అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సెల్ ఫోన్ ను ట్యాప్ చేసి సంభాషణలను వింటోందని జర్మనీ ఆరోపించింది. ఎన్.ఎస్.ఏ చర్యలకు వివరణ ఇవ్వాలని కోరుతూ జర్మనీ ప్రభుత్వం తమ దేశంలోని అమెరికా రాయబారికి సమన్లు పంపామని తెలిపింది. గురువారం (అక్టోబర్ 24) సాయంత్రం కలిసి వివరణ ఇవ్వాల్సిందిగా అమెరికా రాయబారి జాన్ బి.ఎమర్శన్ ను కోరామణి జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
జర్మనీ ప్రకటనపై వ్యాఖ్యానించడానికి అమెరికా ఎంబసీ నిరాకరించిందని ది హిందు తెలిపింది. ఎన్.ఎస్.ఏ గూఢచర్యంపై తమ ఛాన్సలర్ ఏంజెలా అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కు ఫిర్యాదు చేశారని బుధవారమే జర్మనీ ప్రభుత్వం పత్రికలకు తెలిపింది. ఈ ఫిర్యాదులో వాస్తవం లేదని అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి జే కేర్ని ప్రకటించాడు. ఏంజెలా ఫోన్ సంభాషణలను తాము వినడం లేదని, భవిష్యత్తులో కూడా వినబోమని కేర్ని ప్రకటన పేర్కొంది. అయితే ఇప్పటివరకూ విన్నదీ లేనిదీ మాత్రం కేర్ని చెప్పలేదు. జర్మనీ ఛాన్సలర్ ఫోన్ సంభాషణలపై ఇప్పటివరకూ నిఘా పెట్టామని ఈ ప్రకటన ద్వారా అమెరికా/వైట్ హౌస్ పరోక్షంగా అంగీకరించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏంజెలా ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టడం నిజమే అని నిర్ధారణ అయిన పక్షంలో అది “(ఇరు దేశాల మధ్య ఉన్న) నమ్మకాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే” అని ఛాన్సలర్ ప్రతినిధి జారీ చేసిన ప్రకటన పేర్కొంది. అమెరికా గూఢచార సంస్ధలు ఛాన్సలర్ ఫోన్ సంభాషణలు వింటున్నాయని తమకు సమాచారం అందిందని వెంటనే ఈ విషయం అమెరికా అధ్యక్షుడికి ఫిర్యాదు చేశామని జర్మనీ ప్రభుత్వం తెలిపింది. తాము చేసిన పరిశోధన ఫలితంగానే జర్మనీ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని జర్మనీ పత్రిక డేర్ స్పీజల్ తెలిపింది.
ఒబామా కి చేసిన ఫోన్ కాల్ లో అమెరికా చర్యను ఛాన్సలర్ తీవ్రంగా ఖండించారని ఏంజెలా ప్రతినిధి స్టెఫ్ఫెన్ సీబర్ట్ ఒక ప్రకటనలో తెలిపాడు. “అటువంటి చర్యలు పూర్తిగా అవాంఛనీయం అని ఆమె అధ్యక్షుడికి చెప్పారు. ప్రభుత్వాధినేత సంభాషణలను ఆ విధంగా వినడానికి వీలు లేదని, అటువంటి చర్యలను వెంటనే ఆపాలని కోరారు.” అని సీబర్ట్ ప్రకటన తెలిపింది.
ఈ స్పందన సారాంశం ఏమిటో అర్ధం కాకుండా ఉంది. ప్రభుత్వాధినేత కాకుండా ప్రజల ఫోన్లయితే వినవచ్చని ఏంజెలా చెప్పదలిచారా? అసలు ఫిర్యాదు చెయ్యడంతో సరిపెట్టుకోవడం ఏమిటి? ఏంజెలా మెర్కెల్ సామాన్యురాలు కాదు. అమెరికా పౌరురాలు అసలే కాదు. ఒక స్వతంత్ర దేశానికి అధినేత. దేశాధినేతగా అమెరికా గూఢచర్యాన్ని కట్టడి చేసే చర్యలు తీసుకోవడం మాని సాధారణ పౌరులకు మల్లే మరో దేశాధ్యక్షుడికి ఫిర్యాదు చేయడం ఏమిటి? ఆ దేశాధ్యక్షుడికి తెలియకుండానే ఆయన కింద పనిచేసే గూఢచార సంస్ధ ఆమె ఫోన్ పై నిఘా పెడుతుందా?
