చిదంబరం: “పెరిగిపోతున్న కూరగాయల ధరలకు నేను బ్రహ్మాండమైన పరిష్కారం కనిపెట్టాను – 1000 టన్నుల ఉల్లిపాయలను ఎక్కడ పాతిపెట్టారో ఈయన గారు కలగన్నారట.”
*** *** ***
ఉల్లి పాయల రేట్లు మళ్ళీ ఊపిగొట్టేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లిపాయల ధర వంద రూపాయలు దాటిపోయిందని ఆంగ్ల, హిందీ ఛానెళ్ళు అదే పనిగా మొట్టుకుంటున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ మాత్రం ఉల్లిపాయలకు వాస్తవంగా కొరత లేదని చెబుతున్నారు. వాస్తవంగా కొరత లేకుండా ఉల్లిపాయల ధర మండిపోవడానికి కారణం ఏమిటో మంత్రిగారికి తెలియదా? బ్లాక్ మార్కెటీర్ల పైన చర్యలు ప్రకటించడం మాని కొరత లేదని ఉత్తుత్తి ప్రకటనలు చేస్తే ఏమిటి లాభం?
మరీ దారుణం ఏమిటంటే మరో రెండు మూడు వారాలు ఆగితే ఉల్లి ధర తగ్గిపోతుందని వ్యవసాయ మంత్రి హామీ ఇవ్వడం. అంటే ఈ రెండు, మూడు వారాలపాటూ అక్రమ వ్యాపారస్తులకు రెచ్చిపోయి సొమ్ము చేసుకోమని చెప్పడమే కాదా?
ఉల్లిపాయల ఎగుమతుల పైన నిషేధం విధించే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోందని మరో హామీ! అన్నీ హామీలే తప్ప వెంటనే ధరలు తగ్గించే చర్యలు ఏమి తీసుకుంటున్నారో చెప్పడం లేదు. అక్రమ వ్యాపారస్ధుల గోడౌన్ల పైన దాడులు చెయ్యొచ్చు. వ్యాపారస్ధుల నిల్వలను తనిఖీ చెయ్యొచ్చు. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వమే అమ్మేలా చర్యలు తీసుకోవచ్చు. అధికారంలో ఉన్నవారికి అనేక చర్యలు అందుబాటులో ఉంటాయి. కానీ అధికారంలో ఉన్నవారు అక్రమ వ్యాపారులకే కొమ్ము కాస్తుపుడు చర్యలు ఎలా ఉంటాయి.
రెండు నెలల క్రితం ఇదే విధంగా ఉల్లి ధరలు కొండెక్కినపుడు మరో రెండు నెలలు ఆగితే ఉల్లి పంట చేతికి వస్తుందని, అప్పుడిక కొరత ఉండదని, ధరలు కూడా దిగి వస్తాయనీ ఇదే వ్యవసాయ మంత్రిగారు సెలవిచ్చారు. ఆ హామీ అలా ఉండగానే ఉల్లి మళ్ళీ ఘాటెక్కింది. ఇప్పుడు ఇంకో రెండు మూడు వారాలు ఆగాలంటున్నారు.
దాని బదులు కార్టూనిస్టు చెపుతున్నట్లు ఉత్తర ప్రదేశ్ వెళ్ళి శోభన్ సర్కార్ గారిని అడిగితే రాత్రికి రాత్రి కలగని ఉల్లిపాయలు అక్రమంగా ఎక్కడెక్కడ నిల్వలు ఉంచారో చెప్పమని కోరితే సరిపోతుంది. వాస్తవానికి కొరత లేదని మంత్రిగారే చెబుతున్నారు కదా!
(ఈ కార్టూన్ ను మిత్రుడు ‘ఎందుకో, ఏమో‘ గారు పంపారు.)

కాంగ్రెస్ రాజకీయ విధివిధానాలలో నిధినిక్షేపాల తవ్వకాలు
సిరిరా మోకాలొడ్డిన రీతిలో యువనాయకుడి మనోభావాలు
ఉల్లిఘాటు, చమురుపోటుతో సామాన్యుడి బతుకు ఏటవాలు
నల్లధనం చాటు తవ్వకాల చోటులో యు.పి.ఎ. గోలుమాలు!!