సచిన్ టెండూల్కర్ రిటైర్మెంటే పెద్ద వార్త అనుకుంటే, రిటైర్మెంట్ అనంతర కాలంలో కూడా సరికొత్త వార్తలకు ఆయన రిటైర్మెంట్ కేంద్రం అవుతోంది. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఆయన్ను పొగడ్తల్లో ముంచడానికి, తద్వారా కాసింత క్రెడిబిలిటీ పొందడానికీ భారత రాజకీయ నేతలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. కానీ పాకిస్ధాన్ రాజకీయ రంగంలో ఇందుకు విరుద్ధమైన పరిణామం చోటు చేసుకుంది. పాకిస్ధాన్ తాలిబాన్ గా పేరొందిన తెహరీక్-ఎ-తాలిబాన్ సంస్ధ ‘సచిన్ పై పొగడ్తలు కురిపించడం ఇక కట్టిపెట్టాలని పాక్ పత్రికలకు హుకుం జారీ చేసింది. స్వంత క్రికెటర్ మిస్బాను తెగిడి, ఇండియన్ క్రికెటర్ సచిన్ పొగడడం ఏమిటని అది ప్రశ్నించింది.
ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసిన పాక్ తాలిబాన్ ప్రతినిధి షహిదుల్లా షాహిద్ సచిన్ రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు. “ఈ సచిన్ టెండూల్కర్ అని ఒక భారత క్రికెట్ ఆటగాడు ఉన్నాడు. ఆయనపైన ప్రశంసలు కురిపించడంలో పాకిస్ధాన్ మీడియా ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధపడడం దురదృష్టకరం” అని షాహిద్ వీడియోలో ఆక్షేపించాడు.
“ఇంకోవైపు చూస్తేనేమో పాకిస్ధాన్ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ ను తీవ్ర స్ధాయిలో విమర్శించడానికి కూడా పాక్ మీడియాలో కొంతమంది తెగిస్తున్నారు. ఇది కూడా చాలా దురదృష్టకరం. టెండుల్కర్ ఎంత గొప్ప ఆటగాడయినా ఆయన్ని పొగడకండి. ఎందుకంటే ఆయన భారతీయుడు. మిస్బా-ఉల్-హక్ ఎంత చెత్తగా ఆడినా ఆయన్ని ప్రశంసించాలి. ఎందుకంటే ఆయన పాకిస్తానీ ఆటగాడు” అని షాహిద్ పాక్ పత్రికలకు హితోపదేశం చేశాడు.
బహుశా చిన్న పిల్లలు కూడా ఇంత పిల్లతరహాలో మాట్లాడరేమో! ముఖ్యంగా ఆటల విషయంలో స్పోర్టివ్ గా ఉండడానికే పిల్లలు కూడా ఇష్టపడతారు. స్పోర్టివ్ గా ఉండనివారిని నిరసిస్తారు. కానీ పాక్ తాలిబాన్ ప్రతినిధి ఇలాంటి సాధారణ మర్యాదలకు అతీతులుగా కనిపిస్తున్నారు. భారత దేశంలో మతోన్మాద శక్తులు కూడా వివిధ సందర్భాల్లో దాదాపు ఇదే ధోరణిని వ్యక్తం చేయడం యాదృచ్ఛికం కాదు. మతోన్మాదం తీరే అంత. సహజ, ప్రాకృతిక ధర్మాలను కూడా సొంతవైతే గొప్పవిగానూ, ప్రత్యర్ధివి ఐతే మహా చెడ్డవిగానూ వాటికి కనిపిస్తాయి. ఇతరులు కూడా అలాగే చూడాలని కూడా వారు శాసించడమే అసలు సమస్య!
