తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలకు ‘అందని ద్రాక్ష’ ఆ ద్రాక్ష పండు భవిష్యత్తులో ఎవరికి తీపిని ఇస్తుందో ఎవరికి పుల్లదనాన్ని మిగుల్చుతుందో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. 2జి కుంభకోణం దరిమిలా ఎ రాజా, దయానిధి మారన్ లపై నమోదయిన సి.బి.ఐ కేసులు డి.ఎం.కె పార్టీని అవాంఛనీయ పార్టీగా అందరూ చూస్తుండగా అన్నా డి.ఎం.కె ఆకర్షణీయంగా మారిపోయింది. పార్టీ అధినేత్రి, పురచ్చి తలైవి, జయలలిత తన రెండాకుల గుర్తును ఏ కూటమికి కానుకగా ఇస్తుందన్నది అనూహ్యంగా ఉంటోంది.
వామ పక్ష పార్టీలు మూడో ఫ్రంట్ కోసం కలలు కంటూండగా, రెండు సార్లు అధికారానికి దూరంగా నెట్టివేయబడ్డ ఎన్.డి.ఏ మోడి నాయకత్వంలో అధికారం చేజిక్కడం తప్పదని ఆశలు పెట్టుకుంది. ములాయం సింగ్ యాదవ్ ను ఇప్పటికే దువ్విన వామపక్షాలు అప్పుడే మూడో ఫ్రంట్ ఏర్పడిందని చెప్పడానికి జంకుతున్నారు. మూడో ఫ్రంట్ అంటూ ఏర్పడితే అది ఎన్నికల తర్వాతే అని వారు అంగీకరిస్తున్నారు. కానీ ఈ లోపు కలిసి రాగల మిత్రుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేయడం మానలేదు.
గత జూన్ లో జరిగిన రాజ్య సభ ఎన్నికల్లో సి.పి.ఐ అభ్యర్ధి డి.రాజాకు మద్దతుగా జయలలిత తమ అభ్యర్ధిని ఉపసంహరించుకోవడంతో ఆమె ధర్డ్ ఫ్రంట్ వైపు చూస్తున్నారా అన్న ఊహలు వ్యక్తం అయ్యాయి. వచ్చే సంవత్సరం తమిళనాడు నుండి ఖాళీ అయ్యే ఒక రాజ్య సభ సీటు కోసం తమ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని సి.పి.ఏం నేత ప్రకాష్ కారత్ గత నెలలో జయలలితను ప్రత్యేకంగా కలిసి కోరారు. లోక్ సభ ఎన్నికల కోసం కూడా ఒక అవగాహనకు రావాలని ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిని కోరినట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు బి.జె.పి ప్రధాని అభ్యర్ధి మోడితో జయలలితకు మంచి సంబంధాలు ఉన్నాయని పత్రికలు చెబుతుంటాయి. పాత సంబంధాలను గుర్తుకు తెచ్చి మళ్ళీ బంధం కలుపుకోవాలని బి.జె.పి నాయకులు ప్రయత్నిస్తున్నప్పటికీ జయలలిత మాత్రం తన మనసులో మాటను ఇంతవరకు వెల్లడించకుండా గుంభనంగా ఉంటున్నారు. తెలుగు దేశం సరే అంటే మూడో ఫ్రంట్ వైపు వెళ్లడానికి ఆమె సిద్ధంగా ఉన్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. కానీ తెలుగు దేశం ఇప్పటికే బి.జె.పి కూటమిలో చేరడానికి సిద్ధపడినట్లు సంకేతాలు ఇస్తోంది.
తమిళనాడులో 39 లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఇందులో కనీసం 20 సీట్లు జయలలిత ఖాతాలో ఖాయం అని సర్వేలు చెబుతున్నాయి. దానితో జయలలితతో స్నేహం కోసం కూటములన్నీ ఆశగా చూస్తున్నాయి. ఆమె ఎవరివైపు మొగ్గుతారో చెప్పడం ఎవరికి సాధ్యం? అసలు జయలలిత సైతం నిర్ణయించుకున్నారో లేదో మరి!

జయలలిత గారు ఏకంగా ప్రధాని కుర్చీ మీద కన్ను వేసినట్లు ఊహగానాలు! ఆవైపు ఆమే చాలా కృషి చేస్తున్నారు. రాజకీయాలు వడిదుడుకులు లేకుండ జరిగే సాధారణ పరిస్తితుల్లో ఐతే అమే నరేంద్ర మోదీకి తప్ప ఇంకెవరి కి మద్దతివ్వరు. అందు కు చో రామస్వామి గారు చాలా కృషి చేస్తారు కూడా. (కార్టూన్ లో ఆమే చూపు నరెంద మోదీ వైపు మొగ్గినట్లుంది చూడమడి) సి.పి.ఎం. మూడో ప్రంట్ ఎర్పరచగలదా, కలిసొస్తే తనను ప్రదాని పీఠం మీద కూర్చోనిస్తారా? అయితే ఇంకేం. వారికే అమే మద్దతు. అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు.