ఆపరేషన్ బ్లూ వైరస్: మోడి పాపులారిటీ పెరుగునదెట్టిదనిన…


Operation Blue Virus

సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లను రాజకీయ ప్రయోజనాల కోసం గరిష్టంగా వినియోగించేది ఎవరంటే టక్కున వినిపించే పేరు, నరేంద్ర మోడి. ప్రత్యర్ధులకు ఒకింత ఈర్ష్య కలిగించే ఈ ఫీట్ మోడి ఎలా సాధించారన్నది ఇప్పటిదాకా ఒక మిస్టరీ. ఆ మిస్టరీని కోబ్రా పోస్ట్ న్యూస్ పోర్టల్ ఛేదించింది. అనేక ఐ.టి కంపెనీలు డబ్బు తిని మోడి తదితరులకు కృత్రిమ ఫాలోయర్స్ ను సృష్టిస్తూ ఆయన పాపులారిటీ కృత్రిమంగా పెరిగేలా చేస్తున్నారని కోబ్రా పోస్ట్ నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూ వైరస్’ అనే స్టింగ్ ఆపరేషన్ ద్వారా స్పష్టం అయింది. ఐ.టి సంస్ధలన్నీ తమ రాజకీయ క్లయింట్లలో మోడి పేరునే ప్రధానంగా చెప్పారని కోబ్రా పోస్ట్ ఎడిటర్ అనిరుధ్ బహల్ చెప్పారు.

కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ‘డర్టీ ట్రిక్స్ డిపార్ట్ మెంట్’ సృష్టిగా బి.జె.పి నాయకులు యధావిధిగా కొట్టిపారేస్తున్నారు. సహచర మహిళా జర్నలిస్టుపై లైంగిక అగాహిత్యానికి పాల్పడిన తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్ పాల్, ఆనక నెపాన్ని బి.జె.పి పైకి నెట్టినట్లుగానే ఉందిది. ఐ.టి.కంపెనీల యజమానులే వీడియో ముందు స్పష్టంగా తమ బృహత్కార్యం గురించి వివరించి చెబుతుంటే, వాటికి సమాధానం చెప్పడం మానేసి కాంగ్రెస్ పైకి తప్పు నెట్టేయడం ఏమిటి? ఒకవేళ కోబ్రా పోస్ట్ వెనక కాంగ్రెస్ హస్తం ఉందనుకున్నా, ఐ.టి కంపెనీ యజమానులు కాంగ్రెస్ ప్రోద్బలంతో తమను తాము ‘డర్టీ ట్రిక్స్’ కు పాల్పడుతున్నవారుగా చెప్పుకోరు కదా?

ఐ.టి సంస్ధలు ప్రధానంగా ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ తదితర సోషల్ వెబ్ సైట్లను దుర్వినియోగం చేస్తూ రాజకీయ నాయకుల పాపులారిటీని కృత్రిమంగా పెంచేందుకు కృషి చేస్తున్నారని కోబ్రా పోస్ట్ ఎడిటర్ అనిరుధ్ బహల్ తెలిపారు. బూటకపు ‘లైక్’ లు క్లిక్ చేయడం, ‘ఫాలోయర్స్’ ను కృత్రిమంగా సృష్టించడం, ప్రత్యర్ధులకు వ్యతిరేకంగా లేనిపోని వార్తలు సృష్టించి ప్రచారంలో పెట్టడం వీరి పని అని తెలిపారు. చివరికి మైనారిటీ గ్రూపుల్లో ఆందోళన సృష్టించే వార్తలకు కూడా వీరు తెగిస్తున్నారని అనిరుధ్ తెలిపారు.

ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో ముజఫర్ నగర్ అల్లర్ల సందర్భంగా ముస్లింలపై తీవ్ర విద్వేషం రాగల్చడానికి దారితీసిన ఒక బూటకపు వీడియోను బి.జె.పి ఎమ్మెల్యేనే స్వయంగా యూ ట్యూబ్ వెబ్ సైట్ కు అప్ లోడ్ చేశారని పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలతో అరెస్టయిన ఎమ్మెల్యే బెయిల్ పై విడుదల అయినప్పుడు ఆయనను బి.జె.పి పెద్ద ఎత్తున సన్మానించడం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు. బూటకపు వీడియో ప్రచారంలో పెట్టినందుకు ప్రజలకు వివరణ ఇచ్చుకోవడం మాని ఏకంగా సన్మానానికి పూనుకోవడం బట్టే బి.జె.పి పార్టీ ఉద్దేశాలు స్పష్టం అవుతున్నాయి. ఇక కాంగ్రెస్ ని అని ఏమి లాభం?

కోబ్రా పోస్ట్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోలను అనిరుధ్ శుక్రవారం మీడియా ముందు ప్రదర్శించారు. వివిధ ఛానెళ్లు కూడా ఈ వీడియోలను ప్రసారం చేశాయి. “సోషల్ మీడియా ప్రచారంలో బి.జె.పి పార్టీ అందరికంటే ముందు ఉన్నదని ఆపరేషన్ బ్లూ వైరస్ ద్వారా వెల్లడి అయింది. ఇందులో వెల్లడి చేసిన కంపెనీల యజమానులు చెప్పేది నిజమే ఐతే బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి ఈ రేసులో అందరికంటే ముందున్నారు. అనేక కంపెనీలు రాత్రింబగళ్ళు ఆయన కోసం పని చేస్తున్నట్లు చెప్పాయి” అని అనిరుధ్ తెలిపారు.

