‘ఎద్దు ఈనింది అంటే దూడను కట్టెయ్యి’ అన్నాట్ట. మన జియోలాజికల్ సర్వే, ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళ తీరు చూడబోతే అలాగే ఉంది. ఒక ఆలయ పూజారి తనకు రాజు కలలో కనిపించి ఫలానా చోట బంగారం దాచి పెట్టానని చెప్పాడని చెప్పడంతోటే పలుగూ, పారా పట్టుకుని బయలుదేరిన జి.ఎస్.ఐ, ఎ.ఎస్.ఐ శాస్త్రవేత్తలను ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాకుండా ఉంది. ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ కు దాదాపు 150 యేళ్ళ ఘన చరిత్ర ఉన్నది. చరిత్ర తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో తగిన చారిత్రక ఆధారాల కోసం తవ్వకాలు జరిపితే అది వేరు. కానీ వెయ్యి టన్నుల బంగారం ఉందని తాను కలగన్నానని పూజారి చెప్పాకనే తవ్వకాలు జరపడం మొదలు పెడితే వారి మాటల్ని ఎలా నమ్మాలి?
లేఖలు
ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో గంగానది ఒడ్డున ఒన్న దాండియా ఖేడా గ్రామం తాజా సంచలనానికి కేంద్రంగా నిలిచింది. స్ధానికంగా ఉన్న శోభన్ దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న శోభన్ సర్కార్ కి కొద్ది వారాల క్రితం కల వచ్చిందిట. ఆ కలలో రాజా రావ్ రామ్ బక్ష్ కనిపించి తన కోట అడుగున వెయ్యి టన్నుల బంగారం దాచిపెట్టానని చెప్పారట. పొద్దున్నే లేచిన స్వామీ శోభన్ సర్కార్ తన కల గురించి తీవ్రంగా ఆలోచించారు. ఈ సంగతి వెంటనే ప్రభుత్వానికి చెప్పాలని తలపోశారు. తలపోయడమే కాక ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎ.ఎస్.ఐ), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జి.ఎస్.ఐ) తదితరులందరికీ తన కల గురించి లేఖలు రాసేశారు.
180 సంవత్సరాల క్రితం నిర్మించిన అక్కడి శివాలయం పక్కనే ఒక పాడుపడిన కోట ఉంది. 19 వ శతాబ్దంలో రాజా రావ్ రామ్ బక్ష్ సింగ్, దాండియా ఖేడా గ్రామంలో దానిని నిర్మించాడు. స్ధానిక రాజు అయిన రావ్ రామ్ బక్ష్ సింగ్ 1857 లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. తిరుగుబాటులో పాల్గొన్నందుకు బ్రిటిష్ పాలకులు ఆయన్ని ఆ కోటలోనే ఉరి తీసి ఆయన రాజభవనాన్ని పాక్షికంగా కూల్చేశారు. ఆ భవనం కిందనే తాను బంగారం దాచిపెట్టానని శోభన్ సర్కార్ కి చెప్పారన్నమాట!
శోభన్ సర్కార్ రాసిన లేఖలకు బదులు రాలేదు. దానితో ఆయన కేంద్ర మంత్రి చరణ్ దాస్ మహంత్ ని కలిశారు. చరణ్ దాస్ ఛత్తీస్ ఘర్ రాష్ట్రానికి చెందినవారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలకు సహాయ మంత్రిగా ఉన్నారు. శోభన్ సర్కార్ చెప్పిందే తడవుగా సెప్టెంబర్ 22, అక్టోబర్ తేదీల్లో సదరు గ్రామాన్ని సందర్శించారు. కాన్పూరుకు చెందిన ఒక పండిట్ జీ దాండియా ఖేడాలో దాగిన నిధుల గురించి తరచూ చెప్పేవారని మంత్రి స్ధానిక పత్రికలకు చెప్పినట్లు ఇండియా టుడే తెలిపింది. కాన్పూర్ పండిట్ జీ, స్వామీ శోభన్ సర్కార్ ఇద్దరూ ఒకరా కాదా అన్నది తెలియలేదు. ఒకరే కాకపోతే కలగన్న శోభన్ ని వదిలి దూరంగా కాన్పూర్ లో ఉన్న పండిట్ కి క్రెడిట్ ఇవ్వడం ఏమిటి? శోభన్ సర్కార్ నొచ్చుకోరా?
సందడే సందడి
రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు మొత్తం మీద మంత్రివర్యులు ఎ.ఎస్.ఐ, జి.ఎస్.ఐ లకు ఏం చెప్పి ఒప్పించారో గానీ తవ్వకాలకు బృందాలను పంపడానికి ఒప్పించారు. అక్టోబర్ 12 తేదీన ఈ రెండు విభాగాల బృందాలు దాండియా ఖేడా గ్రామానికి విచ్చేశాయి. డ్రిల్లింగ్ మిషన్లతో పనికి ఉపక్రమించారు. ఎక్కడ మొదలు పెట్టాలా అని వారు మల్లగుల్లాలు పడుతుంటే ‘ఇదిగో ఫలానా చోట’ అని శోభన్ సర్కారే చూపించారట. ఆయన చెప్పిన చోటనే వారు డ్రిల్లింగ్ మొదలు పెట్టారు. 20 మీటర్లు డ్రిల్లింగ్ చేశాక భూమికి సంబంధం లేని వస్తువేదో గట్టిగా తగిలింది. అయితే అది బంగారమో కాదో అప్పుడే చెప్పలేమనీ, ఇంకా అనేకమంది ఇతర విభాగాల బృందాలు, నిపుణులు స్ధలాన్ని సందర్శించి తవ్వకాలు జరపాలని నిర్ణయించారని అందుకే తవ్వుతున్నామని ఎ.ఎస్.ఐ సూపర్ వైజర్ దీపక్ చౌదరి పత్రికలకు చెప్పారు. అక్టోబర్ 18 నుండి పూర్తిస్ధాయి తవ్వకాలను ఎ.ఎస్.ఐ వాళ్ళు ప్రారంభించారు.
