మన అంతరిక్ష శాస్త్రజ్ఞులు తలపెట్టిన అంగారక ప్రయాణంలో మొట్టమొదటి చిగురు బీజాన్ని చీల్చుకుని తొంగి చూసింది. ప్రస్తుతం భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ ఉపగ్రహం భూగ్రహాన్ని ఫోటో తీసి పంపింది. భారత దేశం, దాని చుట్టుపక్కల ఉన్న భూ, సముద్ర భాగాలు ఇందులో కనిపిస్తున్నాయి.
ఉపగ్రహాలు భూమి ఫోటోలు తీసి పంపడం కొత్తేమీ కాదు. ఆ పనిని ఇస్రో ఇప్పటికే ప్రయోగించిన అనేక ఉపగ్రహాలు రోజూ చేసే పనే. అయితే అవి నేల నుండి 600 నుండి 800 కి.మీ ఎత్తు నుండి తీసే ఫోటోలు. మార్స్ ఆర్బిటర్ తీసిన ఫోటో మాత్రం దాదాపు 70,000 కి.మీ దూరం నుండి తీసినది. ఈ ఫోటో స్పేటియల్ రిజొల్యూషన్ ఎంతో తెలుసా? ఏకంగా 3.5 కి.మీ. మార్స్ కక్ష్యలోకి ప్రవేశించాక మరిన్ని అద్భుతమైన ఫోటోలు మనకి అందుతాయని ఇస్రో ఛైర్మన్ కె.రాధా కృష్ణన్ ఊరించారు.
మార్సి ఆర్బిటర్ భూ కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు క్రమంగా పెంచుతూ పోతున్నారు. అనగా దీర్ఘ వృత్తాకార కక్ష్య యొక్క apogee ని పెంచుతున్నారు. దీర్ఘవృత్తంలో గరిష్ట వ్యాసాన్ని apogee అనీ, కనిష్ట వ్యాసాన్ని perigee అనీ అంటారు. ప్రస్తుతం మార్స్ ఆర్బిటర్ apogee దాదాపు 2 లక్షల కి.మీ. ఈ కక్ష్యలో ఒకసారి భూమిని చుట్టి రావడానికి మార్స్ ఆర్బిటర్ 91.5 గంటల సమయం తీసుకుంటోందని ఇస్రో నేత రాధాకృష్ణన్ తెలిపారు.
కక్ష్య పెంచే పనిని నవంబర్ 7 తో ప్రారంభించి నవంబర్ 16 వరకూ కొనసాగించారు. ఉపగ్రహంలో ముందుగానే ఉంచిన ఇంధనాన్ని దఫదఫాలుగా మండించడం ద్వారా ఇలా కక్ష్యను పెంచుకుంటూ పోయారు. నవంబర్ 16 తేదీన సాధించిన కక్ష్యలో మార్స్ ఆర్బిటర్ నవంబర్ 30 వరకు తిరుగుతుంది.
డిసెంబర్ 1 తేదీన మరోసారి సూచనలు ఇవ్వడం ద్వారా ఉపగ్రహానికి ఎస్కేప్ వేలాసిటీ వచ్చే విధంగా చేస్తారు. అనగా భూమి గురుత్వాకర్షణ శక్తి ప్రభావాన్ని తప్పించుకోగల వేగాన్ని అందుకునేలా ఇంధనాన్ని మండిస్తారు. దానితో అది నిర్దేశించిన మార్గంలో అంగారక గ్రహం వైపుకు ప్రయాణం మొదలు పెడుతుంది.
అంగారక గ్రహాన్ని సమీపించిన తర్వాత ఉపగ్రహ వేగాన్ని తగ్గించి వివిధ సూచనల ద్వారా అంగారకుడి చుట్టూ నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అంగారకుడి వరకు చేసే ప్రయాణం గానీ, అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించడం గానీ కళ్ళతో చూస్తూ చేసేవి కావు. పూర్తిగా శాస్త్రీయ విజ్ఞాన సూత్రాలపై ఆధారపడి చేసేవి. అందువలన వీటిని పూర్తి చేయడమే ఒక విజయం అవుతుంది. ఈ విషయంలో ఇతర దేశాలకు అనుభవం ఉన్నది గానీ మనకు లేదు. కాబట్టి ఈ అనుభవం నిస్సందేహంగా మన ఖగోళ శాస్త్ర పురోగతిలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.
మార్స్ ఆర్బిటర్ మిషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు ఈ కింద లింకులో చూడగలరు.


apogee ను దీర్ఘ/గరిష్ట కర్ణం, perigee లఘు/కనిష్ట కర్ణం, అని అనువదిస్తే సరైనదేనా?
“కర్ణం” చతురస్త్రం లేదా దీర్ఘచతురస్త్రం సందర్భాలలో అనుకుంటే, apogee ను దీర్ఘ/గరిష్ట వ్యాసం, perigee లఘు/కనిష్ట వ్యాసం. ఎలా వుంటుందంటారు?
స్వయంకృషిలోని ఆనందం స్వాభిమానంకంటే విలువైనది. పరిశోధనా విభాగంలోని విజ్ఞనతావివేకాలలోని ఫలితాలు అనుకరణ ద్వారా కాకుండా స్వయంభూతితో విదితమవడంలోని ఆనందం వర్ణనాతీతం. అబినందనలతో ప్రోత్సహించడం మన ధర్మం.
మంగళ్ యాన్ ఫలితాలు…కేవలం వ్యాపారులకు ( త్రీజీ కుంభకోణంలా ) కాకుండా దేశంలోని అందరికీ ఉపయోగపడితే అంతకన్నా సంతోషం ఏముంటుంది.