తెలంగాణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జి.ఓ.ఎం సభ్యులు రాయల తెలంగాణకు మొగ్గు చూపుతున్నట్లు సోమ, మంగళవారాల్లో దాదాపు పత్రికలన్నీ ఊహాగానాలు చేశాయి. కానీ మంగళవారం రాత్రికి జి.ఓ.ఎం సభ్యులు మళ్ళీ 10 జిల్లాల తెలంగాణే బెటర్ అని భావించినట్లు తెలుస్తోంది. రాయల తెలంగాణను బి.జె.పి దృఢంగా తిరస్కరించడమే దానికి కారణం అని ది హిందు తెలిపింది.
బి.జె.పి మద్దతు లేకుండా ఆంధ్ర ప్రదేశ్ విభజన అసాధ్యం. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాలంటే బి.జె.పి మద్దతు తప్పనిసరి. కాబట్టి బి.జె.పి వ్యతిరేకించే ప్రతిపాదనలను జి.ఓ.ఎం చేయలేదు. టి.ఆర్.ఎస్ కూడా గట్టిగా వ్యతిరేకిస్తోంది. బుధవారం మరోసారి జి.ఓ.ఎం సమావేశం అవుతుందని ఈ సమావేశంలో ఆటో ఇటో తేల్చేయవచ్చని భావిస్తున్నారు. బి.జె.పి తోడు లేకుండా ఎలాంటి ప్రతిపాదనా ముందుకు వెళ్లదని ఒక సీనియర్ కేంద్ర మంత్రి చెప్పినట్లు పత్రిక తెలిపింది.
ది హిందు కధనం బట్టి ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదనకు మద్దతు కంటే వ్యతిరేకతే ఎక్కువ వ్యక్తం అయింది. మంగళవారం జరిగిన సమావేశంలో బిల్లు ముసాయిదాను విశాల ప్రాతిపదికన ఒక అంగీకారానికి వచ్చారు. అయితే అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన జి.ఓ.ఎం లో పెద్దగా ముందుకు సాగలేదు.
మంగళవారం (డిసెంబర్ 3) గంట సేపు సమావేశం అయిన జి.ఓ.ఎం ముసాయిదాను మళ్ళీ న్యాయ మంత్రిత్వ శాఖకు పంపాలని నిర్ణయించింది. చట్టపరమైన ఇబ్బందులు లేకుండా భాషలో తగిన మార్పులు చేయడం ద్వారా శుద్ధి చేయాలని న్యాయశాఖను కోరాలని నిర్ణయించారు. బుధవారం సాయంత్రం 8 గంటలకు జి.ఓ.ఎం అంతిమ సమావేశం జరుపుతుందని ఒక సీనియర్ మంత్రి ది హిందు పత్రికకు తెలిపారు.
రాయలసీమకు చెందిన రెండు జిల్లాలను కలపాలా లేదా అన్న విషయంపై మరోసారి చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కానీ దానికి వ్యతిరేకంగా తెలంగాణలో ఆందోళనలు జరుగుతున్నాయి. అనేకమంది తెలంగాణ నాయకులు ఢిల్లీకి చేరుకుని తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. బి.జె.పి, టి.ఆర్.ఎస్ లయితే రాయల తెలంగాణకు ఒప్పుకునేదే లేదని తేల్చి చెప్పాయి. టి.ఆర్.ఎస్ పార్టీ డిసెంబర్ 5 తేదీన బంద్ కు కూడా పిలుపు ఇచ్చింది.
కేంద్ర సర్వీసుల అధికారుల పంపకం గురించి జి.ఓ.ఎం మంగళవారం చర్చించింది. విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో ఎక్కడ పని చేసేదీ ఎంపిక చేసుకునేవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగే సమావేశంలో లోక్ సభ, శాసన సభ స్ధానాల విభజన, పెన్నా నది జలాల పంపిణీ అంశాలను చర్చిస్తారు.
ఇప్పటి హై కోర్టును ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే కేటాయించాలని జి.ఓ.ఎం నిర్ణయించింది. అనగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త హై కోర్టును ఏర్పాటు చేస్తారు.
చలికాలం పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు తేకుండా ఉండడానికే రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని బి.జె.పి నాయకుడు వెంకయ్య నాయుడు ఆరోపించారు. మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకు కూడా ఈ ప్రతిపాదన తెచ్చారని, కాంగ్రెస్ కి అంతా తమాషాగా మారిందని ఆయన విమర్శించారు. రాయల తెలంగాణ విషయం ఇంతవరకు తమకు చెప్పలేదని, తాము మాత్రం తమ నిర్ణయం మార్చుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.

నిప్పులాంటి కె.సి.ఆర్. ప్రతిష్ట మీద ఉప్పును చల్లి అధిష్టానం తన దిష్టి తాను తీసుకుంటు రాయలతెలంగాణా ఖరారు చేసి మరోమారు తెలంగాణ గుండెల్లో మంటలను ఎగదోసి ఆంధ్రా రాజకీయాల దృష్టిని సారించే నాటకాలకు తెర తీసింది. విభిన్న కోణాలలో పరుగులు తీసే విభజన సోనియమ్మ రాజకీయ సోదితో మన్మోహనంగా ఆడుకుంటున్నారు. కుంటుపడిన రాష్ట్ర పునరోత్పత్తికి స్వస్తి పలికి పదవీ రాజకీయ ఆస్తికి ఓటుకారం చుడుతున్నారు. రాయల రెండు జిల్లాలు తెలంగాణా పది జిల్లాలకు చెక్ లాంటిదయితే సీమ రాజకీయ చదరంగంలో తిరుగులేని ఎత్తు. ఆధిపత్యపోరును నిలిపి తెలంగాణాను కుడి నుంచి ఎడమ కాలి కింద వుంచడమే లక్ష్యంగా తీసుకున్న సాక్ష్యం. దీనికంటే హైద్రాబాద్ ని యూ.టి. చేస్తే ఆధిపత్యానికి అడ్డుకట్ట పడేది. ఏ హైద్రాబాదు కోసం తెలంగాణా గుండెలు బాదుకుందో, ఆగుండెలను రాయల చురకత్తులు అడ్డంగాకోసి ఫ్యాక్షనిజన్ని నిజం చేసింది. రాష్ట్ర పునర్విభజన మేయరు పదవిని కాంగ్రెస్, మజ్లీస్ పంచుకునే రితిలోలాగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి తెలంగాణాకు రెండేళ్ళు, రాయలసీమకు మూడేళ్ళు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టే ఆలోచనలో జి.హెచ్,ఎమ్.సి. పరిధిలోకి గవర్నరెన్స్ భవిషత్ పాలనకు ముడిపెట్టే ప్రక్రియ.
>నిప్పులాంటి కె.సి.ఆర్. ప్రతిష్ట !!
అక్షరాలా!
మిత్రులారా… వాక్యానికి వాక్యానికి మధ్య నిడివిని ఇంకొంచెం పెంచితే చదవబుల్ గా వుంటుంది