“దీనిని బట్టి తమ పార్టీకి అనుకూలంగా దేశవ్యాపితంగా గాలులు వీస్తున్నాయన్న బి.జె.పి నాయకుల ప్రచారంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మోడి అనుకూల గాలి విస్తోందన్న ప్రచారం నిజమా కాదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.” అని అనిరుధ్ తెలిపారు.

బి.జె.పి నాయకుడు ప్రకాష్ జవదేకర్ స్పందన ప్రత్యేకంగా ఉంది. “వీడియో ఫుటేజీలో కాంగ్రెస్ పేరు వినిపించినప్పుడల్లా ఆడియో సరిగ్గా వినపడకుండా ఉండేలా జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తూనే ఉంది. మోడి పాపులారిటీ పట్ల కాంగ్రెస్ భయాందోళనలతో ఉందని దీన్ని బట్టి స్పష్టం అవుతోంది” అని ఆయన మీడియోతో అన్నారు. అంటే ఫుటేజీ నిజమా కాదా అన్న అనుమానం ప్రకాష్ జవదేకర్ గారికి లేదు. ఆయన అభ్యంతరమల్లా బి.జె.పి పేరు వినిపడినప్పుడు ఆడియోను అలాగే ఉంచి కాంగ్రెస్ పేరు వినిపించినప్పుడు చెడగొట్టారన్నదే. ఆయన అభ్యంతరం నిజమే అయితే, జనానికి అర్ధం అయ్యే విషయం ఏమిటంటే బి.జె.పితో పాటు కాంగ్రెస్ కూడా ఈ బూటకపు గాలి సృష్టికర్తల్లో ఒకటని అర్ధం చేసుకోవాలి. కాకపోతే అందులో బి.జె.పి కంటే కాంగ్రెస్ కాస్త వెనకబడింది అంతే. మొత్తం మీద మోడి గాలి ఒట్టి ‘గాలి’ మాత్రమే అని బి.జె.పి నాయకుడు అంగీకరిస్తున్నట్లేనా?

అనిరుధ్ ప్రకారం ఐ.టి కంపెనీలు సాగిస్తున్న బూటకపు కార్యకలాపాలు అనేక చట్టాలకు వ్యతిరేకం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఆదాయ పన్ను చట్టం 1961… తదితర చట్టాలను అవి ఉల్లంఘిస్తున్నాయి. ఐ.పి.సి లోని అనేక సెక్షన్ల ప్రకారం వీటికి కఠిన శిక్షలు ఉన్నాయి. ఈ అక్రమాలను నిలువరించడానికి ప్రభుత్వం పూనుకోవాలని ఆయన కోరుతున్నారు.

నోటుకు ఓటు, తాగుడు, చీరలు, క్రికెట్ కిట్ లు తదితర సంభావనలతో ఇప్పటికే అపహాస్యంగా మారిన భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ ప్రవేశంతో మరింతగా అబాశుపాలవుతోందన్నమాట! ఇలాంటి ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎంత పెద్దదైతేనేమీ, ప్రజలకు ఒరగబెట్టేదేమీ లేనప్పుడు?

2 thoughts on “ఆపరేషన్ బ్లూ వైరస్: మోడి పాపులారిటీ పెరుగునదెట్టిదనిన…

  1. అశ్చర్యపడవలసిన్దేదిలేదు. మోడి కాంగ్రెస్ను మస్తుగా ఫాలోయ్యారంతే. భారతీయంలో ఎన్నికలే ఒక ప్రజా వైరస్. ఇటువంటి దంధాలకు పుట్టినిల్లు కాంగ్రెస్.

  2. జనాన్ని చైతన్య పరచాల్సిన వాళ్లు….మేధావులు మౌనంగా ఉండి చోద్యం చూస్తున్నపుడు….ఇటువంటి వాళ్లు ఏమైనా చేస్తారు.
    కాంగ్రెస్, బీజేపీ లు చెరో ఐదేళ్లు దేశాన్ని వాటాలు పంచుకుంటాయి. సీపీఎం అండ్ వామపక్ష తోక పార్టీలు వారికి ఇతోధికంగా సహాయపడతాయి. ఒకరికి మద్దతిచ్చి, ఇంకొకరికి మద్దతివ్వకుండానే…!
    ఐటీ సేవలో ప్రభుత్వాలు తరిస్తాయి.
    జనాలు లైక్ లు తిని బతుకుతారు.
    పేదరికం గణనీయంగా తగ్గిపోతుంది.( పేదరికం అంచనాల్ని అలా తగ్గిస్తారు. )
    సెన్సెక్స్ ధరలతో పోటీ పడి పైపైకి వెళ్తుంది.
    వృద్ధిరేటు కూడా పెరుగుతుంది.
    అప్పుడు మనం అంగారక గ్రహం ఏం ఖర్మ…. శని గ్రహాన్ని కూడా చేరుకుంటాం.
    అన్నట్లు ఎవడో ఒక భారత క్రికెటర్ లక్ష పరుగులు చేస్తాడు.
    జయహో…జయహో భారత యువత గంతులేస్తారు.
    దాన్ని పాశ్చాత్య ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తాయి.
    మనం పళ్లికిలించుకుంటూ చూస్తాం.

వ్యాఖ్యానించండి