సీమాంధ్ర ఎం.పిల అవిశ్వాస తీర్మానానికి మద్దతు కరువు


Cong leaders

సీమాంధ్ర కాంగ్రెస్ ఎం.పిల అవిశ్వాస తీర్మానానికి మద్దతు కరువైనట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ప్రాంతాల్లోని ఇతర పార్టీల ఎం.పిల మద్దతు కూడగట్టినప్పటికీ ఇతర పార్టీలు మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడప్పుడే ఎన్నికలను ఎదుర్కొనే పరిస్ధితి ఏ పార్టీకి లేకపోవడమే దీనిని ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చివరికి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కూడా అవిశ్వాసం తెలపడానికి నిరాకరించారని ది హిందు పత్రిక తెలిపింది.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దల పరువు తీసేస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ ఎం.పి లు స్పీకర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలతో సహా ఎవరూ ఈ పరిణామాన్ని ఊహించలేదు. ఈ పరిణామాన్ని ఊహించలేదని కాంగ్రెస్ ప్రతినిధి పి.సి.చాకో విలేఖరులతో మాట్లాడుతూ అంగీకరించడం గమనార్హం. అనూహ్య పరిణామంతో తల్లడిల్లిన కాంగ్రెస్ పెద్దలు వెంటనే వ్యూహకర్తలను రంగంలోకి దించి ప్రమాదాన్ని నివారించినట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎం.పి లు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదిస్తూ స్పీకర్ మీరా కుమార్ కు వేరు వేరుగా నోటీసులు ఇచ్చారు. ఈ తీర్మానంపై చర్చ జరగాలంటే నిబంధనల ప్రకారం కనీసం 10 శాతం సభ్యుల మద్దతు అవసరం. అనగా కనీసం 55 మంది ఎం.పిలు ఈ తీర్మానానికి మద్దతు ఇస్తున్నారన్న సంగతి స్పీకర్ దృష్టికి రావాలి. కానీ ఈ మేరకు ఎవరెవరు తీర్మానానికి మద్దతు ఇస్తున్నదీ వివరాలు ఇవ్వడంలో తీర్మానం ప్రతిపాదకులు విఫలం అయినట్లు తెలుస్తోంది. వివిధ పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరినప్పటికి వారికి సానుకూల స్పందన రాలేదని ది హిందు తెలిపింది.

Telangana No-confidenceఅవసరమైనంత మంది ఎం.పి ల మద్దతు లేకపోయినప్పటికీ తమకు తగిన సంఖ్యాబలం ఉందని చెప్పుకోవడంలో సీమాంధ్ర ఎం.పి లు వెనుకబడి లేరు. అయితే మూడు పార్టీలు వేరు వేరుగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడాన్ని బట్టి ప్రభుత్వాన్ని పడగొట్టి తెలంగాణ ఏర్పాటు అడ్డుకోవడం కన్నా ప్రత్యర్ధులకన్నా ఒకడుగు ముందుండి సీమాంద్ర ప్రజల కరుణాకటాక్షాలు పొందడం పైనే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా విభజనను అడ్డుకోదలిస్తే ఈ ఎం.పిలు అందరూ ఒక బృందంగా ఏర్పడి ఒకేసారి వివిధ పార్టీల నాయకులను కలిస్తే ప్రజలకు నమ్మకం కలగవచ్చు. వారు నిజంగానే ప్రయత్నిస్తున్నారని ఒక అవగాహనకు రావచ్చు. కానీ లక్ష్యం ఒకటే అని చెబుతూ పార్టీల ఐడెంటిటీని వదులుకోకపోవడం బట్టి వారి ఉద్దేశ్యాలు వేరు అని అర్ధం చేసుకోవాల్సి వస్తోంది.

తమకు 55 మంది ఎం.పిల మద్దతు ఉన్నదని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. కానీ అందుకు తగిన వాతావరణం మాత్రం కనిపించడం లేదు. కనీసం పార్టీల నాయకుల మద్దతు ప్రకటనలు రాబట్టుకోవడంలో కూడా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. “ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా మాకు మద్దతు లభిస్తోంది. మేము ఇంకా తగిన సంఖ్యాబలం సమకూర్చుకోవడానికి కృషి చేస్తున్నాం” అని విజయవాడ ఎం.పి లగడపాటి రాజగోపాల్ విలేఖరులతో అన్నారు. అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎం.పిల్లో లగడపాటి ఒకరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ఇటీవల కూడా ఆగడపాటి ప్రకటించారు.

