ఆరిపోయిన నల్ల వజ్రానికి ప్రపంచం నివాళి -ఫోటోలు


27 సంవత్సరాల కారాగారవాసం సైతం రొలిహ్లాహ్లా మండేలాను కుంగదీయలేదని చెప్పడానికి  95 యేళ్ళ ఆయన నిండు జీవితానికి మించిన సాక్ష్యం ఏముంటుంది? బలమైన శత్రువుకు వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టడానికి ప్రారంభంలో గాంధీ అహింసా సిద్ధాంతాన్ని ఎత్తుగడల రీత్యా ఆశ్రయించిన మండేలా జాత్యంకార అణచివేతను నిర్ణయాత్మకంగా ఓడించాలంటే సాయుధ పోరాటం తప్ప దారి లేదని సరిగ్గానే అంచనా వేశారు. ఏ.ఎన్.సి యువజన సంస్ధ సాయుధమై మిలిటెంట్ గెరిల్లా పోరాటమే చేయకపోతే మండేలా విడుదల సాధ్యం అయ్యేదే కాదని చరిత్ర పరిశీలకుల నిశ్చితాభిప్రాయం.

ఏ.ఎన్.సి గెరిల్లా పోరాటానికి తగిన మిలట్రీ ఎత్తుగడల శిక్షణను  వియత్నాం కమ్యూనిస్టు పార్టీ అందజేసిందన్న సంగతి చాలామందికి తెలియదు. మహారాక్షస ఆయుధ బలగాలకు యజమాని అయిన అమెరికా సామ్రాజ్యవాదాన్నే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించడమే కాక తమ దేశం నుండి తరిమి తరిమి కొట్టిన వియత్నాం కమ్యూనిస్టు గెరిల్లాలతో సావాసం చేయడం బహుశా ఏ.ఎన్.సి తీసుకున్న అత్యున్నత నిర్ణయాల్లో మొదటి స్ధానంలో ఉండవచ్చు.

ముఖ్య యోధుడు కారాగారం పాలయినా ఎ.ఎన్.సి (ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్) పోరాట పటిమ తగ్గలేదంటే దానికి ఒక కారణం వారు తీసుకున్న గెరిల్లా శిక్షణ అనడంలో సందేహం లేదు. తమ దోపిడి నిరాఘాటంగా కొనసాగించుకునే ఎత్తుగడల్లో భాగంగానే శ్వేత జాత్యహంకారం మండేలాతో రాజీకి సిద్ధపడింది. కానీ ఈ రాజీలో దక్షిణాఫ్రికా ప్రజలు ఆధిక్యత సాధించలేకపోవడం ఒక విషాధం. ముగింపు ఎలా ఉన్నప్పటికీ మండేలా త్యాగనిరతి వెలకట్టలేనిది. అందుకే ప్రపంచం మొత్తం ఆయనకు అందిస్తున్న నివాళి ఆవశ్యమే.

ప్రాక్పశ్చిమ దేశాలన్నీ ఆఫ్రికా నల్ల యుగ నాయకునికి ఆర్పిస్తున్న నివాళులను వివిధ ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించగా బోస్టన్ గ్లోబ్ పత్రిక ప్రచురించింది.

One thought on “ఆరిపోయిన నల్ల వజ్రానికి ప్రపంచం నివాళి -ఫోటోలు

  1. పింగ్‌బ్యాక్: ఆరిపోయిన నల్ల వజ్రానికి ప్రపంచం నివాళి -ఫోటోలు | ugiridharaprasad

వ్యాఖ్యానించండి