రాజకీయ నాయకులు ఇడియట్స్ -కత్తిరింపు


Politicians are idiots 2

భారత రత్న అవార్డు పొందిన రసాయన శాస్త్రవేత్త ‘చింతామణి నాగేశ రామచంద్ర రావు (సి.ఎన్.ఆర్.రావు) తనకు అవార్డు ఇచ్చారన్న మొహమాటం కూడా లేకుండా రాజకీయనాయకుల గుణగణాలను ఒక్క మాటతో కడిగిపారేశారు. దేశంలో సైన్స్ అభివృద్ధికి ప్రభుత్వాలు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్న చేదు నిజాన్ని సి.ఎన్.ఆర్ రావు విప్పి చెప్పారు. అసలు విద్యారంగం అంటేనే రాజకీయ నాయకులకు శ్రద్ధ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జనాన్ని కూడా సి.ఎన్.ఆర్ రావు వదల్లేదు. కాస్త డబ్బులు ఎక్కువ వస్తే దేశం వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళేవాళ్లు జాతీయ వాదులు ఎలా అవుతారని సరిగ్గా వ్యాఖ్యానించారు. సి.ఎన్.ఆర్.రావుకి స్వయంగా విదేశాలు వెళ్ళే అవకాశాలు అనేకం వచ్చినా వెళ్లలేదని రెండు రోజుల క్రితం ఈటివి2 ప్రసారం చేసిన ప్రత్యేక కధనంలో తెలిపారు. అలాంటి దేశభ్యక్తుడు డాలర్ల కోసం విదేశాలకు మందల్లా తరలి వెళ్తున్న వారి గురించి సరిగ్గానే ఆవేదన వ్యక్తం చేశారు.

సి.ఎన్.ఆర్.రావు చేసిన వ్యాఖ్యలు ‘వివాదాస్పదం’ అని ఆంధ్ర జ్యోతి చెప్పింది. కానీ అది నిజం కాదు. ఆయన చెప్పినవి కఠిన వాస్తవాలు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశం శ్రమను వాడుకుని పెరిగి, భారతీయుల శ్రమతో విద్యావంతుడు అయిన వ్యక్తి తనకు మంచి అవకాశాలు రావడం లేదన్న సాకు చూపుతూ డాలర్ల కోసం అంగలార్చడం దేశభక్తి కానేకాదు. అలాంటివారు జాతీయవాదులు కారన్న రావుగారి విమర్శ సరైనది. ఎన్ని ప్రతికూల పరిస్ధితులు ఎదుర్కొన్నప్పటికీ భారత దేశంలోనే సైన్స్ అభివృద్ధికి కృషి చేసిన రావు ఈ విధమైన ఆవేదన వ్యక్తం చేయడంలో ఎంతో న్యాయం ఉన్నది. వాస్తవాలు చెప్పినపుడు వాటిని గుర్తించాలి గానీ ‘వివాదాస్పదం’ అని ఎంచడం భావ్యం కాదు.

భారత రత్న గౌరవం అందుకున్న సచిన్ స్పందన, సి.ఎన్.ఆర్.రావు గారి స్పందన రెండింటినీ ఒకసారి పోల్చి చూస్తే సచిన్ కి ఆ పురస్కారం ఇవ్వడం ఎంత వ్యర్ధమో అర్ధం అవుతుంది. రిటైర్మెంట్ రోజు గానీ, భారత రత్న పురస్కారానికి ఇచ్చిన స్పందనలో గానీ ఎంతసేపటికీ తానూ, తన కుటుంబం, క్రికెట్ ఇవే తప్ప దేశం గురించి కనీసం ఒక్కటంటే ఒక్కమాట కూడా సచిన్ చెప్పలేకపోయాడు. కనీసం దేశంలో క్రీడాభివృద్ధి గురించి గానీ, క్రికెట్ తో పాటు ఇతర క్రీడలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహం గురించి గానీ సచిన్ మాట్లాడలేకపోయాడు.

