విభజన ‘గీత’ -మరిన్ని శ్లోకాలు


రచన: తెరేష్ బాబు పైడి (పైడిశ్రీ)

“బల్బో బస్సాహి సమ్మ్యామ్యహం
దీక్షో భగ్నాయ వినిర్గతీ!!!”

అపార్థా…!

ఆరే ప్రతి బల్బు వెలగక తప్పదు
ఆగే ప్రతి బస్సు కదలక తప్పదు
జరిపే ప్రతి సమ్మె ఆపక తప్పదు
చేసే ప్రతి దీక్ష భగ్నం కాక తప్పదు
ఇవన్నియు ఢిల్లీ వలననే సంభవించుచున్నవి

టీ టిటిటి ట్యూం టుయ్ [ఇది వీణా నాదము]

***                ***                ***

కోతోహి చింపాంజీ నక్కస్య గోతో! మంత్రామ్యహి ముఖ్యోతి!
జీవస్య ఎంజీవం ద్రోహోర్మహి!బిల్లేచ పాసేణ ఢిల్లీ చిల్లీశ్యతి!!

అపార్థా…!

కోతుల యందు చింపాంజీ, నక్కల యందు గోతికాడ నక్క, నాయకుల యందు ఎన్జీవో నాయకుడు, మంత్రులలో ముఖ్యమంత్రి, ద్రోహుల యందు తెలంగాణ వ్యతిరేకి ఉత్తములుగా కీర్తింపబడుదురు. అట్టివారిని జూచి నీవు చింతింపవలదు. బిల్లు వచ్చుట ఖాయము. పాసగుట తధ్యము. లేని ఎడల ఢిల్లీ ఛిల్లీ యగుట నిక్కము.

పిపిపిపిపీ ఫ్యూం [ఇది వేణు నాదము]

***                ***                ***

చంచలో గూడస్య చర్లపల్లిహి! గుణపాఠో నేర్పిష్యతి!
ఏకాంగ్రేసోపి ఎదిరిష్యతి ! చార్గిషీటో శరణం దుర్గతి!!

అపార్థా…!

కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన వారికి ఎట్టి దుర్గతి సంభవించునో చంచల్ గూడ చర్లపల్లాది జైళ్ళు వివరించుచున్నవి. అధిష్ఠానమును ధిక్కరించి రాజీనామాలు చేసినవారికి చార్జిషీట్లు తప్పవని సీబియయ్యాది సంస్థలు నిరూపించుచున్నవి.

నాకుట, పీకుట, శవాలపై చిల్లర ఏరుకొనుట తప్ప ఇతరములెరుగని కీలుబొమ్మలు రాజీనామాలు చేయుట, స్పీకర్ని కలియుట వంటివి ఒఠ్ఠి బోగస్ విషయములుగా నీవు గుర్తింప వలయును. మీడియా ముందు వారు వేయు కుప్పిగంతులను నీ వినోదార్థము ప్రదర్శించు నాటకములు గా భావించి సంతసింపుము.

భొయ్ భొయ్ భొయ్ భోయ్ య్ య్ య్ [ఇది తీర్థపు తడి ఎరుగని సమైక్య శంఖారావం]

***                ***                ***

జేబోహి నతి ఔరంగ జేబస్య!బాబోహి కబాబహం!
సమ్యోహయతి సకలజనహ! మిమిక్రీణాం కరామ్యహం!!

అపార్థా…!

జేబులున్న  ప్రతివారూ ఔరంగ జేబు కాజాలరు. బాబులగు ప్రతివారూ కబాబు కాలేరు [పొరపాట్న అశోకబాబు అనుకునేరు] సమ్మెలెన్ని జేసిననూ సకలజనుల సమ్మెకు సాటిరావు. పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్కలు చిట్టచివరకు వాడవలసినది జాలిం లోషన్, జిందా తిలిస్మాత్ మరియూ జులాబ్ గోలీలు. ఇది తెర వెనుక దాగిన ఉ’పని’శక్తుల సారాంశము.

