ప్రపంచంలో అత్యంత భద్రమైన దేశాల్లో ఒకటిగా పరిగణించే సింగపూర్ ఆదివారం దాడులు, దహనాలతో వార్తల్లో నిలిచింది. అల్లర్లకు కారకులంటూ సింగపూర్ ప్రభుత్వం 27 మందిని అరెస్టు చేయగా వారిలో 24 మంది భారతీయులే. నగర రాజ్యం (city state) గా పిలిచే సింగపూర్ ప్రధానంగా వలస కార్మికుల శ్రమ పైనే ఆధారపడే దేశం. భారత దేశం నుండి వలస వెళ్ళిన కార్మికుడు ఒకరిని బస్సు ఢీ కొట్టి చంపడంతో అల్లర్లు చెలరేగినట్లు పత్రికలు చెబుతున్నాయి. అయితే అల్లర్లకు కారణం ఏమిటన్నది ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
నిర్మాణ కూలిగా పని చేస్తున్న శక్తివేల్ కుమారవేలు (33) ను ఆదివారం రాత్రి ఒక ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ‘లిటిల్ ఇండియా’ జిల్లా గా పిలిచే జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనతో అక్కడి భారతీయ కార్మికులు అగ్రహోదగ్రులై అల్లర్లకు దిగారని తెలుస్తోంది. 400 మందికి పైగా దక్షిణాసియా కార్మికులు గంట పాటు దహనాలకు, దాడులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. స్పెషల్ కమెండోలు రంగంలోకి దిగి అల్లర్లను అదుపు చేశారని ప్రభుత్వ ప్రకటన తెలియజేస్తోంది.
అల్లర్లు, దాడుల్లో 39 మంది పోలీసులు గాయపడ్డారని, పౌర అధికారులు కూడా గాయపడ్డారని ప్రభుత్వం ప్రకటించింది. 16 పోలీసు కార్లతో సహా 25 వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారని తెలిపింది. అల్లర్లకు, దహనాలకు బాధ్యులను చేస్తూ 27 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 24 మంది భారతీయులే. ఇద్దరు బంగ్లా దేశీయులు కాగా ఒకరు సింగపూర్ దేశస్ధుడు. వీరిపై మోపిన కేసులు రుజువైతే 7 యేళ్లవరకు జైళ్ళలో గడపాల్సి వస్తుందని ది హిందు పత్రిక తెలిపింది. ఈ స్ధాయిలో అల్లర్లు జరగడం సింగపూర్ లో 40 సం.ల తర్వాత ఇదే మొదటిసారని వివిధ పత్రికలు చెబుతున్నాయి.
ప్రమాదంపై విచారణ చేయడానికి ప్రత్యేక కమిటీ నియమిస్తున్నట్లు సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్ ప్రకటించాడు. కార్మికుల హింసాత్మక నిరసన వల్లనే ప్రభుత్వం నుండి ఈ మాత్రం స్పందన వచ్చిందని విశ్లేషకులు సూచిస్తున్నారు. వలస కార్మికులకు అత్యంత దారుణమైన వేతనాలు చెల్లిస్తారని, వారి పని, నివాస పరిస్ధితుల గురించి పట్టించుకోరని, దాని ఫలితంగానే అల్లర్లు జరిగాయని వారు సూచిస్తున్నారు.
ద స్ట్రైట్స్ టైమ్స్ పత్రిక ప్రకారం ప్రమాదంలో ఉన్న బస్సు కార్మికులను చేరవేయడానికి ఉద్దేశించినదే. అప్పటికే నిండుగా ఉన్న బస్సులోకి శక్తివేల్ ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ డ్రైవర్ అతను ఎక్కడానికి అంగీకరించలేదు. పరుగెత్తుతూ ఎక్కిన శక్తివేల్ ను దిగిపొమ్మని కోరాడు. డ్రైవర్ గట్టిగా చెప్పడంతో శక్తివేల్ దిగిపోయాడు. ఆయన దిగుతుండగానే బస్సు పక్క రోడ్డులోకి తిరగడంతో వెనక చక్రాల కిందపడి శక్తివేల్ చనిపోయాడు. దానితో అక్కడ గుమి కూడిన కార్మికులు ఆగ్రహంతో దాడులకు దిగారు.
ప్రపంచంలోని సంపన్న దేశాల్లో సింగపూర్ ఒకటి. ఈ సంపదలను ఉత్పత్తి చేసేది ప్రధానంగా వలస కార్మికులే. వలస కార్మికులే లేకపోతే ఆ దేశంలో శారీరక శ్రమ చేసేవారే ఉండరు. సింగపూర్ అధికారిక జనాభా 3.8 మిలియన్లు కాగా పని వెతుక్కుంటూ వలస వచ్చిన కార్మికుల సంఖ్య 1.8 మిలియన్లు. శారీరక శ్రమలు చేసే వలస కార్మికులను హీనంగా చూడడం సింగపూర్ దేశస్ధుల అలవాటని, ఫలితంగా కార్మికుల్లో అసంతృప్తి గూడు కట్టుకుని ఉన్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అల్లర్లను సాకుగా చూపుతూ ఇంటర్నెట్ లో వలస కార్మికులపై విద్వేష ప్రచారం ఊపందుకుందని వీరు ఎత్తి చూపుతున్నారు.
