తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జి.ఒ.ఎం) నుండి సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఒక షాక్ లాంటిది ఎదురయింది. హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని వచ్చిన సీమాంధ్ర మంత్రులకు వారు గట్టిగా ‘నో’ చెప్పేశారు. అసలు విభజనకే ఒప్పుకునేది లేదని హఠాయించిన సీమాంధ్ర మంత్రులు చివరి నిమిషంలో వచ్చి ‘కేంద్ర పాలిత ప్రాంతం’ చేయాలని కోరడం జి.ఒ.ఎం సభ్యులకు నచ్చినట్లు లేదు. ‘ఇప్పడు సమయం మించిపోయింది’ అని జి.ఒ.ఎం సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది.
సీమాంధ్ర నుండి కేంద్ర మంత్రులుగా ఉన్న కొందరు గురువారం జి.ఒ.ఎం సభ్యులను కలిశారు. జె.డి.శీలం, కావూరి తదితరులు ఇలా కలిసినవారిలో ఉన్నారు. రాష్ట్ర విభజన తధ్యమని తేలిపోయిన ప్రస్తుత పరిస్ధితుల్లో కనీసం యు.టి అయినా సాధిద్దామని భావించినట్లు కనిపిస్తోంది. అయితే వారి డిమాండ్ ను జి.ఒ.ఎం సభ్యులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని ది హిందు తెలిపింది.
యు.టి డిమాండ్ ను పరిశీలించడానికి సమయం మించిపోయిందని జి.ఒ.ఎం సభ్యులయిన జైరాం రమేష్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ కూడా ఇదే మాట వారితో అన్నారట. ఇప్పటికీ సమయం మించిపోయిందని, ఏమన్నా చెప్పేదుంటే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పుకోవడం ఉత్తమం అని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారని ఛానెల్స్ కూడా చెబుతున్నాయి.
రాష్ట్ర విభజనను సజావుగా సాగేలా చూడడానికే కేంద్ర పెద్దలు యు.టి డిమాండ్ చుట్టూ సీమాంధ్ర పెద్దలు తిరిగేలా చేస్తున్నారని, ఈ లోపు వారు విభజన కార్యక్రమాలు వేగంగా పూర్తి చేస్తున్నారని టి.వి9 లాంటి ఛానెళ్లు నిన్న ప్రత్యేక కధనాలు ప్రసారం చేశాయి. అయితే గురువారం షిండే, దిగ్విజయ్ సింగ్ తదితరులు చెప్పిన మాటల్ని బట్టి ఆ కధనాల్లో వాస్తవం లేదని అర్ధం అవుతోంది. సీమాంధ్ర నాయకులు తమ చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకోవద్దని, చేయవలసిన చర్చలు ఇప్పటికే తాము పూర్తి చేశామని వారు గుర్తించాలని షిండే చెప్పారని ఈ రోజు కొన్ని చానెళ్లు చెప్పాయి.
హైద్రాబాద్ ను శాశ్వతంగా కేంద్ర పాలితంగా చేయాలని, ఢిల్లీ తరహాలో ప్రత్యేక శాసనసభ ఏర్పాటు చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు గురువారం డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ను జి.ఒ.ఎం సభ్యులు గట్టిగా తిరస్కరించడంతో వారు హతాశులయినట్లు తెలుస్తోంది. కనీసం తాత్కాలికంగా అయినా కేంద్రం పాలిత ప్రాంతం చేయడానికి అంగీకరించాలని ఇప్పుడు సీమాంధ్ర కేంద్ర మంత్రులు పైరవీలు ప్రారంభించారు.
కేంద్ర మంత్రి జె.డి.శీలం ఈ విషయమై బహిరంగంగానే తెలంగాణ నేతలకు విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక యు.టికి ఒప్పుకుంటే విభజన సజావుగా చేయవచ్చని వారు ప్రతిపాదిస్తున్నారు. జె.డి.శీలం ఈ విషయమై నచ్చజెప్పడానికి తెలంగాణ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ని కూడా కలిశారు. అయితే జైపాల్ రెడ్డి ఏమి బదులిచ్చింది జె.డి.శీలం పత్రికలకు చెప్పకపోవడం గమనార్హం. హైద్రాబాద్ ను యు.టి చేయడానికి జైపాల్ రెడ్డి మొదటి నుండి గట్టిగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. భద్రాచలంతో సహా అన్నీ తెలంగాణలోనే ఉంటాయని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.
ఉమ్మడి రాజధాని ‘జి.హెచ్.ఎం.సి’?
విభజన అనంతరం సీమాంధ్ర ప్రజలు బాధపడకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవడానికే ఆలోచిస్తున్నామని హోమ్ మంత్రి షిండే చెబుతున్నారు. వారి దృష్టిలో రెండు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిది ఆర్టికల్ 258(ఎ) ను ఉపయోగించుకోవడం. దీని ప్రకారం కొన్ని అంశాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఎ అంశంలో నైనా అధికారాలను తన చేతుల్లోకి తీసుకోవచ్చు. దీనికి రాష్ట్ర గవర్నర్ ను సంప్రదించాల్సి ఉంటుంది. రెండో ఆప్షన్ ఆర్టికల్ 371(H) ను ప్రయోగించడం. ఈ ఆర్టికల్ కింద రాష్ట్ర గవర్నర్ శాంతి భద్రతల అంశాన్ని తన చేతుల్లోకి తీసుకోవచ్చు. దీనికి రాష్ట్ర మంత్రివర్గాన్ని గవర్నర్ సంప్రదించాల్సి ఉంటుంది.
