మిన్ను మన్ను ఏకం చేసే పెను తుఫాను ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసి పోయాక భారత దేశంలో పరిస్ధితి ఎలా ఉంటుంది? ప్రభుత్వం నుండి సాయం అందే దారి లేక జనం ఎప్పటిలాగా కష్టాలను ఈదడం ప్రారంభిస్తారు. వారికి తుఫాను తర్వాత ఏ పరిస్ధితి ఉంటుందో దానికి ముందు కూడా దాదాపు అదే పరిస్ధితి కనుక ఒక ఎదురు దెబ్బ తగిలిందని సమాధానం చెప్పుకుని జీవన పయనంలో సాగిపోతారు. వారి నష్టాన్ని రెండింతలు చేసి చెప్పుకునే పాలక దళారీలు మాత్రం కోట్ల రూపాయలు భోంచేసి మరో తుఫాను కోసం ఎదురు చూస్తుంటారు. జనానికి చాలా మందికి తెలియదు గానీ, భారత దేశంలో ప్రకృతి విలయాలు దళారీ వర్గాల ఆస్తులు పెంచుకునేందుకు ఆయాచితంగా అంది వచ్చే వరాలు.
గత సంవత్సరం ఇదే నెలలో ఇదే రోజున (అక్టోబర్ 29, 2012) సంభవించిన పెను తుఫాను శాండి అమెరికా తూర్పు తీరాన్ని గజ గజ వణికించింది. సాండీ సృష్టించిన పెను గాలులు, న్యూయార్క్ నగరానికి కేంద్రం అనదగ్గ మన్ హట్టన్ ని సైతం వదలకుండా చెట్లను, టవర్లను కూల్చివేసింది. 108 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా అతి పురాతన న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీ రెండు రోజుల పాటు మూతపడింది. ఏడు రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు, పెను గాలుల ధాటికి 286 మంది చనిపోయారు.
ముఖ్యంగా న్యూయార్క్, న్యూ జెర్సీ రాష్ట్రాలలో కాలనీలకు కాలనీలే వరదల్లో కొట్టుకుపోయాయి. విద్యుత్ షార్ట్ సర్కూట్ ప్రమాదాలు జరిగి కొన్ని కాలనీలు పూర్తిగా తగలబడిపోయాయి. గంటకు 130-150 మైళ్ళ వేగంతో వీచిన గాలుల వల్ల 80 లక్షల ఇళ్ళు వారాల తరబడి విద్యుత్ సౌకర్యం కోల్పోయాయి. ప్రజల ఆస్తులే 25 బిలియన్ డాలర్ల వరకూ తుడిచిపెట్టుకుపోగా వ్యాపారాలు 40 బిలియన్ డాలర్ల వరకూ నష్టపోయాయి. ఆనాటి సాండీ విలయాన్ని ఈ బ్లాగ్ లోనే అక్టోబర్ 31, 2012 తేదీన ప్రచురించబడిన ఫోటోల్లో ఇక్కడ చూడవచ్చు.
సంవత్సరం గడిచిపోయింది. కానీ శాండిలో నష్టపోయినవారిలో అనేకమంది సాయం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. సాయం అందనివారు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా పట్టించుకునేవారు లేరు. పలుకుబడి కలిగినవారు బీచ్ ఒడ్డున సరికొత్త ఇళ్ళు కట్టించుకోగా, మెజారిటీ ప్రజలు రోజులు గడవడానికి కూడా కష్ట పడుతూ పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎన్.జి.ఓ సంస్ధలు పూనుకుని చందాలు వసూలు చేసి వాటిని పునరావాస శిబిరాల్లో ఆహారం, దుస్తులు, షెల్టర్ల కోసం ఖర్చు పెడుతున్నారు.
స్ధానిక ప్రభుత్వాలు కొన్ని, తుఫాను ధాటికి తుడుచుకు పెట్టుకుపోయిన కాలనీలను ప్రకృతికి తిరిగి ఇచ్చేద్దామని ప్రతిపాదిస్తున్నారు. ఉదాహరణకి న్యూయార్క్ లోని స్టాటెన్ ఐ లాండ్ కి చెందిన ఓక్ వుడ్ బీచ్ సెక్షన్ లో మళ్ళీ నిర్మాణాలు జరపకుండా ఉండడానికి ‘బై బ్యాక్’ పధకం ప్రకటించారు. న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ కౌమో ఈ మేరకు 400 మిలియన్ డాలర్ల మేర నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మొత్తంలో ధనిక వర్గాల కోసం కేటాయించారని భారీగా నష్టపోయిన మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు కాణీ విదల్చడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల పునర్నిర్మాణం పూర్తి కాగా ఇతర చోట్ల ఈ మాత్రం పట్టించుకునేవారు లేక ఇప్పటికీ తాత్కాలిక పునరావాస శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు.
హరికేన్ శాండి ధాటికి దెబ్బతిన్న ఇళ్ళు, కాలనీలు సాయం కోసం ఎదురుచూస్తున్న ఫోటోలు, ప్రభుత్వం తమను పట్టించుకోవాలని నిరసన తెలియజేస్తున్న ఫోటోలు, ఒకప్పుడు ఇళ్ళు కలిగి ఉండి తుఫాను లో తుడుచుకు పోయిన తమ రియల్ ప్రాపర్టీలో నిలబడ్డ జంటలు, పుంర్నిర్మాణానికి నోచుకొన్న చోట్ల తుఫానుకు ముందు-తర్వాత తీసిన ఫోటోలు కింద చూడవచ్చు. ఈ ఫోటోలను బోస్టన్ గ్లోబ్, హఫింగ్టన్ పోస్ట్ తదితర పత్రికలు అందించాయి.



























