డ్రోన్ హత్యలను అమెరికా సమర్ధించుకుంది. చట్టాలకు అనుగుణంగానే తాను డ్రోన్ హత్యలకు పాల్పడుతున్నానని స్పష్టం చేసింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జే కేర్ని ఈ మేరకు విలేఖరుల సమావేశం పెట్టి మరీ తమ హంతక చర్యలను సమర్ధించుకున్నాడు. అమలు చేయదగిన అన్ని చట్టాలకు అనుగుణంగానే తమ డ్రోన్ హత్యలు సాగుతున్నాయని ఆయన అన్నాడు. కానీ ఆ చట్టాలేమిటో ఆయన చెప్పలేదు. అమెరికా డ్రోన్ దాడులు అంతర్జాతీయ చట్టాలను, అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధలతో పాటు ఐరాస ప్రత్యేక ప్రతినిధి కూడా తీవ్రంగా తెగనాడిన నేపధ్యంలో జే కేర్ని సమర్ధనలతో విలేఖరుల ముందుకు వచ్చాడు.
పాకిస్ధాన్, సోమాలియా, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో అమెరికా జరుపుతున్న డ్రోన్ దాడులలో వందలాది అమాయక పౌరులు మరణిస్తున్నారని వీటిని వెంటనే నిలిపివేయాలని బ్రిటన్ కు చెందిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ (ఎ.ఐ) సంస్ధ ఒక నివేదిక వెలువరించిన సంగతి తెలిసిందే. ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఎమర్శన్ కూడా ఈ విషయంలో అమెరికాను విమర్శిస్తూ మధ్యంతర నివేదికను ప్రచురించిన సంగతి ఈ బ్లాగ్ లో తెలియజేయడం జరిగింది. ఈ రెండు సంస్ధలే కాకుండా అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్.ఆర్.డబ్ల్యూ) సంస్ధ కూడా అమెరికా డ్రోన్ హత్యలపై 102 పేజీల నివేదిక వెలువరించింది. ఎ.ఐ నివేదిక పాకిస్ధాన్ పై కేంద్రీకరించగా హెచ్.ఆర్.డబ్ల్యూ నివేదిక ప్రధానంగా యెమెన్ లో జరుగుతున్న డ్రోన్ దాడులను చర్చించింది.
అమెరికా చెప్పుకుంటున్నట్లు హెల్ ఫైర్ క్షిపణులు కేవలం తీవ్రవాదులను మాత్రమే చంపడం లేదనీ, ఈ దాడుల్లో తరచుగా అనేకమంది మహిళలు, పిల్లలు మరణిస్తున్నారని హెచ్.ఆర్.డబ్ల్యూ నివేదిక తెలిపింది. యెమెని ఆల్-ఖైదా మిలిటెంట్ల కంటే ఎక్కువగా అమాయక పౌరులు మరణిస్తున్నారని స్పష్టం చేసింది. యుద్ధ సూత్రాల ప్రకారం చూసినా అమెరికా చెప్పే సర్జికల్ స్ట్రైక్స్ చట్టబద్ధం కాదని తేల్చింది. 2009 నుండి యెమెన్ లో అమెరికా 80 సార్లు డ్రోన్ దాడులు చేసిందని చెప్పిన హెచ్.ఆర్.డబ్ల్యూ వాటిలో కేవలం 6 దాడుల వివరాలు మాత్రమే తెలిపింది.
