ఆర్.బి.ఐ అధినేత మారినా కూడా రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నూతన గవర్నర్ గా రఘురాం రాజన్ నియామకాన్ని చప్పట్లతో ఆహ్వానించిన కార్పొరేట్, పరిశ్రమల వర్గాలు ఆయన వరుస పెట్టి తీసుకుంటున్న చర్యలతో మింగలేక, కక్కలేక గొణుగుడుతో సరిపెట్టుకుంటున్నారు. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక వడ్డీ రేటు (రెపో రేటు) ను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఏమి అనలేక నిశ్శబ్దమే స్పందనగా మిగిలిపోయారు. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఛైర్మన్ డా. సి.రంగరాజన్ మాత్రం ఆర్.బి.ఐ గవర్నర్ అంచనాలతో బహిరంగంగానే విభేదించారు.
త్రైమాసిక మధ్యంతర ద్రవ్య సమీక్షా విధానాన్ని ఆర్.బి.ఐ మంగళవారం ప్రకటించింది. ద్రవ్యోల్బణం వెంటాడుతున్నందున రెపో రేటు ను 7.5% నుండి 7.75% కి పెంచుతున్నట్లు సమీక్షలో పేర్కొంది. అయితే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు (ఎం.ఎస్.ఎఫ్) ను 9% నుండి 8.75 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. తద్వారా బ్యాంకులు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. ఆర్ధిక వృద్ధి బలహీనపడిన నేపధ్యంలో ద్రవ్యోల్బణ ఒత్తిడులను అధిగమించడానికి, ద్రవ్యోల్బణ అంచనాలను (పరిమిత స్ధాయిలో) నిర్వహించడానికి సమీక్షా చర్యలు తీసుకున్నామని తెలిపింది.
“ఈ చర్యలు స్ధూల ఆర్ధిక మరియు ద్రవ్య స్ధిరత్వాన్ని నెలకొల్పి తద్వారా వృద్ధికి తగిన వాతావరణం ఏర్పడడానికి దోహదపడతాయి. భవిష్యత్తులో ఉత్పన్నం అయ్యే ఆర్ధిక వృద్ధి స్ధితిగతులను ఆర్.బి.ఐ గమనంలో ఉంచుకుంటూనే ద్రవ్యోల్బణం ప్రమాదాలను ఒక కంట కనిపెడుతూ ఉంటుంది” అని ద్రవ్య సమీక్ష ప్రకటిస్తూ ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు.
2013-14 ఆర్ధిక సంవత్సరానికి గాను జి.డి.పి వృద్ధి రేటు గురించి తాను గతంలో వేసిన అంచనాను కూడా ఆర్.బి.ఐ తగ్గించుకుంది. జులై సమీక్షలో 5.5 శాతంగా వృద్ధి రేటును పేర్కొన్న ఆర్.బి.ఐ ఇప్పుడు దానిని 5 శాతానికి తగ్గించుకుంది. ఆర్.బి.ఐ నియమించిన వృత్తిగత ఆర్ధిక అంచనా నిపుణులు భారత ఆర్ధిక వృద్ధి రేటు ఈ యేడు 4.8 శాతం ఉంటుందని నిర్ధారించారు. ఒక రోజు తర్వాత ఆర్.బి.ఐ దానిని స్వల్పంగా సవరించి 5 శాతం ఉంటుందని సమీక్షలో పేర్కొంది.
నాలుగు రోజుల క్రితం ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఛైర్మన్ కూడా ఈ యేడు ఇండియా వృద్ధి రేటు 5 శాతం ఉంటుందని చెప్పడం గమనార్హం. 5 నుండి 5.5 శాతం మధ్య ఉంటుందని చెబుతూనే గత సంవత్సరం నమోదు చేసిన వృద్ధినే ఈ యేడూ నమోదవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు మాత్రం ఆయన వృద్ధి రేటు 5.3% ఉంటుందని తాము అంచనా వేశామని తెలిపారు.
రంగరాజన్ విభేదం
ధరలు లేదా ద్రవ్యోల్బణంకు సంబంధించి ఆర్.బి.ఐ సమీక్ష పేర్కొన్న అంచనాతో ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ డా. సి.రంగరాజన్ విభేదించారు. ఆర్.బి.ఐ అంచనా వేసినంత అధిక స్ధాయిలో టోకు ధరల సూచీ (WPI) మరియు వినియోగ ధరల సూచీ (CPI) ఉండవని ఆయన పేర్కొన్నారు. “ఆర్.బి.ఐ సూచిస్తున్నంత ఎక్కువగా ద్రవ్యోల్బణం రేటు ఉండకపోవచ్చు. టోకు ధరల సూచీ (Wholesale Price Index) కి సంబంధించినంతవరకు అది దాదాపు 5.5% నుండి 6 శాతం వరకు ఉండొచ్చు. వినియోగధరల సూచీ (Consumer Price Index) కూడా ఆర్.బి.ఐ ఊహించినంత ఉండకపోవచ్చు” అని రంగరాజన్ అన్నారని ది హిందు తెలిపింది.