నిజం చెప్పాలంటే సచిన్ కి అలాంటి మాటలు తెలియదు. తాను, తన ఆట, తన రికార్డులు, వాటికి వచ్చిన స్పందన… ఇవి తప్ప సచిన్ కి మరొకటి తెలియదు. అందుకే ఆయన మాటలు, ఎన్ని మాట్లాడినా, వాటి చుట్టూనే తిరుగుతాయి. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినపుడు కూడా తనకు స్పోర్ట్స్ కోటాలో సభ్యత్వం ఇచ్చారని చెబుతూ ఎం.పి అయినా క్రికెట్ కే తాను అంకితం అని మాత్రమే సచిన్ చెప్పగలిగాడు. ‘ఎం.పి అయ్యాను కాబట్టి ప్రజల సమస్యలు తెలుసుకుని మాట్లాడడానికి ప్రయత్నిస్తాను’ అని కూడా అనలేకపోయాడు. ఇలాంటి వ్యక్తి ‘భారత రత్న’ ఎలా అవుతాడు?

సి.ఎన్.ఆర్.రావు భారత రత్నకు తగిన వ్యక్తి అని ఆయన మాటలు, ఆవేదన, విమర్శలు స్పష్టంగా చెబుతున్నాయి. దేశం గురించి ఆలోచించిన వ్యక్తి కాబట్టే రాజకీయ నాయకులను ‘ఇడియట్స్’ అని అనగలిగాడు. సాధారణంగా తనకు పురస్కారం ఇచ్చినవారిని విమర్శించడానికి ఎవరైనా జంకుతారు. లేదా మొహమాటపడతారు. అలాంటివేమీ పెట్టుకోకుండా ఉండడమే కాకుండా దేశంలో విద్యారంగం అభివృద్ధి గురించీ, సైన్స్ అభివృద్ధి గురించీ రాజకీయ నాయకులను విమర్శిస్తూనే జనానికి కూడా ‘జాతీయవాదులు’గా ఉండాల్సిన ఆగత్యాన్ని చాలా చక్కగా గుర్తు చేశారు.

హేట్స్ ఆఫ్ డాక్టర్ సి.ఎన్.ఆర్.రావు గారూ! దేశభక్తి అనేది సరిహద్దుల్లోనో, క్రికెట్ గెలుపుల్లోనో, మూడురంగుల జెండా ఊపుడులోనో ఉండదనీ, దేశంలోని జనం అభివృద్ధిలోనే నిజమైన దేశభక్తి ఉంటుందని మీ మాటలు మరోసారి స్పష్టం చేశాయి. అందుకోండి మా సవినయ వందనం!

(కింద బొమ్మపై క్లిక్ చేస్తే పెద్ద సైజులో చూడొచ్చు.)

Politicians are idiots

5 thoughts on “రాజకీయ నాయకులు ఇడియట్స్ -కత్తిరింపు

  1. “ఈ దేశభవిష్యత్తు నాలుగు గదుల తరగతి గదులలో రూపుదిద్దుకొంటుంది” అని కొఠారి కమీషన్ 1962 లో సూచించింది.అంతే కాకుండా జి.డి.పి లో 6% కేటాయించాలని కూడా తెలిపింది.ఈ సిఫార్సులను గత 50 ఏళ్ళుగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దాని ఫలితమే నేటి మిధ్యా అభివౄద్ది,అసమానతల సమాజం!నేటి విద్యార్దుల, తల్లిదండ్రుల ప్రదాన అశయం ఇంజినీరింగ్ చదువులు,వారు తెచ్చే జీతాలు!

  2. సచ్చిన్ ప్రజల సమస్యలు తెలుసుకోని కొత్తగా ఎమి చేయాలని మీరనుకొంట్టున్నారు? ఇప్పటికే ప్రజల సమస్యలు కూలం కషంగా తెలుసుకున్న వారు చాలామంది ఉన్నారు. వారు దేశ సేవచేస్తే చాలు లేండి.

  3. సచిన్ ఎం.పి కూడా. భారత రత్న అయ్యాక బాధ్యత ఇంకా పెరిగింది. జనం సమస్యలు తెలుసుకున్నవారు ఏం చేయాలో సచిన్ కూడా అదే చేయాలి. కోట్లకు కోట్లు ఎండార్స్ మెంట్ ల ద్వారా జేబులో వేసుకోవడంతో ఆయన పని పూర్తి అవుతుందా? సుబ్రమణ్యస్వామి లాంటివారి సేవ మీకు సరిపోతుందేమో గానీ, ప్రజలకు చేయాల్సిన అసలు సేవ ఇంకా మిగిలే ఉంది. అది మీరు గుర్తించకపోయినా సచిన్ గుర్తిస్తే చాల్లెండి!

  4. నిజమా ! సమస్యలే లేని భారత దేశంలో ఏ రాజకీయ నాయకులైనా ఎందుకు సచ్చిన్‌ తో పాటు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s