2009లో జరిగిన ఒక దాడి, 2012-13 లో జరిగిన మరో 5 దాడుల వివరాలు హెచ్.ఆర్.డబ్ల్యూ నివేదిక ప్రస్తావించింది. ఈ 6 దాడుల్లో మొత్తం 82 మంది మరణించగా అందులో 57 మంది (70%) పౌరులేనని తెలిపింది. అయితే హెచ్.ఆర్.డబ్ల్యూ చెప్పిన 2009 నాటి దాడి డ్రోన్ దాడి కాదని, దానికంటే ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులతో జరిపిన దాడి అని రష్యా టుడే తెలిపింది. డిసెంబర్ 17, 2009 తేదీన ఆల్-మజలాహ్ గ్రామంలో అమెరికా నేవీ క్రూయిజ్ మిసైళ్లతో దాడి జరిగిందని, ఈ మిసైళ్లను డ్రోన్ విమానం మోసుకెళ్లడం అసాధ్యమని ఆర్.టి తెలిపింది. క్రూయిజ్ మిసైళ్ళు క్లస్టర్ బాంబులు జారవిడవడంతో మొత్తం 55 మంది చనిపోగా వారిలో 41 మంది స్త్రీలూ, పిల్లలే. 9 మంది స్త్రీలు, 21 మంది పిల్లలు చనిపోయారని హెచ్.ఆర్.డబ్ల్యూ ప్రతినిధి లెట్టా టేలర్ తెలిపారు.
“అమెరికాకు నాదొక ప్రశ్న: మీ వద్ద డ్రోన్ విమానాలు ఉన్నాయి. గూఢచార విమానాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అంతా ఉంది. అయినా ఒక టెర్రరిస్టుకీ, అమాయక పోరుడికీ మధ్య ఉన్న తేడా ఏమిటో అమెరికాకు తెలియడం లేదా?” అని దాడిలో 28 మంది బంధువులను పోగొట్టుకున్న మాక్బిల్ మహమ్మద్ ఆలీ తమను ప్రశ్నించాడని హెచ్.ఆర్.డబ్ల్యూ తెలిపింది. అమెరికా డ్రోన్ దాడులు నిజానికి టెర్రరిస్టు ప్రమాదాన్ని తగ్గించడం కంటే మరింత పెంచుతున్నాయని, దాడుల ఫలితంగా మిలిటెంట్లను పెంచుకోవడానికి AQAP (ఆల్-ఖైదా ఇన్ అరబ్ పెనిన్సులా) కు చక్కని అవకాశం లభిస్తోందని టేలర్ తెలిపారు.
ఇంత స్పష్టంగా ఉదాహరణలతో సహా చెప్పినప్పటికీ తమ హంతక చర్యలను సమర్ధించుకోవడానికే అమెరికా మొగ్గు చూపింది. “అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా అమెరికా వ్యవహరిస్తోందన్న ఆరోపణలకు సంబధించినంతవరకూ మేము గట్టిగా తిరస్కరిస్తున్నాము. వర్తించదగిన చట్టాలకు అనుగుణంగానే ఉగ్రవాద వ్యతిరేక దాడులు ఉండేలా ప్రభుత్వం అసాధారణ జాగ్రత్తలు తీసుకుంటోందని మేము పదే పదే చెబుతున్నాము” అని జె కేర్ని అన్నాడు. వారు పదే పదే చెబుతుంటారు. ఉల్లంఘనలు సైతం పదే పదే జరుగుతుంటాయి.
కేర్ని చెప్పిన మరో అబద్ధం ఏమిటంటే ఉగ్రవాదులను చంపడం కంటే పట్టుకోవడం పైనే అమెరికా ఎక్కువ దృష్టి పెడుతోందని చెప్పడం. ఇంతకు మించిన వంచన, సిగ్గులేనితనం ఉండదేమో. ఎందుకంటే పట్టుకునే అవసరం లేకుండా ఉండడానికే అమెరికా డ్రోన్ హత్యలు మొదలు పెట్టింది గనక. ఉగ్రవాదులను పట్టుకున్నాక వారిని జైలులో పెట్టాలి. సంవత్సరాల తరబడి విచారణ చేయాలి. విచారణ క్రమంలో వారిని చిత్ర హింసలు పెట్టాలి. చిత్ర హింసల కోసం ప్రత్యేక సౌకర్యాలు నిర్మించాలి. గ్వాంటనామో బే లాంటి ప్రత్యేక జైళ్లను నిర్మించాలి. ఇదంతా చేస్తున్నందుకు ప్రపంచం నుండి, మానవ హక్కుల సంస్ధల నుండి విమర్శలు ఎదుర్కోవాలి. ఇన్ని చేసే బదులు ఒకేసారి చంపేస్తే బాధ్యత లేకుండా తప్పించుకోవచ్చన్న వ్యూహంతోనే అమెరికా విచక్షణా రహితంగా డ్రోన్ హత్యలకు పాల్పడుతోంది. తద్వారా నాగరిక న్యాయ వ్యవస్ధ అభివృద్ధి చేసిన సర్వ వ్యవస్ధలనూ, సూత్రాలనూ, చట్టాలనూ అడ్డంగా ఉల్లంఘిస్తోంది.
అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఉల్లంఘిస్తున్న నేపధ్యంలో ఇతర దేశాలు కూడా ఇవే నేరాలకు పాల్పడేందుకు తగిన భూమిక ఏర్పడుతోందని హెచ్.ఆర్.డబ్ల్యూ, ఎ.ఐ నివేదికలు హెచ్చరించాయి. అనంతర కాలంలో ఇతర దేశాలు కూడా ఇదే పంధాను అవలంబిస్తే వాటిని కట్టడి చేయడం దుస్సాధ్యం అవుతుందని హెచ్చరించాయి. “డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచానికి తాను పంపిస్తున్న సంకేతాల విషయంలో అమెరికా జాగ్రత్తగా ఉండాలి. డ్రోన్ దాడులకు సంబంధించి ‘బాధ్యతారాహిత్యం’ అని బ్లాక్ హోల్ ని అంతం చేయాల్సిన అవసరం ఉంది. ఢీకొట్టి పారిపోయే డ్రైవర్ లాగా అమెరికా వ్యవహరిస్తోంది” అని హెచ్.ఆర్.డబ్ల్యూ లాయర్ ఆండ్రియా ప్రాసో అన్నారు. (ఆర్.టి)
ఇతర దేశాలు కూడా తమను అనుసరించవచ్చన్న సంగతి తమ మదిలో ఉన్నదని అమెరికా అధికారులు చెప్పడం విశేషం. “ముందు ముందు మరిన్ని దేశాలు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవచ్చు. దీనిని మేము ఎప్పుడు వినియోగిస్తున్నామన్నది కాదు సమస్య, ఇతర దేశాలు ఎప్పుడు ఉపయోగిస్తాయన్నదే సమస్య. ఉగ్రవాద వ్యతిరేక అధికారుల్లో ఈ అంశం చర్చలో ఉన్నది. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా చర్చిస్తూనే ఉంటాము” అని అమెరికా విదేశాంగ ప్రతినిధి మేరీ హార్ఫ్ ‘ది గార్డియన్’ పత్రికతో మాట్లాడుతూ వ్యాఖ్యానించింది. అమెరికా చర్చిస్తూనే ఉంటుంది. జరిగేవి జరుగుతూనే ఉంటాయి! తమ నివేదికలపై స్పందించాలని హెచ్.ఆర్.డబ్ల్యూ, ఎ.ఐ ప్రతినిధులు అమెరికా ప్రభుత్వాన్ని కోరినా ఎవరూ స్పందించకపోవడమే అందుకు తార్కాణం.
పైగా ‘సిగ్నేచర్ స్ట్రైక్స్’ పేరుతో అమెరికా తన బలగాలకు అపరిమిత అధికారాలాను కట్టపెట్టింది. ఈ పేరుతో జరిగే దాడులకు తమ లక్ష్యం ఉగ్రవాదులే అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత డ్రోన్ దాడుల కర్తల పైన ఉండదు. ఎన్.జి.ఓ సంస్ధలు చెప్పే అంకెలన్నీ తప్పుల తడకలనీ, తమ దాడుల్లో ఎంతమంది చనిపోతున్నారో చెప్పగల సత్తా తమకు మాత్రమే ఉందని, బాధిత కుటుంబాలను విచారించడం ద్వారా వాస్తవ సంఖ్య తెలియదని అమెరికా విచిత్రమైన, తమకు మాత్రమే సాధ్యమైన, దురహంకారపూరితమైన వాదన చేస్తోంది.