ఈమె ఫిర్యాదుకు తగ్గట్టుగానే శ్వేత భవనం సమాధానం ఇచ్చింది. “తన ఫోన్ సంభాషణలను వినడం లేదని, వినబోమని అధ్యక్షుడు ఛాన్సలర్ కు గట్టిగా హామీ ఇచ్చారు. ఉమ్మడి భద్రతా సవాళ్ల పట్ల జర్మనీతో మాకున్న సహకారాన్ని అమెరికా గొప్పగా పరిగణిస్తుంది” అని వైట్ ప్రతినిధి జే అన్నాడు. అంటే అమెరికా గూఢచర్యంలో జర్మనీ సహకారం కూడా ఉన్నదని జే నేరుగానే చెబుతున్నాడు. మనం మనం ఒకటే అయినప్పుడు పబ్లిక్ లో ఈ నాటకాలెందుకు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. నిజమే కదా. ఈ నాటకాన్ని ప్రధానంగా గ్రహించాల్సింది జర్మనీ పౌరులే. టెర్రరిజం పేరుతో తమ పాలకులు తమ ఏకాంతాన్ని అమెరికా గూఢచార కంపెనీల చేతుల్లో పెడుతున్న వాస్తవాన్ని గుర్తెరగాలి.
ఫ్రాన్స్ కూడా
నాలుగు రోజుల క్రితం ఫ్రాన్స్ కూడా అమెరికా గూఢచర్యంపై స్పందించింది. ఫ్రాన్స్ లో అమెరికా రాయబారి చార్లెస్ రివ్కిన్ ను ఎన్.ఎస్.ఏ గూఢచర్యంపై వివరణ కోరింది. ఒక నెల రోజుల కాలంలోనే (డిసెంబర్ 10, 2012 నుండి జనవరి 8, 2013 వరకు) ఫ్రాన్సు పౌరులు పంచుకున్న 70 మిలియన్ల ఈ మెయిళ్లను ఎన్.ఎస్.ఏ రికార్డు చేసిందని స్నోడెన్ పత్రాల ద్వారా వెల్లడయింది. ఫ్రాన్స్ పోరులు, పారిశ్రామిక వేత్తలు, కంపెనీలు… వీరందరి ఈ మెయిళ్లను ఎన్.ఎస్.ఏ రికార్డు చేసిందని ఫ్రెంచి పత్రిక లె మాండే ఆదివారం (అక్టోబర్ 21) సంచలన వార్తా కధనం ప్రచురించింది. పారిశ్రామిక రహస్యాలను తెలుసుకోవడం కూడా ఈ గూఢచర్యంలో ఇమిడి ఉన్నదని సదరు పత్రిక తెలిపింది.
లె మాండే కధనం ప్రకారం ఫ్రాన్స్ లో గూఢచర్యానికి ఎన్.ఎస్.ఏ US985-D అనే కంప్యూటర్ ప్రోగ్రామ్ ను వినియోగించింది. కొన్ని కీ వర్డ్స్ ఆధారంగా లక్ష్యంగా పెట్టుకున్న ఫోన్ సంభాషణలను, పాఠ్య సందేశాలనూ ఈ ప్రోగ్రామ్ రికార్డు చేస్తుందని పత్రిక తెలిపింది. స్నోడెన్ వెల్లడి చేసిన పత్రాలను అధ్యయనం చేసిన తర్వాత పత్రిక ఈ కధనం ప్రచురించింది. టెర్రరిస్టుల సంభాషణలు వినడం ఒట్టిమాటేనని, అనేకమంది రాజకీయ నాయకులు, ఆర్ధిక సంస్ధల అధిపతులు, ప్రముఖ వ్యాపారవేత్త లను ఎన్.ఎస్.ఏ లక్ష్యంగా చేసుకుని గూఢచర్యం నిర్వహించిందని తెలిపింది.
