‘రవి గాంచని చోట కవి గాంచున్’ అని పెద్దల మాట! కానీ అది పాత రోజుల్లో. ఫోటోగ్రాఫర్ శక్తి ఏమిటో బహుశా ఆనాటి పెద్దలకు ఇంకా అర్ధం అయి ఉండదు. ఈ మాట చెప్పేనాటికి ఫోటోగ్రఫి ఈ స్ధాయిలో అభివృద్ధి చెందలేదని సరిపెట్టుకుందాం. మానవుడికి అందుబాటులో లేని సుదూర తీరాలకు సైతం కెమెరా కన్ను ఈ రోజు ప్రయాణిస్తోంది. మనిషి కన్ను మహా అయితే భూ కక్ష్య వరకే చూడగలదు. కానీ కెమెరా కన్ను ఇప్పుడు అంగారకుడిని కూడా దాటి సుదూర పాలపుంతలను సైతం పట్టి మనముందు ఉంచుతోంది.
సుదూర దృశ్యాల సంగతి పెక్కన పెడితే మన చుట్టూరా ఉండే అద్భుత సుందర దృశ్యాలను గుర్తించగల శక్తి మనిషి కంటికి ఉందా అన్నది సందేహమే. కెమెరా కన్ను మనకి ఆ కొరత తీరుస్తోంది. మన రోజువారీ సామాజిక కార్యకలాపాలతో పాటు ప్రకృతిలో లిప్తకాలంలో అదృశ్యం అయిపోయే అరుదైన దృశ్యాలను శాశ్వతంగా బంధించగల శక్తి ఒక్క కెమెరా కంటికి మాత్రమే ఉంటుంది. అలాంటి దృశ్యాలకు పోటీ పెడితే ఇక చెప్పేదేముంది?
నేషనల్ జాగ్రఫిక్ వాళ్ళు ఎప్పటిలాగే ఈ యేడు కూడా పోటీ నిర్వహిస్తున్నారు. సదరు పోటీకి ఈ రోజే ఆఖరి తేదీ. బహుమతులు ప్రకటించడానికి ముందే పోటీకి వచ్చిన ఫోటోలను వాళ్ళు పత్రికలకు ఇస్తారు. ఆ విధంగా నిపుణులతో పాటు జనాభిప్రాయం కూడా వారు సేకరిస్తారనుకుంటాను. ఎన్.జి వారి నుండి సేకరించిన కొన్ని ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది. వాటిలో కొన్ని మాత్రమే ఇవి.