ఎంపీపీ డుం డుం డుం ఎంపీ పీ పీ డుం [ఇవి అమంగళ వాద్య విశేషములు]

***                ***                ***


తొక్కో తోటకూరస్య పార్లో పిప్పరమెంటస్యచ!
చిప్పోహి చిప్పహ బస్సోపి కొలంబసహ గరీయసి!!

అపార్థా…!

బసులు సిలబసులు చిప్పులు షిప్పులు మాళ్ళు, రుమాళ్ళు పెరుమాళ్ళు బిట్లు హాబిట్లు ద్రవములు ఉపద్రవములు బాబులు రుబాబులు వాడలు బెజవాడలు పిప్పరమెంట్లు పార్లమెంట్లు ఘనములు జఘనములు సర్వము సకలము నాచే సృజించబడినవి. పదముల యందు పేర్లయందు సామ్యమున్నంత మాత్రమున కంప్యూటర్ చిప్ కరకరమని నములు ఆలూ చిప్ కానేరదు. బస్ సిలబస్ గానూ, సిలబస్ కొలంబస్ గానూ మారజాలవు.

నీవెంత గోకి గొడవ చేసి పాకి కిందబడి దొర్లాడిననూ ఏదియును మరియొకదానితో ఏకార్ధమును సాధింపజాలదు. కావున ఏకాభిప్రాయ సాధన తొక్కా తొటకూర వంటి పదబంధములను భవబంధములను విడనాడి విభజన దిశగా పయనించి విముక్తుడవు కమ్ము. ఇక కుమ్ము.

పపంప పంప పాం టటంట టంట టాం [ఇది శాక్సోఫోన్ నాదము]

***                ***                ***

భార్యేతి భర్తంచ మధ్యస్య మసీర్హోర్మసి వంటింటిమసి!
ఇరుప్రాంతో సహోదరస్య నిర్భయ నివాస తత్వమసి!!

అపార్థా…!

భార్యా భర్తల మధ్య ఉండవలసింది ఇంటిమసీ యే గాని వంటింటి మసి కాదు. అట్టి విధముననే ఇరుప్రాంతముల వారిమధ్య ఉండదగినది సోదరభావమే గాని ఉదరభావము [పొట్టగొట్టుట యను వినాశకర భావము] కాదు.

ఈ తత్వమును గుర్తెరిగి, ఇప్పుడున్న పరిస్థితులయందు ఒకరికొకరు సహకరించుకొనుట యనునది అత్యంత ఆవశ్యకమగుచున్నది. ఇది గనుక సంభవమైనచో ఏ ప్రాంత వాసులైననూ ఎక్కడైననూ నిర్భయముగా నిశ్చయముగా ఆచంద్రతారార్కము నివసించ వీలగును. ఇది కష్టాదశ పురాణముల సారాంశము.

లలలూ లలలూ! లలల లలల లలలూ!! [అవునూ!!! ఇది ఏమి నాదము?]

***                ***                ***

అల్పపీడనోపి సముద్రస్య కుయ్యోమొర్రో శోకిష్యతి
ఢిల్లీణాం రిమోటహ తిప్పస్య నల్లాం కిం పీకిష్యతి

అపార్థా…!

చిన్న అల్పపీడనమునకే ఎంతటి సముద్రమైననూ కుయ్యో మొర్రో అని దిక్కులు పిక్కటిల్లునటుల మొత్తుకొనును. అట్టి సత్యము గుర్తెరుంగక, ఢిల్లీ రిమోటు తిప్పితే గాని గిద్దెడు నీరుగారని ఒక నల్లా [కుళాయి] ఏకముగా తుఫానునే ఆపుదునని పల్కుట హాస్యాస్పద వ్యాఖ్యగాను కొండొకచో ప్రగల్భము గాను భావించబడుచున్నది.

ప్రజలను బ్రోచు ప్రభువులే ఇవ్విధమున మాటలాడుట వినాశకాలమును సూచించుచున్నది.