కాంగ్రెస్ ఎం.పిల అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా భాష్యం చెబుతున్నారు. తమ నిరసన తెలియజేయడానికే కాంగ్రెస్ ఎం.పి లు అవిశ్వాసం నోటీసు ఇచ్చారని అంతకుమించి పారముఖ్యం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాధ్ వ్యాఖ్యానించారు. పార్టీ ప్రతినిధి పి.సి చాకో మాత్రం హెచ్చరిక స్వరాన్ని మిళితం చేశారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చిన 6గురు ఎం.పిలపై చర్యలు తప్పవని ఆయన బుధవారం స్పష్టం చేశారని తెలుగు ఛానెళ్లు చెప్పాయి.

ఇదిలా ఉండగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణాఫ్రికా పర్యటన నుండి వెనక్కి వచ్చేశారు. తెలంగాణ తీర్మానం పైన ఆయన దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. సీమాంద్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టి.డి.పి ఎం.పి లు ఆయనను కలిసినట్లు కూడా తెలుస్తోంది. అసెంబ్లీ, తన అభిప్రాయం చెప్పడానికి ఎన్ని రోజులు గడువు ఇవ్వాలన్న విషయంలో పాత సాంప్రదాయాలు పాటించాలని వారు కోరారని ఛానెళ్లు చెప్పాయి. బి.జె.పి/ఎన్.డి.ఏ ప్రభుత్వ కాలంలో అసెంబ్లీ అభిప్రాయం కోసం రాష్ట్రపతి 45 రోజుల గడువు ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ కి కూడా ఇదే విధంగా 45 రోజులు గడువు ఇవ్వాలని గతం నుండే సీమాంధ్ర నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేతలను కాదని రాష్ట్రపతి సొంత నిర్ణయం తీసుకుంటారా అన్నది అనుమానాస్పదమే. సోనియా తదితరుల నిర్ణయాన్ని కాదనేంతగా భేదాభిప్రాయాలు కూడా ప్రణబ్ ముఖర్జీ కి ఉన్నట్లుగా ఈ మధ్యకాలంలో సూచనలేవీ లేవు. అలాంటిది ప్రణబ్ ముఖర్జీ కోరి సమస్య తెచ్చుకోగలరా?

2 thoughts on “సీమాంధ్ర ఎం.పిల అవిశ్వాస తీర్మానానికి మద్దతు కరువు

  1. కాంగ్రెసువాదిగా (ఆ మాటకు అసలు అర్థం అధిష్టానానికి వీరవిదేయుడుగా) ఇన్నాళ్ళూ జీవితాన్ని పునీతం చేసుకొని, ఆ కాంగెసు అధిష్టానం కృపతో రాష్ట్రపతిహోదాకు వచ్చిన శ్రీప్రణబ్‌గారు కోరి సమస్య తెచ్చుకోగలరా అధిష్టానంతో? అబ్బే!

  2. చేతకాని దద్దమ్మలకు నోటిదూల ఎక్కువ. ప్రతివాడు మీడియా ముందు మ్యాడ్ మూడ్ తో బట్టలు చింపుకుని మాట్లాడుతున్నారు. ఆరు నూరైనా నూరు ఆరైనా కేంద్రం చేతిలో రాష్ట్ర విభజన జరిగి తీరుతుంది. రాష్ట్రపతి తన పరపతిని పార్లమెంట్ అభిష్టానికి, అధిష్టానానికి వ్యతిరేకంగా పణంగా పెట్టరు. నియోజకవర్గ ప్రజల ముందు మొహాలు చెల్లక హస్తినలో మాటలు వల్లిస్తున్నారు. సొల్లుకార్చుకోవడం తప్ప ప్రయోజనం లేదు.

వ్యాఖ్యానించండి