భారత రత్న: విజ్ఞప్తుల/డిమాండ్ల వరద -కార్టూన్


Bharat Ratna

ఆరేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. ఈసారి ఒకేసారి ఇద్దరికీ ఈ గౌరవం ప్రకటించింది. శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్.రావు కి భారత రత్న ప్రకటించడాన్ని అందరూ ఆహ్వానిస్తుండగా సచిన్ టెండుల్కర్ కి ఇవ్వడమే వివాదాస్పదం అయింది. మరోవైపు భారత రత్న ఫలానా వ్యక్తికి ఎందుకు ఇవ్వరంటూ విజ్ఞప్తులు, అదిలింపులు, బెదిరింపులు వరద కట్టడం విశేషం.

సచిన్ కు భారత రత్న ఇవ్వడానికి ముదట వ్యతిరేకించింది హోమ్ మంత్రిత్వ శాఖే. అవును, ఇది నిజం. రెండేళ్ల క్రితం సచిన్ కు భారత రత్న ఇచ్చేలా సదరు అవార్డు నిబంధనలు సవరించాలంటూ క్రీడా మంత్రి అజయ్ మాకేన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విజ్ఞప్తిని హోమ్ శాఖ తోసిపుచ్చింది. సచిన్ కి ఇస్తే ఇంకా చాలా మందికి ఇవ్వాల్సి ఉంటుందని వాదించింది.

భారత్ కు పేరు తెచ్చిన, గర్వించదగ్గ క్రీడాకారులు అనేకమంది ఉన్నారని ధ్యాన్ చంద్, జస్పాల్ రాణా, విశ్వనాధన్ ఆనంద్, పి.టి.ఉష లు వారిలో ముఖ్యులని వాదించింది. హోమ్ శాఖకు ఏం చెప్పి సర్దిపుచ్చారో గానీ మొత్తం మీద నిబంధనలనైతే సడలించారు. సచిన్ కు భారత రత్న ఇవ్వడం కోసం నిబంధనలు సడలించడం గుర్తించదగిన విషయం.

బహుశా ఈ నేపధ్యంలోనేమో సచిన్ కు భారత రత్న ఇవ్వడంపై వివాదం నెలకొంది. ఎస్.పి నాయకుడు శివానంద్ తివారీ తీవ్ర విమర్శలు చేశాడు. భారత రత్న ఒక జోక్ అయిపోయిందని వ్యాఖ్యానించాడు. క్రీడాకారులకు ఇస్తే మొదట ధ్యాన్ చంద్ కు ఇవ్వాలనీ, ఆయనకు ఇవ్వకుండా సచిన్ కు ఇవ్వడం ఘోరమని ఆయన అన్నాడు.

బి.జె.పి కూడా తమ భారత రత్నను ముందుకు తెచ్చింది. మాజీ ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేయి కి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించింది. ఆయన అన్నివిధాలా బిరుదుకు అర్హులని వాదించింది. ఈ వాదనకు కాశ్మీర్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, జె.డి(యు) నాయకుడు నితీశ్ కుమార్ లు మద్దతు రావడం ఒక విశేషం.

తెలుగు దేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ‘ఎన్.టి.రామారావు’ పేరును ప్రతిపాదిస్తున్నారు. ఎన్.టి.ఆర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అనీ, ఆయన భారత రత్నకు అన్నీ విధానాలా అర్హులని కావున ఎన్.టి.ఆర్ కు భారత రత్న ప్రకటించాలని నాయుడు డిమాండ్ చేశారు.

నిబంధనల రీత్యా సంవత్సరంలో ముగ్గురుకు భారత రత్న ఇవ్వచ్చు. ఈ లెక్కన ఈ సంవత్సరం మరొకరికి ఛాన్స్ ఉంది. మరో నెలన్నర ఆగితే ఇంకో ముగ్గురుకి ఇవ్వచ్చు. ఇస్తారా, చస్తారా?

సందేహం లేదు. నిజంగానే ‘భారత రత్న’ ఒక జోక్ అయింది!

2 thoughts on “భారత రత్న: విజ్ఞప్తుల/డిమాండ్ల వరద -కార్టూన్

  1. ఒక నేపధ్యంలో పైన ఉదహరించిన ప్రముఖులు కాకా లతాజీ, నేపధ్య గాయకురాలు, పొందవలసిన భారతరత్న, మోడీతో సఖ్యత కారణంగా చివరి క్షణంలో సచీన్కు బదలాయించారనే అపవాదును యు.పి.ఏ. ప్రభుత్వం సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మోడీయే స్వయంగా బహిర్గతం చేసి రాజకీయానికి ఆజ్యం పోశారు. ప్రభుత్వ విశిష్టాత్మక ప్రధానాలు రాజకీయ విధానాలకు లోబడనేది తిరుగులేని సత్యం. సిఫార్సులతో మొదలై రాజకీయ ఫార్సులమీదుగా జరిగే ఈ తంతు అన్ని వర్గాలవారికి అందుబాటులోని వ్యవహారం.

    కొస మెరుపు: ఆదర్శ ప్రేమికులతో మొదలై ఆలుమగల విడాకుల విషయం దాకా ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారాల
    జాబితాలో చోటుచేసుకునే విషయం పరిశీలనలో ఉందని గాలి వార్త.

  2. తెలుగు దేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ‘ఎన్.టి.రామారావు’ పేరును ప్రతిపాదిస్తున్నారు.

    రామారావు కి బహుముఖ ప్రజ్ణాశాలి ఐతే భానుమతి కూడా బహుముఖ ప్రజ్ణాశాలి. ఆమేకి కూడా ఇవ్వాలి కదా!

వ్యాఖ్యానించండి