ఆదాయ విభజన: ఆంధ్ర 51%, తెలంగాణ 49%


రాష్ట్ర ఆదాయంలో సగానికి పైగా వాటా హైద్రాబాద్ నగరంలోనే వస్తోందని కాబట్టి విభజన వల్ల (తెలంగాణ లేని) ఆంధ్ర ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని విభజన వ్యతిరేకులు వ్యక్తం చేస్తున్న ప్రధాన ఆందోళన. ఈ విధంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని వివరిస్తూ ఈ బ్లాగ్ లో ఒక ఆర్టికల్ ప్రచురించడం జరిగింది. సదరు ఆర్టికల్ లోని అంశాలను దాదాపు ధ్రువపరుస్తూ ఈ రోజు ఈనాడు పత్రిక రాష్ట్ర ఆదాయాల విశ్లేషణ ప్రచురించింది.

ఇంకా చెప్పాలంటే నేను వేసిన లెక్కల కంటే తక్కువ ఆదాయమే హైదరాబాద్ కి వస్తుందని, మొత్తం మీద చూస్తే ఆంధ్ర + రాయలసీమ ఆదాయం కంటే తెలంగాణ + హైదరాబాద్ ఆదాయమే 2 శాతం తక్కువగా ఉన్నదని పత్రిక తెలియజేసింది. ఈ లెక్క ఈనాడు సొంత అంచనా కాదు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన రాబడి లెక్కలే ఇవి. పైగా 2013-14 అంచనా.

ఈ లెక్కల ప్రకారం ఆంధ్ర + రాయలసీమ రాబడి మొత్తం రాబడిలో 51 శాతం ఉంటే, తెలంగాణ + హైదరాబాద్ రాబడి 49 శాతం ఉన్నది. ప్రజల వినియోగమే/వ్యయమే ప్రభుత్వ ఆదాయం. కాబట్టి ఆదాయాన్ని వినియోగం ప్రాతిపదికన విభజించడమే న్యాయం.

 పైగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న విద్యా ప్యాకేజీ (ఒక ఐ.ఐ.టి, మూడు సెంట్రల్ యూనివర్సిటీలు, రెండు ఐ.ఐ.ఐ.టిలు), కేంద్ర మంత్రులు డిమాండ్ చేస్తున్న ఐ.టి.ఐ.ఆర్ ప్యాకేజీ కార్యరూపం దాల్చితే సీమాంధ్ర జనానికి బోలెడు లాభం. ఈ ప్యాకేజీలు సాధించడం పైన జనం, నాయకులు, ఉద్యమాలు దృష్టి పెట్టడం నేటి తక్షణ అవసరం.

ఇతర వివరాలు కింద బొమ్మలను క్లిక్ చేసి చూడండి. విభజన వల్ల సీమాంధ్రకు నష్టం ఏ మాత్రం లేదని ఇట్టే అర్ధం అవుతుంది.

Telangana division 01

Telangana division 02

One thought on “ఆదాయ విభజన: ఆంధ్ర 51%, తెలంగాణ 49%

  1. ఈ వ్యవహారాలలో పటాటోపం తప్ప వాస్తవం సుద్ధ శూన్యం. నిజానికి ఎవరికి విభజన విషయంలో స్పష్టమైన అవగాహన లేదు కానీ, ప్రతీవాడు తానొక మేధావిగా జనం దృష్టిని ఆకట్టుకునేందుకు తంటాలు పడలేక ఛస్తున్నారు. పెండోరాస్ బాక్స్ అతి సులభంగా తెరిచారు కానీ సంతృప్తి పరిచే రీతిలో ఎలా ముగించాలో తెలియక తలలు పట్టుకోలేక మొలతాళ్ళు పీక్కుంటున్నారు. అందుకనే ప్రజలు తమాషా చూస్తున్నారు కానీ ఎవరు స్పందించటంలేదు. ఎవరు తీసుకున్న గోతిలో వారె పడతారనటానికి ఇంతకంటే ప్రత్యక్ష నరకం మరొకటి లేదు.

వ్యాఖ్యానించండి