అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు సాగిస్తున్న గూఢచర్యం పై ఎలా స్పందించాలో ఇండోనేషియా ఒక ఉదాహరణ చూపింది. తమ అధ్యక్షుడి టెలిఫోన్ సంభాషణలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిఘా పెట్టిందన్న విషయం స్నోడెన్ పత్రాల ద్వారా వెలుగులోకి వచ్చిన రోజే ఆ దేశం నుండి తమ రాయబారిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాతో తాము కుదుర్చుకున్న స్నేహ, సహకార ఒప్పందాలు అన్నింటినీ సమీక్షిస్తున్నట్లు కూడా ఇండోనేషియా ప్రకటించింది. అమెరికా గూఢచర్యం అసలు గూఢచర్యమే కాదు పొమ్మన్న భారత పాలకులతో పోలిస్తే ఇండోనేషియా పాలకుల స్పందన ఉన్నతంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.
ఇండోనేషియా అధ్యక్షుడు సుసిలో బాంబంగ్ యుధయోనో, ఆయన భార్యలతో పాటు అనేకమంది మంత్రుల టెలిఫోన్ సంభాషణలపై ఆస్ట్రేలియా నిఘా పెట్టిందని బ్రిటన్ పత్రిక ది గార్డియన్, ఆస్ట్రేలియా పత్రిక ఎ.బి.సి లు సోమవారం (నవంబర్ 18) వెల్లడించాయి. మే 2013 లో ఎడ్వర్డ్ స్నోడెన్ విడుదల చేసిన పత్రాల ఆధారంగా అవి ఈ సంగతి తెలిపాయి. ఆస్ట్రేలియా డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిఫెన్స్ సిగ్నల్స్ డైరెక్టరేట్ (డి.ఎస్.డి) లు ఈ నిఘాకు పాల్పడ్డాయని, ఇండోనేషియాలోని ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం అమెరికా, ఐరోపా దేశాలకు ఒక గూఢచార కేంద్రంగా పని చేసిందని స్నోడెన్ పత్రాల ద్వారా తెలుస్తోందని పత్రికలు తెలిపాయి.
అధ్యక్షుడు యుధాయోనోతో పాటు ఆయన భార్య క్రిస్టియాని హెరావతి ఫోన్ లను కూడా ఆస్ట్రేలియా గూఢచార సంస్ధలు ట్యాప్ చేయడం ఇండోనేషియాలో సంచలనం సృష్టించింది. అమెరికా, బ్రిటన్ లు తన నీతిమాలిన గూఢచర్యానికి మరో మూడు దేశాలను భాగస్వాములుగా ఎంచుకుంది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్… ఈ ఐదు దేశాలు ఇందులో భాగస్వాములని స్నోడెన్ పత్రాలు తెలిపాయి. ఈ ఐదు దేశాలు తమను తాము ‘Five Eyes’ గా పిలుచుకున్నాయి. కనుక ఆస్ట్రేలియా గూఢచర్యం అంటే అమెరికా, బ్రిటన్ ల గూఢచర్యం అనే అర్ధం. బ్రిటన్ కాకుండా మిగిలిన నాలుగు దేశాలూ ప్రధానంగా బ్రిటిష్ ప్రజలు వలస వచ్చి ఆక్రమించుకున్నవే కావడం ఈ సందర్భంగా గమనార్హం.
ఆస్ట్రేలియా గూఢచర్యం ఎదుర్కొన్నవారిలో ఉపాధ్యక్షుడు బొయెడియోనో తో పాటు మరో 7గురు ఉన్నత స్ధాయి అధికారులు, మంత్రులు కూడా ఉన్నారు. వారి మొబైల్ ఫోన్ల మీద నిఘా పెట్టారన్న విషయం డి.ఎస్.డి స్లైడ్ల రూపంలో రూపొందించిన పత్రం ద్వారా తెలిసింది. ఆ పత్రం నవంబర్ 2009 నాటిది. 3జి టెక్నాలజీని ఆసియాలో అప్పుడే ప్రవేశపెడుతున్న కాలం అది. ఆగస్టు 2009లో అధ్యక్షుడు యుధాయోనో తన నోకియా మొబైల్ ఫోన్ లో 15 రోజుల పాటు సాగించిన సంభాషణలను రికార్డు చేసి, వాటిని వర్గీకరించుకున్న వైనాన్ని డి.ఎస్.డి స్లైడ్లు వెల్లడించాయి. అధ్యక్షుడు ఫోన్ చేసిన నెంబర్లు, ఆయా సంభాషణల కాలం, అది వాయిస్ కాలా లేక ఎస్.ఎం.ఎస్సా అన్న వివరాలు తెలిపే కాల్ డేటా రికార్డ్ (సి.డి.ఆర్) లు స్లైడ్లలో ఉన్నాయి.
“అధ్యక్షుడితో సంబంధంలో ఉన్న వ్యక్తులందరి సంభాషణలకు ఆస్ట్రేలియా గూఢచార సంస్ధ తన గూఢచర్యాన్ని విస్తరించినట్లు కనిపిస్తోంది” అని ది గార్డియన్ పేర్కొంది. ఎన్ క్రిప్షన్ తో ఉన్న సంభాషణలను వెంటనే ఛేదించి అందులో ఉన్న విషయాన్ని సంపాదించాల్సిందిగా ఆదేశాలు కూడా స్లయిడ్ లో ఉన్నాయని పత్రిక తెలిపింది.
