దళిత యువకులు చీప్ గా దొరికే నల్ల కళ్ళద్దాలు తగిలించి, జీన్స్ ఫ్యాంటు, టీషర్టులు తొడుక్కుని వన్నియార్ కుల యువతులను వలలో వేసుకుంటున్నారని తమిళనాడు వన్నియార్ పార్టీ పి.ఎం.కె తరచుగా చేసే ఆరోపణ. ఈ ఆరోపణ ఆధారంగానే పి.ఎం.కె పార్టీ కులాంతర వివాహాలను నిషేధించాలనే వరకూ వెళ్లింది. పి.ఎం.కె ఆరోపణలకు భిన్నంగా వన్నియార్ యువకుడొకరు దళిత యువతిని పెళ్లాడినా ఆ పార్టీ విషం చిమ్మడం మానలేదు. వారి నుండి రక్షణ కోసం దళిత యువతి తుపాకి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా, అందుకు ఆమె కుటుంబంపై దాడి చేసి కక్ష తీర్చుకున్న ఉదంతం ఇది.
దళిత యువతి ఎస్.సుధ, వన్నియార్ యువకుడు జి.సురేష్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికొక బాబు కూడా. ది హిందు పత్రిక ప్రకారం వారు అనేక రోజులుగా వన్నియార్ కుల సంఘం నాయకులు, కార్యకర్తల నుండి వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రక్షణ కూడా కల్పించారు. అయినా వేధింపులు ఆగలేదు. ఇటీవల ఇళవరసన్-దివ్యల ఉదంతం రచ్చకెక్కాక వేధింపులు ఇంకా తీవ్రం అయ్యాయని సురేష్ తెలిపారు.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ప్రకారం సుధ దళిత కులానికి చెందిన యువతి అని గ్రామస్ధులకు ఇటీవల వరకు తెలియదు. ఇరువైపుల తల్లిదండ్రుల అనుమతితోనే ఏప్రిల్ 21, 2010 తేదీన వారి వివాహం జరగ్గా మే 2 012 లోనే ఈ సంగతి గ్రామస్ధులకు తెలిసింది. తెలిసినప్పటి నుండి వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. వారిని గుడిలోకి రాకుండా నిషేదించారు. మంచినీళ్ళు పట్టుకునే దగ్గర వివక్ష చూపడం ప్రారంభించారు.
వేధింపులు సహించలేని సుధ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హై కోర్టు ధర్మపురి జిల్లా ఎస్.పి ని ఈ విషయం పరిశీలించాలని పురమాయించింది. ఎస్.పి ఆదేశాల మేరకు సురేష్ కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించారు. రక్షణ కోసం ఇద్దరు పోలీసులను నియమించినప్పటికీ వారిని వెలివేయడం మాత్రం ఆగలేదు. ఈ సంగతి పోలీసులకు చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఎస్.పి, డి.ఎస్.పి లు కూడా పట్టించుకోలేదని సురేష్ చెప్పారు.
“మరియమ్మ గుడిలోకి ప్రవేశించడానికి మేము ప్రయత్నించినప్పుడు పూజారి, ఇతర నలుగురు వ్యక్తులు మమ్మల్ని రానీయకుండా తలుపులు వేసుకున్నారు. మేము ఈ విషయం హరూర్ డి.ఎస్.పి వి.సంపత్, బొమ్మిడి ఇనస్పెక్టర్ మురుగేషన్ లకు ఫిర్యాదు చేశాను. కానీ వారు ఏ చర్యా తీసుకోలేదు. నిజానికి మమ్మల్ని ఊరు విడిచి వెళ్లాలని డి.ఎస్.పి సలహా ఇచ్చారు. మురుగేషన్ అయితే మాపైన తప్పుడు కేసులు బనాయిస్తామని కూడా బెదిరించాడు” అని సురేష్ గత ఆగస్టు నెలలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికకు తెలిపాడు.
మురుగేశన్ హెచ్చరించినట్లే జరుగుతోందని ది హిందూ రిపోర్టు ద్వారా అర్ధం అవుతోంది. ఆత్మ రక్షణ కోసం తనకు తుపాకి లైసెన్స్ ఇప్పించాలని కోరుతూ జాతీయ ఎస్.సి కమిషన్ కు సుధ దరఖాస్తు చేసుకోగా, పరిస్ధితిని విచారించడానికి పోలీసు ఉన్నతాధికారులు, రెవిన్యూ అధికారులు వచ్చి వెళ్లారు. ఆర్.డి.ఓ మేనక, డి.ఎస్.పి సంపత్ లు గ్రామాన్ని సందర్శించినవారిలో ఉన్నారు. అధికారులు అలా వెళ్లారో లేదో ఆ గ్రామ మాజీ సర్పంచి నేతృత్వంలో వన్నియార్ కులస్ధులు ఇలా వచ్చి దాడి చేసి కొట్టారు. వారి దాడిలో సుధ-సురేష్ ల కుటుంబ సభ్యులు 8 మంది గాయపడ్డారని ది హిందు తెలిపింది.
అయితే ఈ దాడిలో గాయపడింది సురేష్ తదితర కుటుంబ సభ్యులు కాగా సుధ దాడి చేయడం వల్లనే ఘర్షణ తలెట్టిందని డి.ఎస్.పి సంపత్ ది హిందు పత్రికకు చెప్పడం విశేషం. పోలీసుల సమక్షంలోనే సుధ మాజీ సర్పంచ్ రంగనాధన్ పైన సుధ దాడి చేసిందని, ఆమెను వారించబోయిన పోలీసులపైన కూడా ఆమె దాడి చేసిందని డి.ఎస్.పి చెబుతున్నాడు. ఆమె దాడిలో రంగనాధన్, ఇంకా పలువురు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని కూడా డి.ఎస్.పి చెప్పాడు. ఒక దళిత మహిళ మధ్యంతర కులస్ధుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆమెపైన ఎలాంటి కేసులు పెట్టవచ్చో తమిళనాడు పోలీసులు ఈ విధంగా లోకానికి చెప్పదలిచారా? విచిత్రం ఏమిటంటే సుధ చేసిన దాడిలో ఆమె భర్త ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారని కూడా పోలీసులు చెప్పకపోవడం. కేవలం ఒకే ఒక్క (దళిత) మహిళ దాడిలో గ్రామ మాజీ సర్పంచి, ఇద్దరు పోలీసులు, ఇంకా ఇతర గ్రామస్ధులు కొందరు గాయపడ్డారట! పోలీసులు తలచుకుంటే కనపడని దెబ్బలే కాదు, చేయలేని దాడులు కూడా దళిత మహిళపైన మోపవచ్చు?!
వన్నియార్ ల దాడిలో గాయపడిన సురేష్ ఫోటోలను పత్రికలు ప్రచురించాయి గాని సుధ దాడిలో గాయపడిన మాజీ సర్పంచి, పోలీసుల ఫోటోలు మాత్రం ఎక్కడా లేవు. కులాంతర వివాహం చేసుకున్న జంటకు రక్షణ కల్పించడం మాని ఊరి నుండి వెళ్లిపోవాలని సలహా ఇవ్వడం, ఇంకా మాట్లాడితే తప్పుడు కేసులు పెడతామని బెదిరించడం, చివరికి చెప్పినట్లుగానే తమ బెదిరింపులను ఆచరించి చూపడం… మామూలుగా అయితే ఇలాంటివి జరుగుతాయని త్వరగా ఊహించలేము. భారత దేశంలోని వివక్షాపూరితమైన కుల సమాజానికి ఇలాంటివి చేసి చూపడం చాలా తేలిక.
