సంచలనం: అమెరికా సముద్ర జలాల్లో చైనా గూఢచార నౌక


Chinese Spy Ship Uranus 853

హవాయ్ ద్వీపకల్పానికి సమీపంలో తన గూఢచార నౌకను ప్రవేశ పెట్టి చైనా సంచలనానికి తెర తీసింది. తూర్పు చైనా సముద్ర జలాల్లో దశాబ్దాల తరబడి అమెరికా సాగించిన చొరబాటు చర్యలకు ప్రతీకారంగా చైనా చర్యను అంచనా వేయవచ్చు. గోల్డ్ సీ డాట్ కామ్ వెబ్ సైట్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్తను పశ్చిమ కార్పొరేట్ పత్రికలు పెద్దగా పట్టించుకోనట్లు నటిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం మాత్రం మింగలేక అలాగని కక్కనూ లేక మౌనం పాటిస్తోంది.

ఫోర్బ్స్, ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలు గతంలో ఈ అంశాన్ని రిపోర్ట్ చేసినప్పటికీ అవి చైనా అధికారుల ప్రకటనలను మాత్రమే ఉటంకించాయి తప్ప వాస్తవంగా చైనా గూఢచార నౌకలు అమెరికా జలాల్లో విహరించిందీ లేనిది చెప్పలేదు.

అమెరికా సముద్ర జలాలు అంటే అచ్చంగా అమెరికా తీర జలాల్లో అని కాదు. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం సముద్ర తీరం కలిగి ఉన్న ప్రతి దేశానికి తమ తీరానికి 200 నాటికల్ మైళ్ళ లోపల తమకు మాత్రమే పరిమితమైన ఆర్ధిక హక్కులు ఉంటాయి. ఇలా 200 నాటికల్ మైళ్ళ లోపలి ప్రాంతాన్ని ఆయా దేశాలకు చెందిన ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఇ.ఇ.జెడ్) గా పిలుస్తారు. ఈ జలాల్లో ఇతర దేశాల నౌకలు తిరగవచ్చు. కానీ అవి అక్కడి చేపలను గానీ సముద్ర గర్భం అడుగున ఉండే ఖనిజ వనరులను గానీ వినియోగించకూడదు. అవి ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ హక్కులు కలిగి ఉన్న దేశాలకు మాత్రమే చెందుతాయి.

గోల్డ్ సీ వెబ్ సైట్ ప్రకారం 4000 టన్నుల బరువు కల ఎలక్ట్రానిక్ గూఢచార నౌక హవాయ్ ద్వీపకల్పానికి సమీపంలో కనిపించింది. చైనా ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ’ (PLAN) కి చెందిన ఈ నౌకలో రేడియో కమ్యూనికేషన్స్ నూ, ఇతర ఓడల జాడలను పసికట్టగల ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. రేడియో కమ్యూనికేషన్స్ ను జామ్ చేయగల పరికరాలు కూడా ఉన్నాయి. 1982 నాటి ఐరాస సముద్ర జలాల చట్టం నిర్దేశించిన 12 నాటికల్ మైళ్ళ (13.8 మైళ్ళు) లోపలి అమెరికా జలాలలోకి మాత్రం చైనా నౌక ప్రవేశించలేదని గోల్డ్ సీ తెలిపింది. ఐరాస సముద్ర జలాల చట్టాన్ని అమెరికా ఆమోదించలేదు. (సంతకం చేయలేదు) కానీ ఆ చట్టాన్ని పాటిస్తున్నట్లు చెబుతుంది. (సంతకం చేస్తే ప్రపంచ వ్యాపితంగా అమెరికా నెలకొల్పిన మిలట్రీ స్ధావరాలలో అనేకం చట్ట విరుద్ధం అవుతాయి.)

అమెరికాకు సమీపంలోని పసిఫిక్ జలాల్లో తమ గూఢచార నౌకను ప్రవేశపెట్టడం ద్వారా అమెరికాకూ, ఇతర ప్రపంచ దేశాలకూ తన ఉద్దేశ్యాన్ని చైనా చాటి చెప్పినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ పసిఫిక్ సముద్రం ఇక ఎంతమాత్రం అమెరికా జాగీరు కాదని, సదరు జలాల్లోకి ప్రవేశించి గూఢచర్యం చేయగల శక్తి తనకు కూడా ఉన్నదని చైనా చాటింది. దక్షిణ కొరియా, జపాన్ నౌకా బలగాలతో కలిసి ఇటీవల యెల్లో సీ లో అమెరికా నిర్వహించిన మిలట్రీ విన్యాసాలకు చైనా ప్రతీకారం తీసుకుంటోందని గోల్డ్ సీ వ్యాఖ్యానించింది. పశ్చిమ పసిఫిక్ సముద్రంలో స్వేచ్ఛగా తన నౌకలను మోహరించే సౌకర్యం ఇక అమెరికాకు లేదనీ, అదిప్పుడు (పశ్చిమ పసిఫిక్) చెస్ బోర్డ్ గా మారిపోయిందని గోల్డ్ సీ తెలిపింది.

