రాజకీయ నాయకుడు: ప్రొఫెసర్, ఈ ఉపగ్రహ ప్రయోగంలో కొద్ది మార్పులు చేసి అంగారకుడి పైన బంగారం నిల్వలు ఉన్నాయో లేదో కనిపెట్టేలా చెయ్యగలమా?
ప్రొఫెసర్ గారు నోరు తెరిచారు.
*** *** ***
భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) అంగారక గ్రహాన్ని చుట్టి రావడానికి PSL-XL ఉపగ్రహాన్ని పంపే ఏర్పాట్లలో చురుగ్గా ఉంది. వాస్తవానికి అక్టోబర్ 28 తేదీన ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని అనుకున్నారు. కానీ ఈ ప్రయోగం కోసం పసిఫిక్ మహా సముద్రంలో టెర్మినల్ ఏర్పాటు చేయడానికి బయలుదేరిన నౌకలు వాతావరణం అనుకూలించక నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి. దానితో ప్రయోగాన్ని మరో వారం రోజులు వాయిదా వేస్తున్నట్లు ఇస్రో మొన్న శనివారం ప్రకటించింది. ఇంకా తేదీ చెప్పలేదు గానీ ఈ ప్రయోగం తేదీ త్వరలోనే ఉంటుంది.
450 కోట్లు పెట్టి ఈ ప్రయోగం చేయడం శుద్ధదండగ అనీ ‘మేము కూడా ప్రయోగం చేశాం’ అని చెప్పుకోడానికి తప్ప ఎందుకూ పనికిరాదనీ విమర్శలు వచ్చాయి. ఇప్పటివరకూ రష్యా, అమెరికా, ఐరోపా దేశాలు కొన్ని మాత్రమే అంగారక గ్రహం చుట్టూ పరిభ్రమించడానికి ఉపగ్రహాలు పంపాయి. ఈ ఎలైట్ క్లబ్ లో చేరే ఉబలాటం తప్ప ఈ ప్రయోగం వల్ల ఉపయోగం లేదని విమర్శకుల భావన. కానీ ఇస్రో, ప్రభుత్వం మాత్రం గట్టిగా సమర్ధించుకుంటున్నారు.
చంద్రుడు, అంగారకుడు, ఆ తర్వాత సూర్యుడు తమ అంతరిక్ష పరిశోధనలకు లక్ష్యాలని కాబట్టి అంగారక ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనలో ఒక పెద్ద ముందడుగు అవుతుందని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ చెబుతున్నారు. ఇతర దేశాలు మనకంటే ఐదు రెట్లు ఖర్చు పెట్టి అంగారక ప్రయోగాలు నిర్వహిస్తున్నాయని మొత్తం బడ్జెట్ లో చూస్తే మన అంతరిక్ష ఖర్చు చాలా తక్కువనీ ఆయన తేల్చేశారు.
కానీ సామాన్య మానవుడికి దీనివల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నకు ‘గర్వ పడడం’ తప్ప మరొకటి లేదన్నదే సమాధానం అని ఆయన మాటలు చెబుతున్నాయి. టెక్నాలజిస్టుకు ఇది సవాలని, సైంటిస్టుకు అంగారకుడి గురించి తెలుసుకునేందుకు ఒక మహదవకాశం అని, సామాన్యుడికి ‘మన దేశం ఒక సంక్లిష్టమైన బృహత్కార్యాన్ని నిర్వహించగలిగిందన్న గర్వం’ దక్కుతుందని ఆయన చెబుతున్నారు.
అయితే రాధాకృష్ణన్ సామాన్యుడికి సంబంధించి ఒక ఉపయోగం ఉందన్న సంగతి మరిచిపోయారని కార్టూనిస్టు సూచిస్తున్నారు. అదే బంగారం తవ్వకాలు! అంగారక గ్రహం పైన ప్రయోగం జరుగుతోందని మన స్వామీ శోభన్ సర్కార్ కి ఇంకా తెలిసినట్లు లేదు. ఆయనకి చెబితే అర్జెంటుగా కల గనేసి అంగారక గ్రహంపై ఏ స్పాట్ లో బంగారం దొరుకుతుందో చెప్పగలరు. సరిగ్గా ఆ స్పాట్ లో మన ఉపగ్రహం ల్యాండ్ అయ్యేలా ఇస్రో శాస్త్రజ్ఞులు ఏర్పాట్లు చేశారంటే అమెరికా, రష్యా, ఐరోపాల కంటే మనమే ముందున్నామన్న గర్వంతో పాటు సంప్దలతో తులతూగే అదృష్టం కూడా సామాన్యుడికి పట్టొచ్చు.
మన పాలకులు సామాన్యుడిదాకా ఆ బంగారాన్ని రానిస్తాయా అని అడుగుతున్నారా? అదీ, నిజమే. ముందు బంగారం దొరికితే కనీసం బడ్జెట్ లోటు, కరెంటు ఖాతా లోటు అయినా తగ్గి ద్రవ్యోల్బణం తగ్గుతుంది కదా. ఆ విధంగా రూపాయి విలువ పెరిగి పరోక్షంగా అయినా సామాన్యుడికి లాభం దక్కవచ్చేమో!
ఏమో, గుర్రం ఎగరావచ్చు!

నాకు తెలిసినంత వరకు 450 కోట్లు ఖర్చులో 70% వరకు ఆమెరికన్/అభివృద్ది చెందిన దేశాల కంపెనీల దగ్గర హార్డ్ వేర్ / సాఫ్ట్ వేర్ కొనడానికి ఖర్చు పెట్టి వుంటాము. అందుకే అభివృద్ది చెందిన దేశాలు మన పరిశోధనలను మెచ్చుకుంటాయి! దినినే ప్రతీసారి “స్వదేశీ పరిజ్ణాణం” అని తెగ సంబడి పడిపోతుంటాము మనము తెలివి తక్కువగా!!.
నిజమే విశేఖర్ గారూ. గొప్పలు చెప్పుకోవడానికి తప్ప పెద్ద ప్రయోజనం లేని ప్రయోగాలు ఎవరి లాభం కోసం…?
@వాసవ్య గారూ… చాలా బాగా చెప్పారు . మీ వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లూ నిజం
అసలు ఇస్రోని నెలకొల్పడమే మనలాంటి దరిద్రపు దేశాలకు దండగ మారిన ఖర్చు. స్వదేశీ పరిజ్ఞానం శూన్యంలో నుంచి ఊడిపడాలని ఎదురుచూడటమే మంచిపని.
శరత్ గారూ, వ్యంగ్యం ఎంత సున్నితంగా ఉండవచ్చో మీ వ్యాఖ్యలో తెలుస్తోంది.