చంద్రుడిని తాకిన మూడో దేశం చైనా


‘చాంగ్-ఎ 3’ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో చైనా అరుదైన రికార్డు సృష్టించింది. చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని దింపిన మూడో దేశంగా చైనా అంతరిక్ష ప్రయోగాల రికార్డు పుటలకు ఎక్కింది. అమెరికా, (పాత) సోవియట్ రష్యా దేశాలు గతంలో ఈ ఫీట్ సాధించాయి. 1970ల తర్వాత చంద్రుడిపై ఒక మానవ నిర్మిత ఉపగ్రహం సాఫ్ట్-ల్యాండింగ్ లో సఫలీకృతం కావడం ఇదే మొదటిసారి. చంద్రుడిపైన ఇంద్రధనుస్సుల అఖాతం (Bay of Rainbows) గా పిలిచే చోట చాంగ్-ఎ 3 ఉపగ్రహం శనివారం రాత్రి గం. 9:11 ని. లకు దిగిందని చైనా ప్రభుత్వ వార్తా సంస్ధ జిన్ హువా తెలిపింది.

చంద్రుడి ఉపరితలంపై సక్రమంగా దిగడం కోసం కొద్ది నిమిషాలు అటూ ఇటూ తిరిగిన చాంగ్-ఎ 3 ఎట్టకేలకు చంద్రుడిపై దిగిందని జిన్ హువా తెలిపింది. సాఫ్ట్ ల్యాండింగ్ వలన ఉపగ్రహానికి ఎటువంటి నష్టము జరగలేదని తెలుస్తోంది. ఛాంగ్-ఎ 3 లో మానవులెవరూ లేరు. ఛాంగ్’ఎ-3 ప్రయోగం విజయవంతం చేసే లక్ష్యంతోనే గతంలో ఛాంగ్’ఎ-1, ఛాంగ్’ఎ-2 ఉపగ్రహాలను చైనా ప్రయోగించింది. ఈ రెండు ప్రయోగాల ద్వారా తగిన అనుభవాలను పొందిన చైనా మూడో దశలో ఉపగ్రహాన్ని విజయవంతంగా చంద్రుడిపై దింపగలిగింది. 2007 లో జరిగిన ఛాంగ్-ఎ 2 ప్రయోగంలో నియంత్రిత పద్ధతుల్లో ఉపగ్రహాన్ని క్రాష్ ల్యాండింగ్ చేశారు.

ఛాంగ్’ఎ-3 ఉపగ్రహం తనతో పాటు ఒక టెలిస్కోపును తీసుకెళ్లింది. ఈ టెలిస్కోపుకు ‘ఛాంగ్’ఎ-3 ప్రోబ్’ అని నామకరణం చేశారు. ఇది సంవత్సరం కాలం పాటు చంద్రుడిపై విధులు నిర్వర్తిస్తుంది. చంద్రుడి ఉపరితలం పై నుండి అంతరిక్ష విశ్వాన్ని పరిశీలించడానికి ఛాంగ్’ఎ-3 ప్రోబ్ ను ఉద్దేశించారు. అతి నీలలోహిత కిరణాలతో పని చేసే కెమెరా కూడా ఛాంగ్-ఎ 3 ఉపగ్రహం పై అమర్చారు. ఈ కెమెరా ద్వారా భూమిని దానిపైన వాతావరణాన్ని అధ్యయనం చేయనున్నారు.

టెలిస్కోపు, కెమెరా లతో పాటు ఛాంగ్’ఎ-3 ఉపగ్రహం పైన ఒక రోవర్ కూడా ఉంచారు. ఇది సూర్య శక్తితో పని చేస్తుంది. మూడు నెలలపాటు చంద్రుడిపై పని చేసే ఈ రోవర్ కు ‘యుటు’ అని నామకరణం చేశారు. చంద్రుడి ఉపరితలంపైన పై భాగంలో ఉండే మట్టిని ఇది అధ్యయనం చేస్తుంది. 100 గజాల మేర వరకూ ఇది అధ్యయనం చేస్తుందని ఆర్.టి తెలిపింది. ఈ వంద గజాలు చుట్టూనా లేక ఉపరితలం నుండి కిందకా అన్నది తెలియలేదు.

(ఈ కింది ఫొటోల్లో మొదటి మూడూ ఏనిమేషన్ చిత్రాలు. నాలవ ఫోటో ఛాంగ్’ఏ-3 చంద్రుడి ఉపరితలంపై దిగుతుండగా  కెమెరా తీసిన నిజమైన ఫోటో.  బీజింగ్ ఏరో స్పేస్ కంట్రోల్ సెంటర్ ఈ ఫోటోలను విడుదల చేసింది.)

