జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా సెల్ ఫోన్ సంభాషణలను తాము వినడం లేదన్న అమెరికా వాదనను జర్మనీ కొట్టిపారేసింది. ‘అబద్ధాలాడొద్దు’ అని కసిరినంత పని చేసింది. తమ ఛాన్సలర్ ఫోన్ సంభాషణలను అమెరికన్లు వింటున్నారని చెప్పడానికి తమ వద్ద ‘నూతన సాక్ష్యాలు’ ఉన్నాయని తేల్చి చెప్పింది. జర్మనీ చట్టాలను ఉల్లంఘించడం లేదని చెబుతున్న ఎన్.ఎస్.ఏ వాస్తవం చెప్పడం లేదని జర్మనీ ఛాన్సలర్ వ్యవహారాల మంత్రి రొనాల్డ్ పొఫల్లా తెలిపారు.
అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అనేక దేశాల అధినేతల టెలిఫోన్ సంభాషణలను వింటోందని, రికార్డు చేస్తోందని తాజాగా వెల్లడయిన స్నోడెన్ పత్రాలు చెబుతున్నాయి. దాదాపు 35 దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రుల ఫోన్ సంభాషణలపైన ఎన్.ఎస్.ఏ నిఘా పెట్టిందని బ్రిటిష్ పత్రిక ‘ది గార్డియన్’ గురువారం ప్రచురించిన వార్తా కధనంలో తెలిపింది. దేశాధినేతలకు చెందిన వందలాది ఫోన్ల పైనా, ఇతర కమ్యూనికేషన్ల పైనా ఎన్.ఎస్.ఏ నిఘా పెట్టిందని, సదరు నంబర్లను, చిరునామాలను అమెరికా అధికారుల నుంచే ఎన్.ఎస్.ఏ సంపాదించిందని పత్రిక తెలిపింది.
జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సెల్ ఫోన్, ఈమెయిల్ సంభాషణలను ఎన్.ఎస్.ఏ రికార్డు చేస్తున్న సంగతి రెండు నెలల క్రితమే వెల్లడి అయింది. అయితే ఆ సమయంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ ల మధ్య ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అవి దాదాపు పూర్తి కావస్తున్న దశలో స్నోడెన్ పత్రాలు వెల్లడి అయ్యాయి. అయితే అమెరికాని ప్రశ్నించి నిలదీయడానికి బదులు ఆ వార్తలను కొట్టిపారేయడానికే జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మొగ్గు చూపింది. దేశాధ్యక్షురాలి పై నిఘా కంటే అమెరికాతో వాణిజ్యమే ముఖ్యమని కూడా ఆమె నర్మగర్భంగా వ్యాఖ్యానించింది.
ఒక్క ఛాన్సలర్ మాత్రమే కాదు. ఇతర జర్మనీ మంత్రులు కూడా అదే ధోరణి కనబరిచారు. జర్మనీ గూఢచార సంస్ధల వ్యవహారాలను చూసే రొనాల్డ్ పొఫల్లా అయితే మిలియన్ల కొద్దీ ఫోన్, ఈ మెయిళ్లను ఎన్.ఎస్.ఏ, జి.సి.హెచ్.క్యూ (బ్రిటన్) లు రికార్డు చేశాయన్న వార్తకు ఆధారాలు లేవని అప్పట్లో ప్రకటించాడు. “ఎన్.ఎస్.ఏ వ్యవహారం ముగిసిపోయినట్లే” అని కూడా ఆయన ఆగస్టులో ప్రకటించాడు. జర్మనీ ప్రజల మౌలిక హక్కులను ఎన్.ఎస్.ఏ మిలియన్ల సార్లు ఉల్లంఘించిందనేందుకు సాక్ధ్యాలు లేవని, జర్మనీ చట్టాలను పూర్తిగా పాటిస్తున్నట్లుగా తమకు ఎన్.ఎస్.ఏ, జి.సి.హెచ్.క్యూ ల నుండి లిఖితపూర్వక హామీ లభించిందని ఆయన తెలిపాడు.
జర్మనీ ప్రభుత్వ ధోరణిని ఆ దేశం లోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ఎన్.ఎస్.ఏ ఇస్తున్న హామీలు మోసపూరితం అనీ వాటిని ప్రభుత్వం ఎలా నమ్ముతోందని జర్మనీ గ్రీన్ పార్టీ ప్రశ్నించింది. అమెరికా గూఢచర్యంపై ఛాన్సలర్ వెంటనే పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది.
ఈ నేపధ్యంలో రెండు, మూడు రోజుల నుండి జర్మనీ స్వరం మారింది. ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తో పాటు రొనాల్డ్ కూడా అమెరికా గూఢచర్యం పైన కఠినంగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. గురువారం జర్మనీ పార్లమెంటు బుండెస్టాగ్ కి చెందిన పార్లమెంటరీ కంట్రోల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం రొనాల్డ్, ఎన్.ఎస్.ఏ గూఢచర్యం పైన పునఃమూల్యాంకనం చేయాలని తాము ఆదేశించామని ప్రకటించాడు. ఎన్.ఎస్.ఏ లిఖిత పూర్వకంగానూ, మాటల్లోనూ ఇచ్చిన హామీలను సమీక్షిస్తున్నామని ప్రకటించాడు.
ఎన్.ఎస్.ఏ గూఢచర్యం జర్మనీకి తెలియనిదేమీ కాదు. అయితే తాజాగా జర్మనీ కఠినంగా మారడాన్ని బట్టి ఈ వ్యవహారాన్ని తమ ప్రయోజనాలకు అనుకూలంగా వినియోగించడానికి జర్మనీ నిశ్చయించుకుందని అర్ధం చేసుకోవచ్చు. జర్మనీ-అమెరికా సంబంధాలలో సాపేక్షికంగా ఒక అడుగు పైకి ఎక్కడానికి జర్మనీ నిఘా వ్యవహారాన్ని ఉపయోగపెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు సఫలం అవుతాయా లేక అమెరికా తిప్పి కొడుతుందా, తిప్పికొడితే ఎలా తిప్పికొడుతుంది, అన్నవి ఆసక్తికరమైన ప్రశ్నలు. త్వరలో యూరోపియన్ యూనియన్ సమావేశాలు జరగనున్నందున ఆ సమావేశాల స్పందన కూడా గమనించాల్సి ఉంది.

అగ్రరాజ్య తహతహలో నిగ్రహం కోల్పోతున్న అమెరిక ప్రపంచ దేశాల అనుగ్రహానికి అతీతంగా ఇతర అభివృద్ధి దేశాల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. ఒబామా ఈ విషయానికి విషబీజాలు నాటాననడంలో సందేహపడవలసి వస్తోంది. ముఖ్యంగా రెండో విడత విజయంలో ఆయనగారి ఎన్ని కలల సిడ్ఢాంతాలకు తిలోదకాలు పలికి తన హయాములో కొత్త లోకలను అమెరికావాసుల కను సన్నలలో నిలపాలనే తపన, తాపత్రయంలో అతిశయం పెంచుకుని అనుకోని రాజకీయ అతిధిగా మిగిలిపోవలనే దృష్టిని సారిస్తున్నాడు. ఇండొ-పాక్ రాజకీయ దౌత్యసంబంధాలలో శకునిపాత్రను పోషిస్తున్నాడు. వృద్ధాప్య గౌరవంతో మన్మోహితుని చేసి అన్యమనస్కంగా ప్రవర్తిస్తున్నాడు.