ఈ ‘క్రికెట్ పిచ్చోడి’కి రిటైర్మెంట్ లేదు


Sudhir Kumar Gautam 2

ఇతని పేరు చాలామందికి తెలియదు గానీ, ఇతన్ని చూసినవారు మాత్రం బహుశా కోట్లమందే ఉండవచ్చు. బీహార్ నివాసి అయిన ఇతని పేరు సుధీర్ కుమార్ గౌతం. ఇతని జీవితం అంతా క్రికెటర్లు, క్రికెట్ స్టేడియంల చుట్టూ గడిచిపోతోంది. భారత క్రికెట్ దేవుడిగా కొలుపులు అందుకుంటున్న సచిన్ టెండూల్కర్ మరి కొద్ది రోజుల్లో రిటైర్ అవబోతున్నా, తన క్రికెట్ పిచ్చికి మాత్రం రిటైర్మెంట్ లేదని గౌతం స్పష్టం చేస్తున్నాడు. వంటినిండా జాతీయ పతాకాన్ని, సచిన్ పేరును పెయింటింగ్ వేసుకుని క్రికెటర్ల వెంటబడి ఉపఖండం అంతా తిరిగే గౌతంకి సచిన్ ప్రోత్సాహం అందడం ఒక విషాదం!

“ఇదే నా జీవితం” అని గౌతం చెప్పాడని ది హిందు పత్రిక తెలిపింది. ఏమిటా జీవితం? మ్యాచ్ కి ముందు రోజు వంటి నిండా మూడు రంగుల జాతీయ పతాకం పెయింటింగ్ వేసుకోవడం. టెండూల్కర్ అని పొట్టపైన రాసుకోవడం. పెయింటింగ్ ఆరడానికి ఆ రాత్రంతా నిద్ర లేకుండా మెలకువగా ఉండడం. ఇండియా, ఉపఖండంలో ఆడే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్ కీ హాజరు కావడం. జట్టు సభ్యులు మైదానంలోకి అడుగుపెట్టగానే శంఖం ఊదడం. పెద్ద జెండా ఒకటి పట్టుకుని మ్యాచ్ మొదలయింది మొదలు ముగిసేవరకూ ఆ జెండా ఊపుతూ నిలబడడం. ఆ తర్వాత మ్యాచ్ కి మళ్ళీ సిద్ధం కావడం. ఇదే సుధీర్ కుమార్ గౌతం జీవితం.

క్రికెట్ సెలబ్రిటీల చుట్టూ అలుపూ సోలుపూ లేకుండా తిరిగే గౌతం ఇప్పుడు తానే ఒక సెలబ్రిటీ అయ్యాడు. ఇతన్ని పెయింటింగ్ లేకుండా గుర్తు పట్టడం సాధ్యం కాదనుకుంటాను. కానీ పెయింటింగ్ వేసుకుని స్టేడియం కి రాగానే జనం ఇతని చుట్టూ మూగడం ఒక పరిపాటిగా మారింది. మ్యాచ్ ని కవర్ చేసే కెమెరాలు తప్పనిసరిగా ఇతన్ని రోజులో అనేకసార్లు చూపించకుండా వదలవు. దానితో దేశంలోనే కాకుండా క్రికెట్ ఆడే ఇతర దేశాల్లో కూడా ఇతని రూపం అందరికి తెలిసినదిగా స్ధిరపడిపోయింది.

మ్యాచ్ ల కోసం నిరంతరం ప్రయాణాల్లో ఉండే గౌతం తన వూరు ముజఫర్ పూర్ లో మాత్రం చాలా తక్కువగా కనపడతాడు. ఇతని ప్రయాణాలు, టి.వి కవరేజి వలన ఢాకా, లాహోర్, కొలంబో లలో కూడా స్నేహితులు ఏర్పడ్డారట. ఐ.పి.ఎల్ మొదలయ్యాక గౌతం కి మరింత పని పెరిగింది. వండే ఇంటర్నేషనల్ మ్యాచ్ గానీ, టెస్ట్ మ్యాచ్ గానీ అయితే ఒక రోజు ముందుగానే పెయింట్ వేసుకుంటాడట. అదే ఐ.పి.ఎల్ లాంటి T20 మ్యాచ్ లకి అయితే ఆ రోజే వేసుకుంటాట్ట.