Bay of Rainbows ప్రాంతాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే చైనా ఎన్నుకుందని జిన్ హువా తెలిపింది. ఈ ప్రాంతంలో సూర్త్యారశ్మి తగినంతగా సోకుతుందని, సుదీర్ఘ దూరాలకు సమాచారాన్ని చేరవేయడానికి ఇది అనువుగా ఉండే ప్రాంతమని అందుకే చైనా ఈ ప్రాంతాన్ని ఎంచుకుందని పత్రిక తెలిపింది. ఈ ప్రాంతాన్ని ఇంతవరకు ఎవరూ అధ్యయనం చేయలేదని కూడా తెలుస్తోంది. ఛాంగ్’ఎ-3 ప్రోబ్, రోవర్ లు రెండూ ఒకదానికొకటి ఫోటోలు తీసుకుని భూమికి పంపిస్తాయని మొట్టమొదటి ఫోటో ఆదివారం వస్తుందని ఆర్.టి తెలిపింది.

చంద్రుడిపై అమెరికా, సోవియట్ రష్యాలు ప్రయోగించిన ఉపగ్రహాలు దిగినప్పటికీ ఈ ఫీట్ ఇప్పటికీ అంతరిక్ష శాస్త్రజ్ఞులకు ఒక సవాలే అని తెలుస్తోంది. చంద్రుడిపై వాతావరణం బొత్తిగా లేకపోవడం దీనికి ఒక కారణం. వాతావరణం లేనందున (గురుత్వాకర్షణ శక్తి అత్యంత తక్కువ) పారాచ్యూట్ ల సహాయంతో చంద్రుడిపై దిగడానికి వీలు లేదు. రాకెట్ మోటార్ల ద్వారానే ఉపరితలంపై దిగవలసి ఉంటుంది. సరైన కోణంలో, సరైన వేగంతో దిగితేనే ల్యాండింగ్ సులభం అవుతుంది. లేనట్లయితే ఉపగ్రహం దెబ్బతినడానికి, ప్రయోగం విఫలం కావడానికీ అన్నీ అవకాశాలు ఉంటాయి. ఈ అంశాల రీత్యా చైనా ప్రయోగం విజయవంతం కావడం చెప్పుకోదగ్గ విషయమే.

అందుకే రెండు విడతల ప్రయోగాల అనంతరమే చైనా ప్రయోగం విజయవంతం కాగలిగింది. 2007లో చంద్రుడి చుట్టూ పరిభ్రమించే లక్ష్యంతో ఛాంగ్’ఎ-1 ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది. 2010లో ఛాంగ్’ఎ-2 ను చైనా ప్రయోగించింది. ఈ రెండు ప్రయోగాల ద్వారా చంద్రుడి ఉపరితలాన్ని చైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. ఈ అధ్యయనం ద్వారానే Bay of Rainbows ప్రాంతం ఉపగ్రహ ప్రయోగాలకు అనువైన ప్రాంతంగా చైనా గుర్తించింది. ఛాంగ్’ఎ-1 ప్రయోగంలో చంద్రుడి పూర్తి దృశ్యాన్ని ఆపోసన పట్టిన చైనా ఛాంగ్’ఎ 2 ద్వారా తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించుకుంది.  ఛాంగ్’ఎ అంటే చైనా భాషలో ‘చంద్ర దేవత’ అని అర్ధం.

2017లో మరో ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి చైనా సన్నాహాలు చేస్తోంది. ఈసారి ప్రయోగంలో ప్రోబ్, రోవర్ లను చంద్రుడి మీదకు పంపనున్న చైనా ప్రోబ్ ను తిరిగి భూమి మీదకు తెచ్చే ఉద్దేశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. 2020 నాటికల్లా అంతరిక్షంలో ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసుకునే దిశగా చైనా కృషి చేస్తోంది. అంతరిక్షం లోకి మనిషిని పంపడానికి 1992లోని ప్రయత్నం ప్రారంభించిన చైనా 2003 నాటికి సఫలం అయింది. 2003లో తమ మొదటి టైకోనాట్ (అమెరికాకు ఆస్ట్రోనాట్, రష్యాకు కాస్మోనాట్) ఐన ‘యాంగ్ లివీ’ ను అంతరిక్షంలోకి చైనా పంపింది. ఈ ప్రయోగాలన్నీ పెరుగుతున్న చైనా ప్రభావాన్నీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్నీ తెలియజేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

One thought on “చంద్రుడిని తాకిన మూడో దేశం చైనా

వ్యాఖ్యానించండి