రాక్షస తుఫాను హైయన్ ధాటికి ఫిలిప్పైన్స్ విలవిలలాడింది. మహా పెను తుఫాను ధాటికి 10,000 మందికి పైగా మరణించి ఉంటారని భయపడుతున్నారు. ఒక్క లేటి ద్వీప రాష్ట్రంలోనే 10,000 మందికి పైగా మరణించారని, సమర్ ద్వీపంలో మరణాలు కూడా కలుపుకుంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఫిలిప్పైన్స్ అధికారులు చెబుతున్నారు. లేటే రాష్ట్రం మొత్తం దాదాపు నాశనం అయిందని స్ధానిక అధికారులను ఉటంకిస్తూ రష్యా టుడే తెలిపింది.
లేటి రాష్ట్రంలో 80 శాతం భాగం పూర్తిగా ధ్వంసం అయిందని ఆ రాష్ట్ర చీఫ్ సూపరింటెండ్ ఎల్మర్ సోరియా చెప్పారని రాయిటర్స్ తెలిపింది. “గవర్నర్ తోను, ఇతర అధికారులతోనూ గత రాత్రి సమావేశం అయ్యాం. తమ అంచనా ప్రకారం 10,000 మంది చనిపోయారని గవర్నర్ చప్పారు” అని సోరియా తెలిపారు.
చనిపోయినవారిలో అత్యధికులు నీళ్ళలో మునిగిపోవడం వలన గానీ, భవనాలు కూలిపోవడం వలన గానీ చనిపోయారని ఫిలిప్పైన్స్ అధికారులు చెప్పారు. టాక్లోబన్ నగర అధికారి టెక్సన్ లిమ్ ప్రకారం ఒక్క టాక్లోబన్ నగరంలోనే మరణాల సంఖ్య 10,000 దాటుతుంది (ఎ.ఎఫ్.పి). పోలీసులు ఈ నగరంలో కూలిపోయిన ఇళ్లను కాపలా కాస్తున్నారు. నీళ్ళు, ఆహారం లేక అలమటిస్తున్న జనం లూటింగుకు పాల్పడవచ్చని వారి భయం.
ఫిలిప్పైన్స్ హోమ్ కార్యదర్శి (మన హోమ్ మంత్రితో సమానం) మార్ రోగ్జాస్ పరిస్ధితిని “భయంకరం” గా అభివర్ణించాడు. “ఎక్కడ చూసినా మృతులే. రోడ్డుపైన వారే, ఇళ్ళల్లో వారే, శిధిలాల కిందా వారే. అంతటా వారే” అని ఆయన తెలిపాడు. ఆధునిక జీవనానికి సంబంధించిన అన్నీ సౌకర్యాలూ, వ్యవస్ధలూ -సమాచార వ్యవస్ధ, విద్యుత్, నీటి సరఫరా- నాశనం అయ్యాయని తెలిపాడు. మీడియా కూడా పని చేయకపోవడంతో ప్రజలను సామూహికంగా సంప్రదించే మార్గం లేకుండా పోయిందని తెలిపాడు.
ఆదివారం మధ్యాహ్నానికి తుఫాను వియత్నాం తీరం దాటవచ్చని వాతావరణ శాస్త్రజ్ఞులు ప్రకటించారు. తీర ప్రాంతాల నుండి 5 లక్షల మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించామని వియత్నాం ప్రభుత్వం తెలిపింది.
సమర్ ద్వీపంలో 300 మందికి పైగా మరణించినట్లు ధృవీకరించగా 2,000 మంది ఆచూకీ గల్లంతయింది. తీర ప్రాంతంలో సముద్ర అలలు 20 నుండి 50 అడుగుల వరకు ఎగిసిపడ్డాయి. ఈ ద్వీపంలో అనేక గ్రామాలకు ఇంకా చేరుకోవలసి ఉంది. విద్యుత్ లేదు. టవర్లు కూలిపోవడంతో సెల్ ఫోన్ సంకేతాలు కూడా అందడం లేదు. నీటి ప్రవాహం వల్ల రోడ్డు సౌకర్యాలు తెగిపోయాయి. వంతెనలు కూలిపోయాయి. ఫలితంగా అనేక గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి.
ఇతర ద్వీపాల నుండి సమాచారం ఇంకా వస్తూనే ఉంది. డజన్ల కొద్దీ జనం చనిపోయిన వార్తలు చేరుతున్నాయి.
నవంబర్ 1991 లో సంభవించిన ధెల్మా తుఫానులో ఫిలిప్పైన్స్ లో 5,100 మంది చనిపోయారు. 1976లో సంభవించిన 7.9 తీవ్ర భూకంపంలో 5,800 వరకు చనిపోయారు. ఆ తర్వాత ఇంత భారీ స్ధాయిలో ప్రజలు చనిపోవడం ఫిలిప్పైన్స్ లో ఇదే ప్రధమం. ఫిలిప్పైన్స్ చరిత్రలోనే ఇంత భారీ జన, ధన, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.
అంతర్జాతీయ సహాయం
తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలకు వివిధ అంతర్జాతీయ సంస్ధలు సహాయం చేసే ఏర్పాట్లలో ఉన్నాయి. ఇప్పటివరకు రెడ్ క్రాస్ సంస్ధ సహాయ పనుల్లో ముందంజలో ఉంది. వివిధ చోట్ల చిక్కుకుపోయినవారిని వెతికి రక్షించడానికి సిబ్బందిని పంపుతామని, ఒక మొబైల్ ఆసుపత్రి కూడా పంపగలమని రష్యా అత్యవసర శాఖ మంత్రి ప్రకటించాడు. 50 మంది సిబ్బంది 2 విమానాలు పంపనున్నట్లు రష్యా ప్రతినిధి తెలిపారు. సహాయానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. తమ నౌకాదళం నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
ఐరాస ప్రకృతి విపత్తు సహాయ విభాగం బృందం టాక్లోబన్ నగరానికి చేరుకుంది. స్ధానిక అధికారుల నేతృత్వంలో సహాయ కార్యక్రమాలను సమన్వయ పరుస్తున్నామని UNDAC ప్రతినిధి తెలిపారు. ఐరాస పిల్లల సంస్ధ UNICEF, ప్రపంచ ఆహార సంస్ధలు కూడా రంగంలోకి దిగాయి. UNICEF ప్రకారం 1.7 మిలియన్ల మంది పిల్లలు హైయన్ వల్ల ప్రభావితులయ్యారు. అత్యవసర ఔషధాలు, పోషకార సరఫరాలు, రక్షిత నీరు తదితర సరఫరాలు అందించే ప్రయత్నం చేస్తున్నామని UNICEF ప్రతినిధులు తెలిపారు.
ప్రపంచ ఆహార సంస్ధ ఇప్పటివరకు 2 మిలియన్ డాలర్లను హైయన్ తుఫాను సహాయ కార్యక్రమాలకు కేటాయించినట్లు తెలిపింది. బాధితులకు 40 మెట్రిక్ టన్నుల హై ఎనర్జీ బిస్కట్లు పంపామని తెలిపింది. ‘సేవ్ ద చిల్డ్రన్’, ‘వరల్డ్ విజన్’ తదితర ఎన్.జి.ఓ సంస్ధలు కూడా రంగంలోకి దిగాయి. ఈ రెండు సంస్ధలు ఆన్ లైన్ ద్వారా నిధులు సేకరించే కార్యక్రమానికి ఉపక్రమించాయి.