సింగపూర్ ప్రధాని జారీ చేసిన ప్రకటన కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తోంది. “విస్తారమైన విదేశీ కార్మికులు ఈ దేశ చట్టాలను పాటిస్తున్నారు. వారు ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి తోడ్పడుతున్నారు. జీవిక కోసం కష్టపడుతూ తమ దేశాల్లో తమవారిని పోషించుకుంటున్నారు. ఈ ఒక్క సంఘటనను బట్టి కార్మికులపై మనకు ఉన్న అభిప్రాయాలను చెరపకూడదు. విద్వేషపూర్వకమైన వ్యాఖ్యలను కట్టి పెట్టాలి. విదేశీయుల పట్ల అసాధారణ విముఖతను ప్రదర్శించరాదు. ముఖ్యంగా ఆన్ లైన్ లో ఇలాంటివి జరగకూడదు” అని సింగపూర్ ప్రధాని లీ లూంగ్ తన ప్రకటనలో కోరారు.
సామాజిక శాంతికి తానే చిరునామా అని సింగపూర్ తరచుగా చెప్పుకుంటుంది. వివిధ జాతులు సామరస్యంగా జీవనం సాగిస్తారని చెబుతుంది. కానీ అత్యంత కట్టుదిట్టమైన చట్టాలను అమలు చేస్తూ అసంతృప్తి బైటికి కనపడకుండా చేయడం సింగపూర్ ప్రత్యేకత అని విమర్శకులు చెప్పే మాట! వలస కార్మికులు ఎదుర్కొంటున్న దీన పరిస్ధితులే తాజా అల్లర్లకు కారణం అన్న విమర్శకుల అభిప్రాయాన్ని సింగపూర్ ప్రభుత్వం మాత్రం తిరస్కరిస్తోంది.
మద్యం సేవించడం వల్లనే అల్లర్లు జరిగాయని సింగపూర్ రవాణా మంత్రి ఓ విచిత్ర కారణం చెప్పడం విశేషం. ఈ కారణాన్ని చూపుతూ ‘లిటిల్ ఇండియా’ జిల్లాలో మద్యం అమ్మకాలను నియంత్రించాలని అప్పుడే కొందరు డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఈ లెక్కన ప్రతి దేశంలోనూ, ప్రతి రోజూ, ప్రతి గంటా అల్లర్లు జరగాల్సి ఉంటుంది. కార్మికుల్లో పేరుకు పోతున్న అసంతృప్తిని మరుగుపరచడానికి, ఉన్న వాస్తవాన్ని నిరాకరించడానికి పూనుకుంటే ఇలాంటి సంబంధం లేని కారణాలే వల్లించబడతాయి కాబోలు!
సింగపూర్ జనాభాలో (3.8 మిలియన్లు) 74 శాతం మంది చైనా జాతీయులు. మలయ్ ముస్లింలు 13.3 శాతం ఉంటారు. మిగిలినవారిలో భారతీయ సంతతివారు, యూరేసియా ప్రాంతం నుండి వచ్చి స్ధిరపడినవారు ఇంకా ఇతర జాతుల వారు ఉంటారు. వీరి మధ్య 1969 లో ఘర్షణలు జరిగాయి. అప్పటి నుండి నిరసన ప్రదర్శనలపై కఠిన నిబంధనలు విధించారు. అసంతృప్తి పేరుకుపోయినపుడు ప్రజాస్వామిక వ్యక్తీకరణకు ఈ నిబంధనలే ఆటంకం అవుతూ అల్లర్ల రూపంలో బద్దలు కావడం సామాజిక నియమం. సింగపూర్ లో జరిగింది కూడా అదే కావచ్చు.








ఎక్కడైనా వలస కార్మికులు ద్వితియశ్రేణి పౌరులుగా బ్రతకాల్సిందేనా? వలస కార్మికుల చట్టాలు ఎందుకు ఉన్నాయి? వాటికిసరైన భద్రత ఎక్కడా లభించదా?
భారత జనాభ ఎక్కడవున్నా ఆవేశం,మూర్ఖత్వం, ఆందోళన, అక్కడ ప్రత్యక్షమవుతుంది. చట్టబద్ధత, జనభద్రతకు విలువనిచ్చే దేశం సింగపూర్. నిబద్ధతకు తిలోదకాలిచ్చే భారతీయులు ప్రపంచంలో ఏ మూలున్నా వారి బుద్ధి మారదు పైగా ప్రశాంత వాటావరణాన్ని నిర్వీర్యంచేసి దైనందిక ప్రజా జీవనంలో ఒడుదుడుకులను సృష్టించినప్పుడు ఈ శృంగభంగం జరగవలసినదే. సింగపూర్ ప్రభుత్వ చర్యలు సమర్ధనీయం.