సచిన్ కళ్ళల్లో పడ్డాక గౌతం పిచ్చి మరింత ముదిరింది అని చెప్పొచ్చు. క్రికెట్ దేవుడు స్వయంగా దిగి వచ్చి తన ఇంట్లోకి ఆహ్వానించాక పిచ్చి ముదరకపోతేనే ఆశ్చర్యం గాని ముదిరితే ఆశ్చర్యం ఏముంటుంది? అసలు టెండూల్కర్ ని కలవాలన్న అతని పిచ్చి మొదలయింది. సచిన్ ని కలవడానికి గౌతం ముజఫర్ పూర్ నుండి జంషెడ్ పూర్ వరకూ సైకిల్ మీద వెళ్ళాడు. కానీ గాయం వల్ల ఆరోజు సచిన్ ఆడలేదు. దాంతో కలవలేకపోయాడు.

అయినా గౌతం వెనకడుగు వేయలేదు. పంతంతో ముంబైకి ప్రయాణం కట్టాడు. సహజంగానే ఆటగాళ్లను కలవడానికి అతనికి అవకాశం దొరకలేదు. ఆటగాళ్లు బస చేసిన ఒబెరాయ్ హోటల్ కి వెళ్ళిన గౌతం ఎలాగో ఆటగాళ్లు ప్రయాణించే బస్సులో దూరిపోయాడు. “నేనెలాగో బస్సులోకి ప్రవేశించగలిగాను. వెళ్ళగానే సచిన్ కాళ్లపై పడిపోయాను” అని గౌతం గర్వంగా చెప్పుకున్నాడు. దేవుడు కదా!

ఆ తర్వాత సచిన్ ఇంటికే వెళ్ళాడు గౌతం. “ఉదయం నుండి సాయంత్రం దాకా గేటు దగ్గరే పడిగాపులు కాశాను. ఒక ర్యాకెట్ తయారు చేసి గాల్లోకి విసిరిన తర్వాతే సచిన్ దృష్టిలో పడ్డాను. ఆ రోజు సచిన్ తో ఫోటో దిగాను. సచిన్ నాకు మ్యాచ్ టికెట్ కూడా ఇచ్చాడు” అని గౌతం చెప్పాడని ది హిందు తెలిపింది. ఇది జరిగింది 2003లో.

సచిన్ కరుణాకటాక్షం పొందాక గౌతం ఇక వెనుదిరిగి చూడలేదు. అప్పట్నుండి ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ లోనూ అతను కనపడుతూనే ఉన్నాడు. ఒకసారి కటక్ లో మ్యాచ్ జరుగుతుండగా ఉండబట్టలేక మైదానంలోకి దూకి పరుగెట్టడం మొదలుపెట్టాడు. మైదానం చుట్టూ ఉండే ఫెన్సింగ్ ఎక్కి మైదానంలోకి దూకి పరుగెత్తాడు. హైద్రాబాద్ లో కూడా అలాగే చేశాడు. సెక్యూరిటీ గార్డులు అతన్ని తరుముకున్నారు. సచిన్ చూసి శిక్ష నుండి రక్షించాడట. సచిన్, గౌతం నుండి ఇక ఎప్పుడూ మైదానంలో పరుగెత్తనని హామీ తీసుకున్నాడు. అప్పటి నుండి మైదానంలో పరుగెట్టడం మానుకున్నాడట.

పాకిస్ధాన్ లో కూడా ఇతనిలాగే ఒక క్రికెట్ పిచ్చోడు ఉన్నాడు. ఆయన పెద్దాయన. చాచా అని ఆయన్ని పిలుస్తారు. పాకిస్తాన్ వెళ్ళినపుడు తాను చాచా దగ్గరే ఉంటానని గౌతం చెబుతున్నాడు. కొలంబో, ఢాకా లలో కూడా తనను సాదరంగా ఆహ్వానించే మిత్రులు ఉన్నారని గౌతం తెలిపాడు. పోలీసు దెబ్బలు తప్ప తన క్రికెట్ పిచ్చిలోని మిగిలిన భాగం అంతా గొప్ప అచీవ్ మెంట్ గానే గౌతం భావిస్తున్నాడు.

టెండూల్కర్ నుండి ఏమి పొందుతున్నావని ప్రశ్నిస్తే “ప్రేమ… మ్యాచ్ టికెట్లు” అని గౌతం బదులిచ్చాడు. మరి సచిన్ రిటైర్ అవుతున్నాడు కదా, నువ్వు కూడానా? అని అడిగితే తనకు రిటైర్మెంట్ లేదు పొమ్మన్నాడు. సచిన్ రిటర్ అయ్యాక వంటిపైన “Miss you Sachin” అని రాసుకుంటానని చెప్పాడు గౌతం.

