నార్వే, ఇటలీ లలో ఉన్న రెండు గ్రామాలకు సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు. మిగిలిన ఆరు నెలలూ వారు చీకటిలో మగ్గాల్సిందే. ఆ రెండు గ్రామాలూ లోతైన లోయల్లో ఎత్తైన కొండలతో చుట్టుముట్టబడి ఉండడమే దానికి కారణం. వణికించే చలికి తోడు సూర్యరశ్మి లేకపోవడం ఆ గ్రామాలకు శాపంగా మారింది. ఈ సమస్యకు వారు ఓ వినూత్నమైన పరిష్కారం కనిపెట్టారు. కొండలపై పెద్ద పెద్ద ఉక్కు అద్దాలు అమర్చి సూర్య రశ్మిని గ్రామాలపైకి పరావర్తనం చెందించడం ద్వారా వారు చీకటిని తరిమి కొడుతున్నారు.
నార్వేలోని జూకన్, ఇటలీ లోని విగనెల్లా గ్రామాలు ఈ వినూత్న ప్రయోగానికి, పరిష్కారానికి వేదికగా నిలిచాయి. విగనెల్లా, జూకన్ లు నిజానికి గ్రామాలు కాదు. చిన్న పట్టణం లాంటివి. విగనెల్లా 2006లోనే అద్దాలను అమర్చుకుని సూర్యరశ్మిని పొందడం ప్రారంభించింది. జూకన్, ఈ నెలలోనే అద్దాలు అమర్చుకున్నది. విగనెల్లా పట్నంలో కొండలపైన అమర్చిన అద్దాలను కంప్యూటర్ల ద్వారా ఆపరేట్ చేస్తారు. ఇక్కడ ఏర్పరిచిన అద్దం దాదాపు 600 చదరపు మీటర్ల మీరే సూర్య రశ్మి కిరణాలను పరావర్తనం చెందించి పట్నం పైకి ప్రసరింపజేస్తుంది.
జూకన్, నార్వే రాజధాని ఓస్లోకు 150 కి.మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ స్కాండినేవియన్ దేశం ఆర్కిటిక్ కి చాలా దగ్గరగా ఉండడం వలన చలి ఎక్కువ. పట్నం చుట్టూ భారీ ఎత్తున కొండలతో పాటు అందమైన ప్రకృతి దృశ్యాలతో అలరారుతుంటుంది. కానీ అవే కొండలు సూర్యుడిని అడ్డుకోవడంతో సంవత్సరంలో దాదాపు ఐదారు నెలలు చీకటిలో ఉంటాయి. అద్దాల అమరికతో ఇపుడా గ్రామం సంబరపడుతోంది. కొండలపై అమర్చిన (51 చదరపు మీటర్ల ఉపరితలం) మూడు అద్దాలు ఆ గ్రామానికి ఇప్పుడు సూర్యుడుతో సమానం. వీటిని కూడా కంప్యూటర్లతో ఆపరేట్ చేస్తున్నారు.
ఈ ఫోటోలను అట్లాంటిక్ పత్రిక అందించింది.















విశేఖర్ గారూ…..ఈ పోస్టులో ఏదో లోపం కనబడుతోంది చూడగలరు.
@ నార్వే, ఇటలీ లలో ఉన్న రెండు గ్రామాలకు సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు. (నార్వేకు ఇటలీకి మధ్య చాలా దూరం కదండీ. మధ్యలో యూకే, జర్మనీ, నెదర్లాండ్స్ సహా ఇంకా చాలా దేశాలు ఉంటాయి కదా.)
సరే ధృవ ప్రాంతానికి దగ్గరగా నార్వేలో ఆరునెలలు చీకటి ఉండొచ్చు. ఇటలీ లో కూడా ఉంటుందా..?
ఆరునెలల పాటూ సూర్యుడే ఉండనపుడు ఇంకా….అద్దాలకు మాత్రం సూర్యుడు ఎక్కడినుంచి వస్తాడు. ?
నేను అనుకునేదేమంటే…ఎలాగు ఆరు నెలలు సూర్యుడు ఉండడు.
ఇక ఉన్న ఆరు నెలల్లో కూడా కొండల మధ్య గ్రామం ఉండడంతో సూర్యరశ్మి రాదనుకుంటా.
రెండు గ్రామాల గురించి ఒకేసారి రాయడం వల్ల వచ్చిన ఇబ్బంది అనుకుంటా.
మొత్తానికి కొంచెం గందరగోళంగా ఉంది. ఏమీ అనుకోవద్దు.
చందుతులసి గారు
పొరబడకుండా ఉండడానికి గ్రీన్ కలర్ లో ఉన్న పటం ఇచ్చాను.
సూర్యరశ్మి కనపడనిది ధృవానికి దగ్గరగా ఉండడం వల్ల కాదు. కొండల నీడ ఆ గ్రామాలపై పడడం వలన. ఆరు నెలల పాటు ఈ నీడ ఉంటుంది. మిగిలిన ఆరు నెలల్లో సూర్యుడి డైరెక్షన్ మారుతుంది. మన ఉత్తరాయణం, దక్షిణాయణం లాగా. దానితో సూర్యుడి కిరణాలు నేరుగా ఆ గ్రామాలపై పడతాయి.
సూర్యరశ్మి నేరుగా పడేట్లుగా అద్దాలు కొండలపై పెట్టారు. అక్కడి నుండి పరావర్తనం చెంది గ్రామం పైకి వెలుతురు వస్తుంది. అదెలాగో ఆ గ్రీన్ కలర్ బొమ్మలో ఉంది చూడండి.
రొమన్ల కాలం నుండే ఇళ్ళల్లో వెచ్చదనం కోసం అద్దాలను వాడేవారు!ఇది దానికి కొనసాగింపే!