హవాయి ద్వీపకల్పం అమెరికాకు ధర్డ్ ఐలాండ్ చైన్ అవుతుందని, అలాస్కా ఆలూటియన్ ద్వీపకల్పం నుండి ఆస్ట్రేలియా వరకూ ఇది విస్తరించి ఉందని దీనిని అమెరికా యొక్క ఆసియా-పసిఫిక్ మిలట్రీ బలగాలకు వ్యూహాత్మక వెనుక భాగంగా పరిగణిస్తారని తెలుస్తోంది. శాన్ ఫ్రాన్ సిస్కోకు 2400 మైళ్ళ దూరంలో ఉండే ఈ ఏరియా వరకూ చైనా నౌకలు వచ్చాయంటే అమెరికాపై మిలట్రీ దాడి చేయగల శక్తిని చైనా సంతరించుకున్నట్లే అని గోల్డ్ సీ తెలిపింది.

చైనా తాజా చర్య తన మిలట్రీ శక్తి పట్ల ఆ దేశానికి పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తోంది. ఎన్నడూ లేని విధంగా చైనా ఇటీవల అణు జలాంతర్గాముల ఫ్లీట్ ను బహిర్గత పరచడం కూడా ఈ నమ్మకంలో భాగంగా చూడవచ్చు. గ్జియా-క్లాస్ జలాంతర్గాములుగా పరిగణించే ఈ ఫ్లీట్ ఇప్పటివరకూ చైనా రహస్యంగా ఉంచింది. (గ్జియా క్లాస్ సబ్ మెరైన్ ఫ్లీట్ విన్యాసాలను కింద వీడియోలో చూడవచ్చు. వీడియోను చైనా ప్రభుత్వమే బహిర్గతం చేసింది.)

తూర్పు చైనా సముద్రంలోని దియోయు ద్వీపకల్పం (జపాన్ దీనిని సెంకాకు అని పిలుస్తుంది) చైనాకు ఫస్ట్ ఐలాండ్ చైన్ అవుతుంది. అంటే చైనా ప్రధాన భూభాగానికి బాగా దగ్గరగా ఉన్న ద్వీపకల్పం అని అర్ధం. అలాంటి చోట్లనే అమెరికా నౌకలు అనేకసార్లు దూకుడుగా చొచ్చుకు వచ్చాయి. తద్వారా చైనాకు పదే పదే మిలట్రీ బెదిరింపు జారీ చేశాయి. ఈ బెదిరింపులకు చైనా ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటోంది.

గత సెప్టెంబర్ లో సిరియాపై దాడికి అమెరికా సిద్ధపడిన నేపధ్యంలో సిరియా తీరానికి కూడా చైనా తన యుద్ధ నౌకలను పంపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా, రష్యా నౌకల చర్యలను గమనించడానికే తమ నౌకలు సిరియా తీరానికి వచ్చాయి తప్ప మరోకందుకు కాదని అప్పట్లో చైనా ప్రకటించింది. కానీ అది కూడా చైనా వైపు నుండి మెల్లగానే అయినా స్ధిరంగా పెరుగుతున్న దూకుడుకు నిదర్శనమే.

One thought on “సంచలనం: అమెరికా సముద్ర జలాల్లో చైనా గూఢచార నౌక

  1. హనుమంతుడి ముందు కుప్పిగంతులు , చైనా ముందు అమెరికా అభినయం. ప్రపంచంలో అమెరికా పక్కలో బల్లెం చైనాయితే, చైనా చంకలో పిల్ల అమెరికా. ఇటీవల కాలంలో అమెరికా చైనా పేరు చెబితే చాలు కుడితిలో ఎలుకలా గిలగిలలాడుతోంది. ప్రపంచ ఆధిపత్యం కోసం పోరుసలిపే అమెరికా చైన సవతి పోరు ప్రాణాంతకంగా పరిణమించింది. అప్పుల వంకతో సుద్దపప్పులను చేసే దేశాల మెడ మీద కత్తి పెడితే, చైనా మాత్రం అప్పనా తనా మనా ఆడించే అమెరికాను కనుసన్నులలో నిలుపుకునే వత్తిడిని తీసుకువచ్చేసరికి ఒబామాకు రాజకీయ ఓర్పులో మార్పు కోసం తహతహతో సతమతమవుతున్నాడు.

వ్యాఖ్యానించండి