ఇప్పుడు గౌతంకి 32 యేళ్ళు. 2003 నుండి అతను ఈ పనిలోనే ఉన్నాడు. ‘పెయింటింగు వేసుకోవడం, రాత్రిళ్ళు జాగారం చేయడం, రైళ్లలో, బస్సుల్లో, సైకిల్ పైనా దూరాలు ప్రయాణించడం. శంఖం ఊదడం, జెండా ఊపడం!’ గత పదేళ్లుగా గౌతం జీవితం ఇదే. ఈ జీవితాన్ని చాలా గర్వంగా భావిస్తున్నాడతను.

కానీ నిజంగా గర్వించదగ్గ జీవితమేనా అది? క్రికెట్ ఆడేవాళ్ళు ఏ పనీ చేయకపోయినా ఎలాగూ లక్షలు, కోట్లు వస్తున్నాయి. ఇతన్ని చూపించే కెమెరా మెన్ లకూ నెల వేతనాలో కాంట్రాక్టు మొత్తాలో వస్తున్నాయి. ఆట చూసేవారు కూడా ఏదో ఒక పని చేస్తూ ఒక ఉపయోగకరమైన పనిలో ఉంటారు. ఏ పనీ లేకపోతే నిరుద్యోగిగా అయినా ఉంటారు.

కానీ గౌతం అటు ఉద్యోగీ కాదూ, అలాగాని తాను నిరుద్యోగిని అని కూడా అతను భావించడం లేదు. ఒట్టి పనికిమాలిన, దండగ పనిలో అతను ఉన్నాడు. అతని పనికి ఎవరూ వేతనం ఇవ్వరు. ఆ పనిలో ఏ ఉత్పత్తీ ఉండదు. అతని ఊరివాళ్లతో ఏ సామాజిక సంబంధమూ అతనికోసం అభివృద్ధి కాదు. అంటే సంవత్సరంలో చాలా కాలంపాటు ఏ బంధాలూ అతనికి ఉండవు. అది జీవితమేనా?

సచిన్ తో ఫోటో దిగినట్లు గౌతం చెప్పుకుంటే అది సచిన్ జీవితమే గానీ గౌతం జీవితం కాబోదు. రోజంతా తన ఇంటిగేటు దగ్గర పడిగాట్లు పడే అభిమానిని హెచ్చరించి అలాంటి పనులు చేయొద్దని చెప్పగల సెలబ్రిటీ ఎవరన్నా ఉంటారా? “అన్నన్ని రోజులు ఒంటి మీద పెయింటింగ్ వేసుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. ఏమిటా పిచ్చి పని?” అని సచిన్ తన వీరాభిమాని మేలు కోరి చెప్పలేడా? పెయింటింగ్ వేసుకుని జెండా ఊపితేనే దేశభక్తి పూరిత వ్యక్తిత్వం కాదని తనపై ఆధారపడ్డవారిని సక్రమంగా పని చేసి పోషించగలిగితే అంతకు మించిన వ్యక్తిత్వం, వ్యక్తిగత సమగ్రత ఉండదని  ఏ ఆటగాడన్నా అతనికి చెప్పగలడా?  కూల్ డ్రింక్స్ లాంటి పనికిమాలిన, హానికరమైన ఉత్పత్తులను ఎండార్స్ చేస్తూ అభిమానులను ఒక విధంగా మోసం చేస్తున్న సచిన్ టెండూల్కర్ నుండి అలాంటి ఉదాత్తమైన హెచ్చరికలు, హితబోధలు వస్తాయని ఆశించడం అత్యాశ కావచ్చేమో.

కానీ సుధీర్ కుమార్  గౌతం అయినా ఎప్పుడన్నా ఈ సంగతి తెలుసుకుంటాడా? ఎప్పటికయినా ఆయనలో విచక్షణ  మేలుకుంటుందా? ఏమో, అనుమానమే!

One thought on “ఈ ‘క్రికెట్ పిచ్చోడి’కి రిటైర్మెంట్ లేదు

  1. nice article, it is really sad , i feel very sad. what about his life, career, marriage, family etc. i heard he was not willing to marry too to watch cricket. he is feeling sachin as his god, if sachin would had told him / ordered his devotee to leave such maniacal crazy on cricket or atleast limit it he would had followed it. but we dont know what sachin told to him !! moreover i read somewhere that he threatened that he will commit suicide if match tickets for entire life are not provided to him. it is better if sachin would spend few bucks on him and see him getting treatment from good psychiatrist and recommend to give good job in bcci like helper for indian team like that so that his desire to view all matches too fulfills

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s