కె.బ్రహ్మం: జి.డి.పి, గ్లోబలైజేషన్ అంటే ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం, వృద్ధిల విషయంలో అమెరికా, ఐరోపాలు ప్రత్యేకంగా ఎందుకు ఉన్నాయి?
సమాధానం: బ్రహ్మం గారు ప్రశ్న వేసి దాదాపు రెండు వారాల పైనే అయింది. ఇంకా ఐదారుగురు మిత్రులకు నేను సమాధానం బాకీ ఉన్నాను. ఆలస్యానికి విచారిస్తున్నాను. బ్రహ్మం గారి ప్రశ్నకు మొదట సమాధానం ఇస్తున్నాను.
జి.డి.పి: Gross Domestic Product అనే పదబంధానికి జి.డి.పి పొట్టిరూపం. తెలుగులో స్ధూల జాతీయోత్పత్తి అని అంటారు. స్ధూల దేశీయోత్పత్తి అన్నా జి.డి.పి అనే వాడుకలో ఉన్నది. నిజానికి జి.డి.పి ని స్ధూల దేశీయోత్పత్తి గానూ, జి.ఎన్.పి (Gross National Product) ని స్ధూల జాతీయోత్పత్తి గానూ చెప్పడమే సరైనది అనుకుంటాను. కానీ జి.ఎన్.పి అనేది వాడుకలో లేకపోవడం వలన తెలుగు పదబంధాలు రెండూ జి.డి.పి కి అర్ధాలుగా వాడుకలో ఉన్నాయి.
ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల, ఒక నిర్దిష్ట కాలంలో జరిగే ఉత్పత్తుల మొత్తాన్ని జి.డి.పి అంటారు. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలు ఏర్పడి కంటికి కనపడే ప్రతి వస్తువునూ సరుకుగా మార్చే పని తీవ్రం అయ్యాక ప్రతి వస్తువునూ మారకపు విలువ లెక్కల్లో గణించడం మామూలు విషయం అయిపోయింది. కాబట్టి ఒక సంవత్సర కాలంలో, ఒక దేశపు భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయ్యే మారకపు విలువల మొత్తాన్ని ఆ దేశ వార్ధిక జి.డి.పి గా చెబుతున్నాం.
మారకపు విలువలు ప్రధానంగా రెండింటికి ఉంటాయి. ఒకటి సరుకులు, రెండు సేవలు. సరుకు అంటే ఒక భౌతిక వినియోగ వస్తువు. కొన్ని భౌతిక వస్తువులపై మనిషి శ్రమ చేస్తే మరొక భౌతిక వస్తువు తయారయితే గనక దానికి మారకపు విలువ వచ్చి చేరుతుంది. ఆ విలువను కరెన్సీల్లో లెక్కించే విషయం తెలిసిందే.
సేవ అంటే భౌతిక వస్తువు అంటూ ఏమీ ఉండదు. కానీ శ్రమ జరుగుతుంది. ఆ శ్రమ ద్వారా కొందరు వినియోగదారులు సౌఖ్యం పొందుతారు. ఉదాహరణకి హోటళ్ళలో సర్వింగ్; బ్యాంకు, ఇన్సూరెన్స్ తదితర కంపెనీల్లోనూ, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఉద్యోగుల చేసే శ్రమలు; ప్రాసెసింగ్ శ్రమలు మొదలయినవన్నీ సేవల కిందికి వస్తాయి. సేవలను కూడా కరెన్సీలలో లెక్కిస్తారు కనుక అవి కూడా ఉత్పత్తే. వాటికి పరిమాణం ఉంటుంది.
దేశ భౌగోళిక సరిహద్దుల లోపల జరిగిన ఉత్పత్తికి యజమానులు ఎవరు అన్నదానితో సంబంధం లేకుండా జి.డి.పి ని లెక్కిస్తారు. సంస్కరణల పేరుతో నూతన ఆర్ధిక విధానాల అమలు మొదలయ్యాక దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ), విదేశీ సంస్ధాగత పెట్టుబడులు (ఎఫ్.ఐ.ఐ) వచ్చి పడుతున్నాయి. వీటికి సొంతదారులు భారతీయులు కాదు. అయినప్పటికీ వారి పెట్టుబడుల ద్వారా జరిగే సరుకులు, సేవల ఉత్పత్తిని కూడా భారత జి.డి.పి గానే లెక్కిస్తారు. ఆ ఉత్పత్తి మొత్తాన్ని భారతీయులు అనుభవించకపోయినా అది ఇండియా జి.డి.పియే. కాబట్టి జి.డి.పి వృద్ధి చెందితే అది దేశాభివృద్ధిగానే భావించనవసరం లేదు.
జి.డి.పిని మూడు పద్ధతుల్లో లెక్కిస్తారు.
1. ఉత్పత్తుల మొత్తం: పైన చెప్పుకున్నట్లు సరుకులు, సేవల ఉత్పత్తుల మారకం విలువల మొత్తం జి.డి.పిగా లెక్కించడం ఒక పద్ధతి. ఇది ఉత్పత్తిని నేరుగా లెక్కించే పద్ధతి. కాబట్టి వివరణ అనవసరం.
