పీటముడిలో నేపాల్ ప్రజాస్వామ్యం -కార్టూన్


Nepal democracy

రాజ్యాంగ సభకు రెండో దఫా జరిగిన ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడంతో యూనిఫైడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) పార్టీ ఓట్ల లెక్కింపును బహిష్కరించింది. దానితో రాజ్యాంగ సభ ఎన్నికల ఫలితాలకు చట్టబద్ధత కొరవడే పరిస్ధితి ముంచుకొచ్చింది. మొదటి దఫా ఎన్నికల ద్వారా ఏర్పడిన రాజ్యాంగ సభ రాజ్యాంగ రచన పూర్తి చేయడంలో విఫలం కావడంతో రెండో దఫా రాజ్యాంగ సభ కోసం ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

మొదటి దఫా ఎన్నికల్లో, ఎన్నికలు జరిగిన 250 సీట్లకు గాను 100 సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించిన UCPN(Maoist) పార్టీ ఈ సారి పాతిక సీట్లు కూడా గెలవడం గగనం అన్న రీతిలో ఫలితాలు వెలువడుతున్నాయి. దానితో ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా కుట్రలు జరిగాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఓట్ల లెక్కింపును బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రకటన అనంతరం లెక్కింపు కొనసాగిందా లేదా అన్న విషయంలో వార్తలు రాలేదు. కాగా సాయుధ పోరాట మార్గం విడిచి పెట్టి కుంటి వాదనలతో పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రవేశించిన మావోయిస్టు పార్టీకి తగిన శాస్తి జరిగిందా అన్నది తేలవలసిన ప్రశ్న.

సాయుధపోరాటం ద్వారా మాత్రమే కార్మిక రాజ్యం సిద్ధిస్తుందని ప్రకటించిన పార్టీ, UCPN(Maoist). ప్రకటించినట్లుగానే 10 సంవత్సరాల పాటు సాయుధపోరాటం నిర్వహించి గ్రామీణ నేపాల్ లో మెజారిటీ ప్రాంతాన్ని విముక్తి చేసినట్లు ప్రకటించింది. కానీ వివిధ కారణాలు చూపిస్తూ సాయుధ పోరాటాన్ని ఆ పార్టీ విరమించుకుంది. ఎన్నికల్లో పాల్గొనడానికి సంసిద్ధత ప్రకటించి రాచరికం రద్దు కోసం కృషి చేసింది.

రాచరికం రద్దు దరిమిలా, రాచరికం వారసులు, వారి అనుచరులు నేపాలీ కాంగ్రెస్ పార్టీ కింద సమీకృతం అయ్యారు. మరోవైపు రివిజనిస్టు కమ్యూనిస్టు పార్టీ అయిన CPN-UML పార్టీ నేతలు పార్లమెంటరీ పంధాకు విధేయులుగా కొనసాగారు. మొదటి దఫా రాజ్యాంగ సభ ఏర్పడిన అనంతరం మాధేసీ తెగ లాంటి చిన్న చిన్న జాతుల ప్రతినిధులు రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కలిగి ఉండే ఫెడరల్ వ్యవస్ధను డిమాండ్ చేశారు. జాతులకు స్వయం ప్రతిపత్తి ఉండాలని కోరారు. ఈ డిమాండ్లను నేపాలీ కాంగ్రెస్, CPN-UML పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించగా మావోయిస్టులు గట్టిగా సమర్ధించారు. రాజ్యాంగ సభ గడువు ముగిసినా ఈ విషయంలో ఎవరూ రాజీ పడలేదు. దానితో రెండో రాజ్యాంగ సభకు ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

పార్లమెంటరీ పంధాకు ఆధిపత్య వ్యవస్ధల తాలూకు సవాలక్ష పరిమితులు ఉండడం అనివార్యం. ఈ పరిమితులను గుర్తించకుండా ఆధిపత్య వర్గాలు ప్రతిపాదించిన పార్లమెంటరీ పంధా తొక్కడం మావోయిస్టులు చేసిన వ్యూహాత్మక తప్పు. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసే కృషిలో భాగంగానే వ్యూహాత్మకంగా ఎన్నికల్లో పాల్గొంటున్నామని చెప్పిన మావోయిస్టులు ఏ దశలోనూ ఆ వైపు వెళ్తున్నట్లుగా కనిపించలేదు.

పైగా నేపాల్ రాచరికపు రాజప్రాసాదాల్లో విలాసవంతమైన జీవితం గడిపిన ఆరోపణలను మావోయిస్టు పార్టీ నేత పుష్పకమల్ దహల్ / ప్రచండ సొంత పార్టీ నుండే ఎదుర్కొన్నారు. విమర్శల అనంతరం రాజప్రాసాదాలను త్యజించినప్పటికీ బహుశా పార్టీకి జరగవలసిన నష్టం జరిగినట్లే కనిపిస్తోంది. గ్రామాల విముక్తిలో ప్రశంసాత్మకమైన పాత్ర పోషించిన తమ పార్టీ సైనికులను జాతీయ సైన్యంలో విలీనం చేయడం ద్వారా వారి వర్గ చైతన్యం మొద్దుబారడంలో పార్టీయే పాత్ర పోషించినట్లు కనిపిస్తోంది.

పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలట్ బాక్సుల రవాణాలో అక్రమాలు జరిగాయని ప్రచండ ఆరోపిస్తున్నారు. అనేక చోట్ల కొన్ని గంటలపాటు బ్యాలట్ పెట్టెలు మాయం అయ్యాయని, పెట్టెల మార్పిడి జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. అక్రమాలపై విచారణ చేయకపోతే రాజ్యాంగ సభను బహిష్కరిస్తామని ప్రకటించారాయన. ముందే చెప్పినట్లు పార్లమెంటరీ పంధా తీరే అంత. ఇప్పటికైనా తగిన పాఠాలు నేర్చుకుని ప్రకటిత లక్ష్యాన్ని నెరవేర్చేవైపుగా కృషి చేస్తేనే మావోయిస్టులకు ప్రజల మద్దతు లభించగలదు.

వ్యాఖ్యానించండి