ఇదే.. ఇదే… రగులుతున్న అగ్ని పర్వతం!


‘రగులుతున్న అగ్ని పర్వతం’ అనగానే మనకు గుర్తొచ్చేది కృష్ణ నటించిన ‘అగ్ని పర్వతం’. కృష్ణ గారి నటన పుణ్యమాని బహుశా అనేకమంది అగ్ని పర్వతం రగులుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకునే శక్తిని కోల్పోయి ఉంటారు. మన సినిమా వాళ్ళు అగ్ని పర్వతం అనగానే నిప్పు కణికాలతో ఎర్రెర్రని మంటలు విరజిమ్మే దృశ్యాలనే మనకి అలవాటు చేశారు. కానీ అగ్ని పర్వతం బద్దలయినపుడు లావా విరజిమ్మడం అనేది ఒక భాగం మాత్రమే. లావాతో పాటు పెద్ద ఎత్తున బూడిద, వేడివాయువులు విరజిమ్మడం మనకి తెలియదు.

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రలో సినబాంగ్ అగ్ని పర్వతం ఇటీవల బద్దలయింది. 2,600 మీటర్ల (8,530 అడుగులు) ఎత్తున ఉండే ఈ అగ్నిపర్వతం 400 యేళ్లుగా స్తబ్దుగా ఉంది. అది ఇక పేలదని కొందరు అంచనా వేశారు. కానీ 2010 నుండి మళ్ళీ చురుకుగా ఉంటోంది. గత సెప్టెంబర్ నెల నుండి పదే పదే బద్దలవుతూ భారీ పరిమాణంలో బూడిద, వేడి వాయువులు, పైరోక్లాస్టిక్ ద్రవం (లావా) లను విరజిమ్ముతోంది.

నవంబర్ లో జరిగిన పేలుడు ఎంత తీవ్రంగా ఉన్నదంటే దాదాపు 8,000 మీటర్ల ఎత్తు వరకు బూడిద వాయువుల్ని అది విరజిమ్మింది. ఈ బూడిద తిరిగి భూమిని చేరి చుట్టుపక్కల కి.మీటర్ల దూరం వరకు గ్రామాలను బూడిదతో కప్పేసింది. చెట్లు, ఇళ్ళు, నీళ్ళు, పొలాలు అన్నీ బూడిద కింద కప్పబడిపోయాయి. చాలా చోట్ల నడక దారులు ఎక్కడ ఉన్నదీ కనిపించడం లేదట! పచ్చదనం అన్నదే దాదాపు మాయమైపోయింది.

ఈ అగ్ని పర్వతం పేలుళ్ళ ఫలితంగా సమీప గ్రామాల ప్రజలు ఇళ్లూ వాకిళ్లూ వదిలేసి వెళ్ళిపోయారు. వారికి ప్రభుత్వమే తాత్మాలిక పునరావాసం కల్పించింది. జనం పీల్చుకోవడానికి శుభ్రమైన గాలే కరువైపోయింది. ఊపిరితిత్తులను కాపాడుకోడానికి నోటికి, ముక్కుకు తెరలు కట్టుకుని తిరగాల్సిన పరిస్ధితిలో ఉన్నారు.

మనకి అగ్ని పర్వతాలు చూద్దామన్నా లేవు. ఈ ఫోటోలు అగ్ని పర్వతాల పేలుడు, వాటి ప్రభావాలపై ఒక అవగాహన ఇస్తాయి. ఆ చివరి ఫోటోను పూర్తి సైజులో చూస్తే ఉపయోగం. పూర్తి సైజులో చూడడానికి ఫోటో కింద ‘View full size’ అని ఉన్న చోట క్లిక్ చేయాలి.  అలా లేకపోతే ఫోటో రిజొల్యూషన్ ని సూచించే అంకెలపై క్లిక్ చేసినా పూర్తి సైజులో చూడొచ్చు.

ది అట్లాంటిక్ పత్రిక ఈ ఫోటోలను ప్రచురించింది.

వ్యాఖ్యానించండి