2. ఖర్చుల మొత్తం: ప్రతి ఉత్పత్తిని ఎవరో ఒకరు కొనవలసి ఉంటుంది. అనగా మారకం జరగాల్సి ఉంటుంది. మారకం జరిగితేనే ఒక వస్తువు సరుకుగా లెక్కించబడుతుంది. కాబట్టి ప్రతి ఉత్పత్తి అది ఏ దశలో ఉన్నప్పటికీ దానికి విలువ కట్టగల దశను పూర్తి చేసుకుంటే అది మారకంలోకి వస్తుంది.
ఉదాహరణకి అడవిలో టేకు చెట్టు ఉంది. అది అడవిలో ఉన్నంతవరకూ ఉత్పత్తి కాదు. కానీ కొందరు మనుషులు పూనుకుని గొడ్డలితోనో, రంపం తోనో, విద్యుత్ రంపం తోనో నరికి లేదా కోసి కలప మార్కెట్ కి తెస్తే దానికి కొంత విలువ వస్తుంది. కోతల శ్రమవాళ్లు సదరు కలప మానును మార్కెట్ లో అమ్మి ఆ విలువను సొమ్ము చేసుకుంటారు. ఆ విలువ జి.డి.పిలోకి వస్తుంది.
ఆ తర్వాత వడ్రంగి (వ్యక్తి గానీ, కంపెనీ గానీ) ఆ మానును ముక్కలు ముక్కలు కోసి చిత్రిక పట్టి చెక్కల కిందికి మార్చుతారు. ఆ విధంగా వడ్రంగి శ్రమ ద్వారా కలప కాస్తా చెక్కలు అనే సరుకు అవుతుంది. వడ్రంగి శ్రమదారులు ఆ విలువను పొందుతారు. వడ్రంగి ఉత్పత్తి జి.డి.పిలో కలుస్తుంది.
ఆ తర్వాత ఒక ఇంటి యజమాని కొందరు కూలీలను కుదుర్చుకుని కిటికీలు, బల్లలు, ద్వారబంధాలు, కుర్చీలు తదితర సామానుగా మార్చుతాడు. అందుకు కూలీలకు సొమ్ము చెల్లిస్తాడు. అనగా చెక్క ముక్కలు కాస్తా నిర్మాణ + వడ్రంగి శ్రమల ద్వారా ఇంటిని అలంకరించాయి. ఈ నిర్మాణ, వడ్రంగి శ్రమల్లో జరిగిన ఉత్పత్తి కూడా జి.డి.పిలో కలుస్తుంది.
ఇక్కడ ఉత్పత్తి జరిగిన ప్రతి చోటా ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు ఉన్నారు. ప్రతి ఉత్పత్తి కొనుగోలు చేయబడింది. ఒకరు అమ్మితే మరొకరు డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కున్నారు. కాబట్టి మారకం విలువ పొందిన ప్రతి ఉత్పత్తిని ఖర్చుగా కూడా చూడవచ్చు. ఖర్చయ్యే లక్షణం ఉంటేనే ఒక వస్తువు సరుకు అవుతుంది.
ఆ విధంగా ఒక దేశ సరిహద్దుల లోపల జరిగిన సరుకులు, సేవల కొనుగోళ్ల మొత్తమే జి.డి.పి. పెట్టుబడులు కూడా ఖర్చుల కిందికి వస్తాయి. కాబట్టి ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు కూడా ఖర్చుల జి.డి.పి లెక్కలోకి వస్తాయి. దిగుమతులు ఇక్కడ ఉత్పత్తి అయినవి కావు. కావున వాటిని ఖర్చుల లెక్కలోంచి తీసేయాలి. ఎగుమతులు ఇక్కడ ఉత్పత్తి అయినవే కావున అవి ఖర్చుల జి.డి.పిలో కలుస్తాయి. అంతిమంగా ఖర్చుల దృక్కోణంలో:
జి.డి.పి = ప్రైవేటు వినియోగం (వ్యక్తులు + కంపెనీలు చేసిన ఖర్చు) + ప్రభుత్వ ఖర్చు + పెట్టుబడులు + ఎగుమతులు – దిగుమతులు
3. ఆదాయాల మొత్తం: ఉత్పత్తిదారుల ఆదాయాల మొత్తం వారు ఉత్పత్తి చేసిన సరుకులు, సేవల విలువకు సమానంగా ఉంటుంది (ఉండాలి). కాబట్టి ఒక దేశ సరిహద్దుల లోపల ఉన్న వ్యక్తులు, సంస్ధల సమస్త ఆదాయాల మొత్తాన్ని జి.డి.పి గా పేర్కొనవచ్చు.
భూమిలో దాగిన బొగ్గు, ఖనిజాలకు కూడా ఈ లెక్కల వివరణ వర్తిస్తుంది.
ఇక్కడ వివరించిన మూడు లెక్కల్లోనూ ఒకే విలువ రావాలి. అలా వస్తేనే ఆ లెక్కలు సరిగ్గా వేసినట్లు అర్ధం. లేకపోతే ఎక్కడో పొరబాటు జరిగినట్లే.
ప్రశ్నలో మిగిలిన భాగాన్ని మరో ఆర్టికల్ లో వివరిస్తాను.

Mari agriculture ni nduku consider cheyaru GDP lo ….