మ్యావ్ మ్యావ్ మెమ్మెమ్మె మేడం మై ఢిల్లీ ఆవూం?[ఇది గోడ మీది పిల్లి నాదము]

***                ***                ***

నడిచే రైలోహ్యం స్టాపో శక్తి చైనతి మోటారోం సిగ్నలహ
ప్రాణేతి వెంటిలేటరహ సమైక్యవాదోణాం సెక్యూరిటీ హి

అపార్థా …!

రైలును ఆపగల శక్తి చైనుకు, మోటారు వాహనములను ఆపగల శక్తి ట్రాఫిక్ సిగ్నళ్ళకు, పోయే ప్రాణములను ఆపగల శక్తి వెంటిలేటర్లకు ఉన్నట్లే సమైక్యవాదులను అడ్డుకోగల శక్తి ఢిల్లీ పెద్దల సెక్యూరిటీ సిబ్బందికి కలదు.

వారినే ఒప్పించుట చేతకానివారు పెద్దలను ఒప్పించి విభజనను అడ్డుకుంటామని పల్కుట మిక్కిలి హాస్యాస్పదము.

వృం వృం వృం వౄం ం ం [ఇది రివర్సు గేరు నాదము]

***                ***                ***

మేఘస్య ఢీం మెరుపంచ జోగీణాం ద్వయం భస్మహ
భజనోపి విభజనేతివ్యతిరేకం మూతస్య దంతహ నష్టహ

అపార్థా…!

మేఘములు రెండు ఢీ కొన్న మెరుపు రాలును. జోగీ జోగీ రాసుకున్న బూడిద రాలును. భజనా తత్పరత విభజన వ్యతిరేకత ఒకేనోట జాల్వారిన కారణమున మూతిపండ్లు రాలుచున్నవని విశ్వసనీయ వర్గములు ఘోషించుచున్నవి.

పిప్పీ పీ! పప్పీ పా !పెప్పెప్పె బెబ్బెబ్బె ![ఇది సన్నాయి నొక్కుల నాదము]

5 thoughts on “విభజన ‘గీత’ -మరిన్ని శ్లోకాలు

  1. కవులు వికట కవులు అయిన వేళ అహ్హ్.. అహ్హ్..అహ్హ్..అహ్హ్..అహ్హ్..
    తెనాలి రామ లింగం కవి గారి పేరు పడి పోతున్నది అహ్హ్..అహ్హ్..
    అయినా అపార్ధ ఎందుకు? పార్ద కాధా?

    మీ కవిత్వం చదివాను కానీ, మీ వికట కవిత్వం చదివించినందుకు చాలా చాలా ధాంక్స్ అండీ!

  2. విశేఖర్ గారూ…..పడి పడీ నవ్వుతున్నాను.
    చాలా చాలా చాలా బాగున్నాయి.
    ఈ శోకం…సారీ శ్లోకాలు తెలుగులో కొత్త తరహా ప్రయోగం అనుకుంటాను.
    తెరేశ్ బాబు గారికి ధన్యవాదాలు.

  3. సమైక్య భజన, విలువల విభజన మధ్య
    వలువలు ఊడదీసుకుని చిలవలు పలవలుగా
    ప్రజనాయకులు అటు హస్తినలో విలువలు, ఇటు
    రాష్ట్రప్రజలలో పరువును జారవిడుచుకుని
    అభిమానం చంపుకుని విమానంలో భాగ్యనగరానికి
    హస్తినకు మధ్య దాగుడుమూతలు ఆడుతున్నారు!

  4. ఆకాశం తత్పితంశోయం, యధాగఛ్ఛతి సాగరం
    సమైక్య సమాహారం, ఆమరణనిరాహరదీక్ష భారం
    ఫలితం అధోగతిః, పదవి వ్యామోహం హస్తిన తీరం
    తీరం దాటని తుఫానుతో ప్రజాజీవనం అస్తవ్యస్థం
    నియోజకవర్గంలో అడుగిడితే నాయకులు అవస్థ
    వర్ణనాతీతం, ఎన్నికలకు అతీతం, అతలాకుతలం!

వ్యాఖ్యానించండి