ఇంతకీ తాలిబాన్ ఫర్మానా జారీ చేసేంతగా పాక్ పత్రికలు ఏం రాశాయి? సచిన్ క్రీడా నైపుణ్యాన్ని మెచ్చుకున్నవారిలో ఒక్క పాక్ పత్రికలే లేవు. దాదాపు క్రికెట్ ఆడే ప్రతి దేశంలోనూ సచిన్ రిటైర్మెంట్ ని ఒక ముఖ్యమైన ఘటనగా గుర్తించి ప్రత్యేక విశ్లేషణలు, వార్తలు ప్రచురించాయి. అందరిలాగే పాకిస్ధాన్ పత్రికలు కూడా సచిన్ రిటైర్మెంట్ ను విస్తృతంగా కవర్ చేశాయి. కొన్ని పాక్ ఛానెళ్లు అతని రిటైర్మెంట్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేశాయని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. సచిన్ లేని క్రికెట్ పేదరాలు అయిందని కొన్ని పత్రికలు వ్యాఖ్యానించాయి.
ఉదాహరణకి డాన్ పత్రిక ‘సచిన్ రిటైర్మెంట్ తో పావు శతాబ్దం పాటు విస్తరించిన, నిజంగా గుర్తుపెట్టుకోదగిన ఒక గొప్ప కెరీర్ కు ముగింపు పలికింది’ అని వ్యాఖ్యానించింది. అత్యంత గొప్ప యుద్ధానంతర క్రికెట్ బ్యాట్స్ మెన్ లోకెల్లా గొప్ప ఆటగాడిగా విమర్శకులు, సహ ఆటగాళ్ల చేత ప్రశంసలు పొందిన సచిన్ 1989లో కరాచీలో పాక్ తో జరిగిన మ్యాచ్ లోనే మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడనీ, అప్పటినుండి ఆయన తన విశేష బ్యాటింగ్ నైపుణ్యాలతో అనేక రికార్డులను తిరగరాస్తూ పోయాడని డాన్ ప్రశంసించింది.
తన యుగంలో అత్యంత పూర్తి స్ధాయి బ్యాట్స్ మేన్ సచిన్ టెండూల్కర్ మాత్రమే అని పలువురు ఆయన్ని సరిగ్గానే పరిగణించారు అని ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్, డెయిలీ టైమ్స్ పత్రికలు పేర్కొన్నాయి. పుస్తకంలోని ప్రతి షాట్ అతని అమ్ముల పొదిలో అస్త్రం అయిందని పేర్కొన్నాయి. బౌలింగ్ దాడులను చీల్చి చెండాడంతో పాటు జట్టు అవసరాల రీత్యా తన సహజ దూకుడు స్వభావాన్ని నియమ్తృంచుకోవడంలో కూడా ఆయన సామర్ధ్యం ప్రదర్శించాడు అని పేర్కొన్నాయి.
ఉర్దు దిన పత్రిక ఇన్సాఫ్ “టెండూల్కర్ లాంటి క్రికెటర్లు ప్రతి రోజు పుట్టరు. అతని క్రీడా జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడ్డారు, గౌరవించారు. అతను లేని క్రికెట్ పేదరాలయినందుకు అతని ఆరాధకులు విచారంలో ఉండి ఉంటారు” అని రాసింది.
ఈ తీరులో సాగిన ప్రశంసలు తాలిబాన్ కు నచ్చలేదు. అందునా ఒకపక్క పాక్ జట్టు కెప్టెన్ ను విమర్శిస్తూ ఇండియా ఆటగాడిన పొగడడం ఇంకా నచ్చలేదు. ఈ తరహా ధోరణి చూసేవారికి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో పత్రికలు తమ కవరేజి ద్వారా స్పష్టం చేశాయి. ఇదే ధోరణిని వ్యక్తం చేసేవారికి అదొక పాఠం అవుతుందని ఆశిద్దాం.

పింగ్‌బ్యాక్: సచిన్ పొగడ్తలు కట్టిపెట్టండి -పాక్ తాలిబాన్ | ugiridharaprasad