రమే తీర్చుకోగలిగారు. ఎద్దడి లేదా కరువు పరిస్ధితులు వచ్చినపుడు ఆధారపడడానికి వారి వద్ద మిగులు అనేది ఎన్నడూ సమకూరలేదు…” (అదే పుస్తకం, పేజీ 253)
“వర్తకులు, వడ్డీదారులు… ఈ రెండు వర్గాలు గమనించాల్సిన రెండు ముఖ్యమైన వర్గాలుగా ఎల్లప్పుడూ ఉంటూ వచ్చారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ దేశంలో వృద్ధి చెందుతూ వచ్చిన సంపదలలో అత్యధిక భాగం ఈ రెండు వర్గాలే సమకూర్చుకున్నాయి…” (అదే పుస్తకం; పేజీ 253)
1940లో ఫ్లౌడ్ కమిషన్ కు బెంగాల్ రైతు సంఘం సమర్పించిన మెమోరాండంలో దాదాపు ఇవే అంశాలు ఉన్నాయి. “కౌలు వ్యవసాయం పెరుగుదలకు దోహదం చేస్తున్న ఇతర కారణాల్లో ఒకటిగా వడ్డీదారుడు మరియు భూస్వామిగా రెండు రూపాల్లో ఉండే కొత్త తరహా భూస్వామి వృద్ధి చెందడాన్ని మనం గమనించవచ్చు… ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్ధితుల్లో పారిశ్రామిక సంస్ధలో పెట్టుబడి పెట్టడం కంటే భూముల్లో పెట్టుబడులు పెట్టడమే అతనికి లాభదాయకం; కానీ అతను దాన్ని (భూమిని) తనంతట తానుగా సేద్యం చేసే ఉద్దేశ్యంలో లేడు, సేద్యం చేయని భూస్వామిగా ఉండడానికే అతని ఆసక్తి ఎక్కువ… ఇలాంటి కొత్త తరహా భూస్వామి అప్పటికే జూట్ ధాన్యంలో వ్యాపారిగా కూడా ఉన్నాడు.” (అదే పుస్తకం; పేజీ 253)
ఇటువంటి వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధి కూడా రెండు విభిన్నమైన పంధాలలో సాగింది: (1) టోకు వ్యాపారి తమ ముడి పదార్ధాలను ప్రాసెసింగ్ చేసే వాణిజ్య విస్తరణ ప్రధాన అభివృద్ధి పంధాగా ఉండడం (2) కొన్ని కేసుల్లో ధనిక ఉత్పత్తిదారులే ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేయడం.
వ్యాపారం నుండి మాన్యుఫాక్చరింగ్ కు విస్తరించడంలో భాగంగా వణిజుడు ప్రాసెసింగ్ పరిశ్రమలను అభివృద్ధి చేసినందువలన కలిగిన ప్రభావం పెట్టుబడిదారీ వ్యవసాయ అభివృద్ధికి హానికరంగా మారింది. వారు పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో వ్యవసాయం చేపట్టడానికి బదులుగా వెనుకబడిన వ్యవసాయ ఉత్పత్తి విధానం ద్వారా దోపిడీకి పూనుకున్నారు. చెరుకు నుండి నూనె గింజల వరకు ఇదే కధ పునరావృతం అయింది. ధాన్యం గింజల వ్యాపారంలోని కొన్ని అంశాలలో తప్పితే, ప్రాసెసింగ్ పరిశ్రమ అనేది వాణిజ్య పెట్టుబడికి అనుకూలంగా వ్యవసాయదారుల ఆర్ధిక వ్యవస్ధను విచ్ఛిన్నం కావించే ధోరణిలో కొనసాగింది.
ఇదే కాలంలో జపాన్ నిరంకుశవాద రాజ్యం (absolutist state) లోని మెయిజి పునఃస్ధాపన అనుభవం వీటికంటే భిన్నంగా ఉంది. వాటి గురించి ఇప్పుడు చర్చిద్దాం.
–
– మొదటి 4 భాగాల కోసం కింది లింక్ లలోకి వెళ్ళండి
భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ -పార్ట్ 1
భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ -పార్ట్ 2
భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ -పార్ట్ 3
భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ -పార్ట్ 4
……………ఇంకా ఉంది

శేఖర్ గారు, బ్రిటిష్ ఇండియాలో దేశ ఆర్ధికరంగం ఏవిదంగా మార్పులకు లోనైందో వలసవాదులు మన ఆర్దిక వనరులను ఏవిదంగా కొల్లగొట్టారో? దయచేసి తెలుపగలరు!లేదా వాటికి సంబంధించి ఏవైనా లింకులు ఉంటే అందిచగలరు!