కళలు 64 రకాలని తెలుగు పెద్దలు చెబుతారు గానీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పుస్తకం తెరిస్తే కళల సంఖ్యకు అసలు పరిమితంటూ ఉండదని తెలిసొస్తుంది. మాయం అయ్యే కళ గిన్నిస్ బుక్ లోకి ఎక్కిందో లేదో తెలియదు గానీ, లియు బోలిన్ అనే చైనా కళాకారుడు ఈ కళలో ఆరితేరాడు.
మనం రోజూ చూసే దృశ్యాలలో కలిసిపోయి తానక్కడ లేనట్లు భ్రమ కల్పించడం లియు ప్రదర్శించే కళ. అందుకోసం ఆయన ఎంచుకున్న మార్గం తన శరీరాన్నే కాన్వాస్ మార్చుకోవడం. బాడీ ఆర్ట్ పేరుతో, టాటూ/పచ్చ బొట్లు పేరుతో శరీరంపై పెయింటింగ్స్ ప్రదర్శించడం అందరికీ తెలిసిందే. పిల్ల కాలవ లాగా లేదా ఉపనది లాగా ఈ బాడీ పెయింటింగ్ లోనే తమకంటూ ఒక ప్రత్యేక తరహా కళను అభివృద్ధి చేయడం లియు బృందం సాధించిన ఘనకార్యం.
పరిసరాలకు తగ్గట్లుగా తన వంటిపైన లేదా తాను ధరించిన దుస్తుల పైన రంగులు వేసుకుని ఈయన ‘మట్టిలో మట్టినై, గాలిలో గాలినై, పుస్తకాల్లో పుస్తకాన్నై, సరుకుల్లో సరుకునై’ అన్నట్లుగా కలిసిపోతాడు లియు బోలిన్. కూరగాయలు, పుస్తకాల షాపు, సూపర్ మార్కెట్లు, మెట్లు, తలుపులు ఇలా ఏదీ వదలకుండా లియు వాటిలో కలిసిపోవడం ఈ ఫొటోల్లో చూడవచ్చు.
మనిషి తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఎంత దగ్గరగా సంబంధం కలిగి ఉంటాడో లియు అభ్యసించిన కళ చెబుతుంది. ప్రకృతిని చేతుల్లోకి తీసుకున్న మనిషి దానిని నాశనం చేసే విధంగా వ్యవహరించకూడదనీ, దాన్ని కాపాడుతూనే తన అవసరాలు తీర్చుకోవాలనీ కూడా లియు తన కళ ద్వారా సందేశం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. “Live and let live” అన్నమాట!
2005లో పెర్ఫార్మెన్స్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన లియు అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. ‘Hiding in the city”, “The Invisible Man” తదితర పేర్లతో ఆయన ఇచ్చిన ప్రదర్శనలకు సంబంధించిన ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక అందించింది.