వినియోగధరల సూచీ ఆధారంగా నిర్ణయించే ద్రవ్యోల్బణం రానున్న నెలల్లో 9 శాతం గానీ అంతకంటే ఎక్కువగానీ ఉండవచ్చని ఆర్.బి.ఐ తాజా సమీక్ష పేర్కొంది. ఈ సంవత్సరం అంతా వినియోగ ధరల/చిల్లర ధరల ద్రవ్యోల్బణం ఇదే విధంగా ఉంటుందని సమీక్ష పేర్కొంది. ఆహార ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ మొత్తంగా చూస్తే చిల్లర ద్రవ్యోల్బణం అధికంగానే కొనసాగుతుందని అంచనా వేసింది. ఈ అంచనాతో రంగరాజన్ విభేశిస్తున్నారు. ఆయన అంచనాలో వ్యవసాయ దిగుబడి అందుబాటులోకి వచ్చి తద్వారా ద్రవ్యోల్బణం కూడా దిగి వస్తుంది. వ్యవసాయ దిగుబడులు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇతర (విదేశీ) కారణాల వలన ద్రవ్యోల్బణం తగ్గబోదన్నది ఆర్.బి.ఐ అంచనా.
టోకు ధరల సూచీ ఆధారంగా నిర్ణయించే ద్రవ్యోల్బణం సెప్టెంబర్ చివరికి 6.46 శాతంగా నమోదయింది. అదే నెలలో చిల్లర ధరల ద్రవ్యోల్బణం 9.84 శాతంగా నమోదయింది. ఆహార ద్రవ్యోల్బణం అదే నెలలో భారీగా 18.4 శాతం వద్ద ఉన్నది. కాబట్టి ఆహార ద్రవ్యోల్బణం ఎంత తగ్గితే సాధారణ ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపాలి?
ద్రవ్యోల్బణం అంచనా విషయంలో ఆర్.బి.ఐ తో విభేదించినప్పటికీ ద్రవ్యోల్బణం ఆధారంగా ద్రవ్య సమీక్షలో చర్యలు తీసుకోవడాన్ని మాత్రం రంగరాజన్ సమర్ధించారు. “ఆర్.బి.ఐ సమీక్షలో ప్రధాన అంశం ధరల నిలకడ. కాబట్టి ద్రవ్యోల్బణం స్వభావాన్ని బట్టే సమీక్ష చర్యలు ఉంటాయి. ద్రవ్యోల్బణం ఇప్పటికంటే ఇంకా పెరిగితే మళ్ళీ రెపో రేటు పెంచక తప్పదు. కానీ ఆ విషయం ఇప్పుడే ఊహించలేము. వచ్చే ఆరు వారాల్లో ద్రవ్యోల్బణం కదలికలను పరిశీలించాల్సి ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.
ఆర్ధిక వృద్ధి రేటుకు సంబంధించి ఆర్.బి.ఐ అంచనా, ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల అంచనాతో సరిపోలడం గమనార్హం. విదేశీ రంగంలో అనుకోని పరిణామాలు సంభవిస్తే భారత ఆర్ధిక వ్యవస్ధపై ప్రతికూల ప్రభావం తధ్యం అనీ, కాబట్టి అందుకు సిద్ధంగా ఉండాలని ఆర్.బి.ఐ తన సమీక్షలో హెచ్చరించింది. “కరెన్సీ మారకం విలువ ఇటీవల స్ధిరపడినప్పటికీ, విదేశీ రంగంలో వాతావరణం ఇంకా పెళుసుగానే కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ఉదాసీనతకు తావు లేదు. ద్రవ్యోల్బణం ప్రమాదం వలన కోశాగారం (వసూళ్లు) పరంగా నెలకొన్న జారుడు అవకాశాలు నూతన సవాళ్ళు విసురుతున్నాయి” అని ఆర్.బి.ఐ పేర్కొంది.
ఆర్.బి.ఐ హెచ్చరిక అమెరికా సెంట్రల్ బ్యాంక్ (ఫెడరల్ రిజర్వ్) ద్రవ్య పరపతి విధానాన్ని ఉద్దేశించినది. ఫెడరల్ రిజర్వ్ ప్రతి నెలా 85 బిలియన్ డాలర్ల మేరకు ట్రెజరీ బాండ్లు, గృహ రుణాలపై ఆధారపడిన డెరివేటివ్ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలోకి పంపింగ్ చేస్తోంది. దీనిని పాక్షికంగానైనా ఉపసంహరించుకున్నట్లయితే ఇతర వర్ధమాన దేశాలతో పాటు భారత ఆర్ధిక వ్యవస్ధ సైతం తీవ్ర ఒడిదుడుకులకు లోను కావడం తధ్యం. ఆర్.బి.ఐ చెప్పేదీ అదే.
రాజకీయాలు గడ్డికరిస్తే వడ్డీ రేటు సామాన్యుడి నడ్డి విరగొట్టడం ఆ.ర్బి.ఐ. కి కొత్తేమి కాదు. ఆదాయంశాఖ పన్ను పోటు సామాన్య ఉద్యోగి నోటిలో జ్ఞానదంతంగా భావిస్తుంది. నల్ల డబ్బు మదుపరులు మాత్రం ఆదాయంశాఖకు వడ్డించిన విస్తరి. గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదన్నట్లు ప్రభుత్వ పాలన ఎలావున్నా పార్టీ నిధులు తప్పవు. పైగా అది సరిపోక గుప్తనిధుల తవ్వకాలు. రహస్య మాళిగల అజ్ఞానం అర్ధవంతమైతే ఆదాయంశాఖ విజ్ఞానం ఇంకెన్ని వెర్రితలలు వేస్తుందో ? ఆర్.బి.ఐ. రేపో రేటు రేపో మాపో గణనీయంగా చర్చకు వస్తుంది.