డి.ఎస్.డి నిఘా పెట్టినవారంతా ప్రముఖులే. డినో పట్టి జలాల్ అనే ఆయన అధ్యక్షుడికి 2009లో విదేశీ వ్యవహారాల ప్రతినిధి. ఆయన ఆ తర్వాత అమెరికాలో రాయబారిగా నియమితులయ్యారు. అమెరికా రాయబార పదవికి రాజీనామా చేసిన జలాల్ అధ్యక్షుడి పార్టీ ‘డెమోక్రటిక్ పార్టీ’ తరపున వచ్చే సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నారు. మరోకాయన హట్టా రాజస. ఈయన ప్రస్తుతం ఆర్ధిక మంత్రి. నేషనల్ మేండేట్ పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో అధ్యక్షుడిగా తలపడాలని భావిస్తున్నారు. గూఢచర్యం జరిగినప్పుడు రవాణా మంత్రి. ఈయన కూతురు అధ్యక్షుడి చిన్న కుమారుడి భార్య. అనగా అధ్యక్షుడి షడ్రకుడు.
అంతర్జాతీయ వ్యవహారాల నాయకత్వ జాబితాగా డి.ఎస్.డి పేర్కొన్న నిఘా టార్గెట్లలో మరొక వ్యక్తి జూసుఫ్ కల్లా. మాజీ ఉపాధ్యక్షుడయిన కల్లా 2009లో గోల్కర్ పార్టీ అధ్యక్ష అభ్యర్దిగా పోటీ చేశాడు. ముల్యాని ఇంద్రావతి 2010 వరకు ఆర్ధిక మంత్రిగా పని చేసి అనంతరం ప్రపంచ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ లలో ఒకరుగా నియమితులయ్యారు. యువజన మంత్రి ఎండి మల్లారంగెంగ్, ప్రభుత్వ రంగ కంపెనీల మంత్రి సోఫ్యాన్ జలీల్, ఇండోనేషియా మిలట్రీ మాజీ అధిపతి వీడొదో ఆది సుసిప్తో మొ.వారు ఆస్ట్రేలియా నిఘాలో ఉన్నారు.
ఈ గూఢచర్యంలో ఇంకా టెలికాం, ఇంటర్నెట్ కంపెనీల సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా స్లయిడ్ లు తెలిపాయి. అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఎ ఇదే పద్ధతిని ఉపయోగించి ప్రపంచవ్యాపితంగా అనేక మిలియన్ల మంది ఫోన్, ఈమెయిల్, సెల్ ఫోన్ సంభాషణలు రికార్డు చేసిన సంగతి ప్రస్తావనార్హం.
ఆసియా వ్యాపితంగా ఉన్న దేశాల్లోని ఆస్ట్రేలియా ఎంబసీలు గూఢచార కేంద్రాలుగా పని చేశాయని గత అక్టోబర్ లో జర్మనీ పత్రిక డేర్ స్పీజెల్ వెల్లడి చేసింది. ఇండోనేషియా అందులో ప్రముఖంగా పేర్కొన్నారు. అప్పటినుండే ఇండోనేషియా, ఆస్ట్రేలియాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. తమ దేశంపై ఆస్ట్రేలియా గూఢచర్యం చేస్తున్న విషయం మళ్ళీ వెల్లడి కావడంతో ఇండోనేషియా తీవ్రంగా స్పందించింది. విదేశీ మంత్రి మార్టి నటలేగవ ఆస్ట్రేలియాను తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. ఆస్ట్రేలియాకు ముఖ్యంగా పరిగణించే ప్రజల స్మగ్లింగ్, ఉగ్రవాదం లాంటి అంశాల్లో సహకార ఉప్పందాలను సమీక్షిస్తామని స్పష్టం చేశాడు.
జర్మనీ, బ్రెజిల్, మెక్సికో దేశాల నేతల తర్వాత అమెరికా తదితర Five Eyes గ్రూపు గూఢచర్యానికి గురయిన దేశాధినేతల జాబితాలో ఇప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడు కూడా చేరినట్లయింది.
మంత్రులు, అధికారుల ఫోన్లు, ఈమెయిళ్ళు అమెరికా గూఢచర్యానికి గురి కాకుండా ఉండడానికి కట్టుదిట్టమైన వ్యవస్ధను అభివృద్ధి చేస్తామని చెప్పిన మన ఐ.టి మంత్రి కపిల్ సిబాల్ దేశ ప్రజలను మాత్రం అమెరికా దయాక్షిణ్యాలకు వదిలేశాడు. బ్రెజిల్ తరహాలో పశ్చిమ ఐ.టి కంపెనీలు మన దేశంలో సర్వర్లు నెలకొల్పాలన్న ఆలోచన జోలికి కూడా మన పాలకులు పోలేదు. ఇండోనేషియా తరహాలో రాయబారిని ఉపసంహరించుకునే కనీస చర్యయినా తీసుకుంటారా అన్నది అనుమానమే.


అమెరికా ఫోన్ ట్యాపింగుల్లో అందెవేసిన చెయ్య. ఈ విషయాన్ని ఎవరు కాదనలేరు, ఒక్క భారతదేసం తప్ప.