జి.ఒ.ఎం దృష్టిలో ప్రధానంగా కొన్ని సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది. సీమాంధ్ర నుండి వచ్చి హైద్రాబాద్ లో సెటిల్ అయినవారి భద్రత, రక్షణ, వారి ఆస్తుల రక్షణ, శాంతి భద్రతలు… ఈ అంశాలు వారి దృష్టిలో ఉన్నాయి. గ్రేటర్ హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సరిహద్దులను ఉమ్మడి రాజధానిగా పరిగణిస్తూ పైన చెప్పిన రెండు ఆర్టికల్ లో ఒకదానిని ఉపయోగించుకుని ఈ సమస్యలను పరిష్కరించాలని జి.ఒ.ఎం భావిస్తున్నట్లు ది హిందూ తెలిపింది.
విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వస్తున్న దశలో రాష్ట్ర కాంగ్రెస్ లో లుకలుకలు మొదలయ్యాయి. సి.డబ్ల్యూ.సి నిర్ణయాన్ని వ్యతిరేకించినవారిపై చర్యలు తప్పవని పి.సి.సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మొదటిసారిగా (విభజన కోసం) కొరడా ఝళిపించారు. ఇతర పార్టీల్లో చేరడానికి చూస్తున్నవారు మాత్రమే సి.డబ్ల్యూ.సి నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన ఆరోపించారు కూడా.
బొత్స ప్రకటనను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అపహాస్యం చేశారు. బొత్స ప్రకటించినట్లు చర్యలు తీసుకున్నట్లయితే సీమాంధ్ర కాంగ్రెస్ లో ఒక్కరూ మిగలరని ఆయన ఎత్తిపొడిచారు. ముఖ్యమంత్రి నుండి కేబినెట్ మంత్రులవరకు అందరూ విభజనకు వ్యతిరేకంగా చేసిన తీర్మానం పైన సంతకం చేశారని ఆయన గుర్తు చేశారు. వారందరిని బహిష్కరిస్తే కాంగ్రెస్ లో ఎవరూ మిగలరని తెలుసుకోవాలి అని సవాలు విసిరారు.
గలాటా అంతటితో ఆగలేదు. వైద్య మంత్రి కొండ్రు మురళి గంటాకు ప్రతి సమాధానం ఇచ్చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని బహిరంగంగా ఎవరూ విమర్శించడానికి వీలు లేదని ఆయన నొక్కి చెప్పారు. సొంత పార్టీ నేతలను బహిరంగంగా విమర్శించడం ఏమిటని, సి.డబ్ల్యూ.సి నిర్ణయం పార్టీకి శిలాశాసనమని ఆయన తీవ్ర స్వరంతో బొత్సకు మద్దతు వచ్చారు.
మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తారని, కేంద్రం నిర్ణయాన్ని ఆయన అమలు చేస్తారనడంలో అనుమానాలు వద్దని వ్యాఖ్యానించడం విశేషం. ఆ విధంగా అన్నివైపుల నుండి విభజన వ్యతిరేకులపై కాంగ్రెస్ పెద్దలు ఒత్తిడి పెంచుతున్నారని భావించవచ్చు. విభజనకు అంగీకరిస్తేనే కాంగ్రెస్ లో ఉంటారు లేకపోతే తప్పుకోవాల్సిందే అని ముఖ్యమంత్రికి దిగ్విజయ్ పరోక్షంగా హెచ్చరించినట్లేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
విభజన రోజులు వచ్చేశాయి!


సీమాంధ్ర రాజకీయనాయకులకు మెదడు మోకాలులో వుందనడంలో సందేహం లేదు. కానీ యావత్ తెలుగు ప్రజానీకానికి ఆదిలోనే తెలుసు, అధిష్టనానికి ఎదురొడ్డి నిలిచే నాయకుడు ఒక్కడు లేడని. వీళ్ళు పీకేది ఏమి లేదని రాష్ట్రవిదితం. ముఖ్యమంత్రి కిక్కు కూడా వాక్కుకు పరిమితం తప్ప క్రియాత్మకంగా ఆయన ఏం చేయలేడు. రేపు జి.ఒ.ఎం. ఒక కొలిక్కివచ్చి రూపం సంతరించుకుంటే కిరణం రాజినామ మబ్బుల చాటున చోటు చేసుకోవడం ఖాయం. బొత్సావారు అధిష్టానాన్ని సాయంపట్టడంలో గల అంతరార్ధం తన బొజ్జను ముఖ్య పదవితో నింపుకోవలనే ఆతగాడి తాపత్రయం తేటతెల్లం, లోకవిదితం. ఆంధ్రా రాజకీయాలకు అధిష్టానమంటే సింహస్వప్నం. అధిష్టానానికి ఎదురెళ్ళి మాట్లాడే సత్తా కానీ ధీమా కాని ఏ ఒక్క ఖద్దరుకు లేదు. వీళ్ళ ఖపడ్దార్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం.
కొసమెరుపు: తెలుగు కేంద్రమంత్రులు నుంచి పార్లమెంటు సభ్యులవరకు వారి వారి స్థానాలకు చలనంలేని సంచలనం “విభజన”. పురిటినొప్పులు భరించలేని స్థాయిలో వున్న సుఖ ప్రసవం తరువాత మళ్ళా నెలతప్పడానికి అందరు సిద్ధమే. అమ్మవారు శాసించితే తలవంచుకుని నిలిచినవాడే శాసనసభ్యుడు లేని పక్షంలో సి.బి.ఐ. నిబద్ధుడు.