ఊహకు అందని ఆర్కిటెక్చర్ అద్భుతాలివి! -ఫోటోలు


ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి గుహల్లో నివాసం ఉండిన ఆదిమ మానవుడి జీవన ప్రయాణం ఆ స్ధితిలో కొన్ని వందల వేల యేళ్ళు కొనసాగించాడని మానవ పరిణామ శాస్త్రం చెబుతుంది. అనేక మేటి శాస్త్రబద్ధ ఆవిష్కరణల ద్వారా సుసాధ్యం అయిన ఈనాటి మహా నిర్మాణాలతో పోలిస్తే ఆదిమ మానవుడి జీవనం ఎలా సాగిందా అన్న అనుమానం రాకమానదు. శాస్త్రం అభివృద్ధి చెందుతూ, మరింత అభివృద్ధి కోసం అనేక విభాగాలుగా చీలిపోయాక ఇక మానవుడి మేధస్సు యొక్క సృజనాత్మకతకు ఆకాశమే సరిహద్దు అన్నట్లుగా మారిపోయింది.

ఒకటి, రెండు శతాబ్దాల క్రితం కూడా మనిషి ఊహించను కూడా లేని శాస్త్రీయ ఆవిష్కరణలు మనిషి జీవన సౌకర్యాలను కొంత పుంతలు తొక్కిస్తున్నాయి. ప్రపంచం మొత్తం చిటికెలో దర్శించగల శక్తిని సాకారం చేసిన నానో టెక్నాలజీ ఒక వైపు ఉంటే, ఆకాశమే హద్దుగా మనిషి నిర్మిస్తున్న మహా నిర్మాణాలు మరోవైపు అచ్చెరువు గొలిపేవే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా పేరు గాంచిన దుబాయ్ లోని బర్జ్ ఖలీఫా ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్నదే. కానీ 20వ శతాబ్దం రెండో అర్ధ భాగంలోనే అమెరికాలో చూపుల్ని ఇట్టే కట్టి పడేసే ఆర్కిటెక్చర్ నిర్మాణాలు జరిగాయి.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో కొంతమంది ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు, బిల్డర్లు ఆధునికతను పునర్నిర్వచించారని చెప్పవచ్చు. సరికొత్త నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పదార్ధ శాస్త్ర ఆవిష్కరణలను అవకాశంగా తీసుకుంటూ అనేక ఇంపయిన నిర్మాణాలు సాగించారు. అద్భుతమైన ఆర్కిటెక్చర్ డిజైన్లతో తనదైన నిర్మాణ భాషకు రూపకల్పన చేసినవారిలో ఫిన్నిష్-అమెరికన్ ఆర్కిటెక్ట్ ఈరో సారినెన్ ఒకరు. ఆయన డిజైన్ చేసిన అద్భుత నిర్మాణాలలో కొన్నింటి ఫోటోలే ఇవి.

సెయింట్ లూయిస్ లోని గేట్ వే ఆర్చ్, న్యూయార్క్ లోని జె.ఎఫ్.కె ఎయిర్ పోర్ట్ (TWA ఫ్లైట్ సెంటర్) ల నుండి సూపర్ ధనికుల వ్యక్తిగత గృహాల వరకూ ఈరో మేధస్సు నుండి రూపుదిద్దుకున్నాయి. ఆయా కట్టడాలను నిర్మించడానికి ముందు వాటి నమూనాలను ముందే రూపొందించుకోవడం ఆర్కిటెక్చర్లు చేసే పని. మోడల్ దశ నుండి ఆయా నిర్మాణాలు సాగుతుండగానూ, నిర్మాణం పూర్తయ్యాక కూడా ఈరో ఆవిష్కరించిన కట్టడాలను ఫోటోగ్రాఫర్ బల్తజార్ కొరబ్ ఫోటోలు తీసి భద్రపరిచారు. అనంతర కాలంలో వాటిని అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కు సమర్పించారు. ఇటీవల మరణించిన కొరబ్ జ్ఞాపకార్ధం ది అట్లాంటిక్ పత్రిక ఈ ఫోటోలను ప్రచురించింది.

One thought on “ఊహకు అందని ఆర్కిటెక్చర్ అద్భుతాలివి! -ఫోటోలు

  1. పింగ్‌బ్యాక్: ఊహకు అందని ఆర్కిటెక్చర్ అద్భుతాలివి! -ఫోటోలు | ugiridharaprasad

వ్యాఖ్యానించండి