లె మాండే పత్రిక వార్త దరిమిలా తాను షాక్ కి గురయ్యానని ఫ్రాన్స్ ప్రధాని జీన్-మార్క్ ఐరాల్ట్ వ్యాఖ్యానించాడు. ఒక మిత్రదేశం పైన అమెరికా ఇటువంటి చర్యలకు పూనుకోవడం పట్ల తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన ప్రకటించగా విదేశీ మంత్రి లారెన్ ఫెబియస్ “అమెరికా చర్య ఆమోదయోగ్యం కాదు” అని చెప్పి ఊరుకున్నాడు. ఫ్రాన్స్ స్పందన ఇంత పేలవంగా ఉండడానికి కారణం ఆ దేశం కూడా తమ ప్రజల ఫోన్, ఇంటర్నెట్ సంభాషణలపై నిఘా పెట్టడమే కారణం.
తేలు కుట్టిన దొంగలా పత్రికలకు దొరికిపోయిన ఫ్రాన్స్ ప్రభుత్వం అమెరికా గూఢచర్యం పట్ల ప్రారంభంలో పెద్దగా స్పందించలేదు. అయితే ఇటీవల కాలంలో అమెరికా నిఘాను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఫ్రాన్స్ మంత్రులు, అధికారులు కొద్దిగా పెద్ద శబ్దాలు చేస్తున్నారు. దేశంలో రగులుతున్న సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి వారికి అమెరికా గూఢచర్యం ఒక అవకాశంగా దొరకడమే దానికి కారణం.
తాము స్వయంగా పాల్పడుతున్న గూఢచర్యం బైటపడడంతో పాటు స్లోవేకియా నుండి పదేళ్ళ క్రితం వలస వచ్చిన ఒక రోమా కుటుంబాన్ని బలవంతంగా గెంటివేయడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండే పాపులారిటీ తీవ్రంగా పడిపోయింది. సదరు కుటుంబానికి చెందిన 10 వ తరగతి బాలికను ఆమె ప్రయాణిస్తున్న స్కూల్ బస్ నుండి మధ్యలో దింపేసి అటునుండి అటే దేశం దాటించిన దుర్మార్గంపై పలు జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు తీవ్రంగా స్పందించాయి.
గత అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ ఇదే తరహాలో రోమా, జిప్సీ లను బలవంతంగా తరిమివేయడం పట్ల విమర్శలు గుప్పించి ప్రజాదరణను చూరగొన్న ఒలాండే అధికారంలోకి వచ్చాక అదే విధానాలను అవలంబించడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజాగ్రహం దృష్టి మళ్లించడానికి అమెరికా గూఢచర్యం మంచి అవకాశంగా దొరికిందని ఫ్రెంచి పత్రికలు విశ్లేషిస్తున్నాయి.
వీళ్ళ వ్యవహారం ఎలా ఉన్నా అమెరికా తొణకడం లేదు, బెదరడం లేదు. గట్టిగా అడిగితే మీరు చేసేదే మేమూ చేస్తున్నాం అని సమాధానం చెబుతోంది. సొంత ప్రజలపై నిఘా పెట్టడంలో అమెరికాకు అనేక ఐరోపా దేశాలు పూర్తిగా సహకరించాయని స్నోడెన్ పత్రాలు స్పష్టం చేశాయి. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్లుగా ప్రజలకు ఏకాంతం అనేదే లేకుండా చేశాయి. అయితే తమ కంపెనీలు, దేశాధినేతలు, మంత్రుల పైన గూడా అమెరికా నిఘా పెట్టిందన్నదే ఐరోపా రాజ్యాలకు మింగుడు పడడం లేదు. అలాగని, తామూ భాగస్వాములం గనక, గట్టిగా అడగానూ లేరు.











