ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఏపాటిది? -కార్టూన్


AAP dream

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పోర్టీ మొదటిసారిగా తన బలాన్ని నిరూపించుకోబోతోంది. బడా భూస్వామ్య – బడా పెట్టుబడిదారీ వర్గాల పార్టీలయిన బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలతో అది పోటీపడుతోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఈ పార్టీ పరిస్ధితి కాంగ్రెస్, బి.జె.పిలతో పోలిస్తే ఎలా ఉంటుందో కార్టూనిస్టు ఈ కార్టూన్ లో చెబుతున్నారు.

జన, ధన బలాలూ, బలగాలూ దండిగా ఉన్న కాంగ్రెస్, బి.జె.పి లతో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడడం అంటే మత్త గజాలతో చిట్టెలుక పోటీ పడడం లాంటింది. ఎన్నికల కార్యక్రమాన్ని ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండేలా చేయడంలో 60 యేళ్ళ పార్లమెంటరీ ప్రజాస్వామ్య నాయకులు సఫలం అయ్యారు. డబ్బు, పలుకుబడి, మద్యం, కానుకలు ఇత్యాదిగా గలిగిన సవాలక్ష ప్రభావాలు లేకుండా ఏ ఎన్నికలోనూ సామాన్యుడు గెలవలేని పరిస్ధితి స్ధిరపడిన తర్వాత అదే వ్యవస్ధలో చోటు కోసం తపిస్తే నిరాశ తప్ప మరో ఫలితం ఉండబోదు.

ఈ విషయంలో పాఠం నేర్చుకోవాలనుకుంటే ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సత్తా పార్టీ ఒక చక్కటి ఉదాహరణ. వ్యవస్ధలో ఉన్న అనేకానేక లొసుగుల జోలికి పోకుండా, లొసుగులే ప్రాణవాయువుగా కలిగిన వ్యవస్ధలో భాగస్వామ్యలుగా ఉంటూ దానిని సంస్కరించబూనుకోవడం ఒక అవివేక కార్యక్రమంగానే అంతిమంగా తేలిపోతుంది. ఇలాంటి పార్టీలు ఎన్ని దశాబ్దాలు శ్రమ పడితే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు అసెంబ్లీ, పార్లమెంటుల్లో ప్రవేశిస్తారు?

హ్యారీ పోటర్ సినిమాలో మంత్రాల చీపురు కట్టే గాలిలో ఎగిరేందుకు ఉపయోగించే సాధనం. అందులో పాత్రలన్నీ చీపురుపైన కూర్చొని దేశం మొత్తం తిరిగేస్తుంటారు. తనను తాను ఇతరులకు కనిపించకుండా ఉండడానికి మంత్ర దుప్పటిని ఆశ్రయించడం, మంత్రించిన పుల్లలతో యుద్ధాలు చేయడం… ఇత్యాదివి ఆ సినిమాలో పిల్లలకు వినోదం కలిగించే విషయాలు. కానీ అది సినిమా! నిజ జీవితంలో అవి సాధ్యం అయ్యేవి కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇలాగే ఉన్నాయని కార్టూనిస్టు సూచిస్తున్నట్లు కనపడుతోంది.

మంత్రించిన పేపర్ పంకా సహాయంతో మంత్రించిన చీపురు కట్ట (పార్టీ చిహ్నం) పైన కూర్చొని ఎన్నికల ప్రయాణాన్ని సాగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. అవన్నీ ఊహల్లో సాధ్యం కావచ్చు గానీ, ప్రజల చైతన్యానికి ఏ మాత్రం తావులేని పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్ధలో సాధ్యం కాదని ఈ కార్టూన్ ద్వారా అర్ధం చేసుకోవచ్చు. (ఈ ఆర్ధం కార్టూనిస్టుది కాకపోవచ్చు.)

ఏలయనగా… మంత్రాలకు చింతకాయలు రాలునా? ప్రజల దైనందిన జీవన పరిస్ధితుల జోలికి పోని నీతి/అవినీతి సూత్రాలు జనాన్ని బ్యాలట్ పెట్టె దగ్గరికి లాక్కు రాగలవా?

5 thoughts on “ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఏపాటిది? -కార్టూన్

  1. “ఏ ఎన్నికలోనూ సామాన్యుడు గెలవలేని పరిస్ధితి స్ధిరపడిన తర్వాత అదే వ్యవస్ధలో చోటు కోసం తపిస్తే నిరాశ తప్ప మరో ఫలితం ఉండబోదు. ”
    గత్యంతరమేమని మీ ఉద్దేశ్యం?

    ప్రజలకు బుధ్ధిరానంతవరకూ వారికి ఏ మంచీ జరుగదు. ఒకవేళ మంచే జరిగితే వారు అదేతప్పులు మరింత పట్టుదలతో కొనసాగిస్తారుకాబట్టి అది జరుగరాదుకూడా. అలాగని ప్రజలకు బాగుపడే అవకాశాలుండకూడదనికాదుకదా! AAP దేశమంతా విజయఢంకా మ్రోగిస్తుందన్న ఆశలేవీనాకులేవు. కొన్ని నియోజకవర్గాల్లోనైనా గెలువకపోతుందా. చినుకుచినుకు వానైనట్లు చిన్నిగెలుపే విప్లవమవుతుందేమో! చూద్దాం.

  2. చీపురుకట్టైనా, కరివేపాకు రొట్టైనా, ఆమ్ ఆద్మికి ఒరింగిందేది లేదు. కేజ్రివాల్ రాజకీయవేగం ఎడారిలో ఒయాసీసు లాంటిది. ప్రజలలోకి చొచ్చుకుపోయే తరుణంలో ముసలాయన(అన్నాహజారే)తో విభేదించిన తీరుతో బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోయింది. వేళ్ళుపాతుకుపోయిన వట వృక్షాలను కాలి గోరుతో పెకలిస్తాననడంలో ఆహంభావం తప్ప ఆలోచన శున్యం. లాఖోం నజారోంలోని “అన్నా”తో “హజారే” విభేదాలతో తానేదో ఉద్ధరిస్తాననడం ఉద్ధరిణి నీటితో స్నానంచేశానని బుకాయించడమే. విజ్ఞానభరిత వ్యక్తుల పార్టీలలోని బలహీనత వారి ఐక్యతలోని అజ్ఞానత. అఖండ ప్రజల స్పందనలో బంధనం పెంచుకోవలసింది పోయి సిద్ధాంత విబేధాలతో దూరమవడం ఎన్నికలలో ప్రజలకు తమకు తాముగా దూరమవడమనేది నగ్న సత్యం.

  3. ప్రజల కళ్లు కొంచం కొంచం తెరుచుకొంటూ ఉండగా …… ఆకళ్లు నిజాలను పూర్తిగా చూడకూడదు. అందుకే అవి పూర్తిగా తెరుచుకొనే లోపల వాటికి ఒక పొర కప్పాలి – ఆఫ్‌ కోర్స్‌ కొద్దిరోజులైనా కొద్ది మంది కైనా – ఆ కప్పే టందుకు వచ్చిన సస్కరణ వాధ మే ఇది. ఆ సంగతి వాళ్లకు తెలీయదంటారా? భూధానోధ్యం తెచ్చిన వినోభా బావే లాగ!

వ్యాఖ్యానించండి