ఎ.ఎస్.ఐ, జి.ఎస్.ఐ లు ఒకవైపు తవ్వకాలు జరుపుతుండగా మరోవైపు చుట్టుపక్కల గ్రామాల్లో కొత్తరకం సందడి చొరబడింది. శోభన్ సర్కార్ పేరు మారుమోగిపోతోంది. ఇప్పుడాయన అక్కడ ఒక సెలబ్రిటీ. గతం నుంచే ఆయన మాట పైన స్ధానికులకు మంచి గురి. బంగారం నిధుల గురించిన కల దరిమిలా సాక్ష్యాత్తూ కేంద్ర ప్రభుత్వమే తవ్వకాలకు సిద్ధం కావడంతో శోభన్ సర్కార్ పేరు అక్కడ ఒకటే ప్రతిధ్వనిస్తోంది. నిధులు నిజంగానే దొరికితే తమ గ్రామం భవిష్యత్తు ఎంత అందంగా ఉండబోతోందో అని దాండియా ఖేడా ప్రజలు అందంగా ఊహలు నిర్మించుకుంటున్నారు. నిధుల్లో 20 శాతం తమ గ్రామానికే దక్కాలని శోభన్ సర్కార్ కూడా ఆజ్ఞ వేశారు మరి! పని వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి స్ధిరపడిన గ్రామస్ధులు కూడా ఇప్పుడు గ్రామానికి వచ్చేస్తున్నారట.
శోభన్ శాపం
“ఎ.ఎస్.ఐ, జి.ఎస్.ఐ అధికారులు ఈ నెల మొదటివారం నుండి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ ఏరియా 60 ఎకరాల వరకు విస్తరించి ఉండడంతో ఎక్కడ తవ్వాలో తెలుసుకోవడంలో వారు విఫలం అయ్యారు. తర్వాత నేనే వారితో వెళ్ళి ఎక్కడ తవ్వాలో చూపించాను. అక్కడ రెండు చోట్ల డ్రిల్లింగ్ చేశారు. పెద్ద మొత్తంలో బంగారం దొరికే అవకాశం ఉందని వాళ్ళూ గ్రహించారు” అని శోభన్ సర్కార్ చెప్పినట్లు పత్రికలు (ఇండియా టుడే, ది హిందు) చెప్పాయి. “ఎ.ఎస్.ఐ వాళ్ళు 1000 టన్నుల బంగారం దొరికే చోటికి వెళ్లగలరు. కానీ నా గురువుల అనుమతి లేకుండా వాళ్ళు ఆ నిధిని తాకడానికి వీలు లేదు. నా సూచనను వాళ్ళు పాటించకపోతే గనక ఆ బంగారం అక్కడి నుండి మాయమైపోతుంది” అని కూడా శోభన్ సర్కార్ చిన్నపాటి శాపం కూడా ఇచ్చేశారు.
చారిత్రక స్ధలం
దాండియా ఖేడా గ్రామం చారిత్రక స్ధలం అని తెలుస్తోంది. భారత పురావస్తు పరిశోధనలకు తండ్రిగా చెప్పే సర్ అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ దాండియా ఖేడా, ప్రాచీన స్ధలం హయముఖ ఒకటేనని గుర్తించారు. 7 వ శతాబ్దంలో భారత దేశం సందర్శించిన ప్రముఖ చైనా యాత్రీకుడు ‘హువాన్ సాంగ్,’ తాను హాయముఖను సందర్శించినట్లు తన రచనల్లో రాశారు. హయముఖ వద్ద ఐదు బౌద్ధమత ఆరామాలు ఉన్నాయని, ‘సమ్మతీయ శాఖ’ కు చెందిన భౌద్ధ సహోదరులు అక్కడ ఉన్నారని ఆయన రాశారు. భౌద్ధమతంలోని ఐదు ప్రముఖ శాఖల్లో సమ్మతీయ శాఖ ఒకటని తెలుస్తోంది.
అనంతర కాలంలో దాండియా ఖేడా ను, బైస్ రాజపుత్రులు తమ రాజధానిగా చేసుకున్నారని, తమ వంశనామం కలిసొచ్చే విధంగా రాయబరేలి లోని బైశ్వరం కు ఆ పేరు ఇచ్చింది వారేనని కన్నింగ్ హామ్ రాశారు. మొగలులు తమ కాలంలోని బైస్ రాజపుత్రులను భలే సుల్తాన్ (ఈటెల రాజులు -ఈటెల వలే పదునైన పోరాట వీరులు అనే అర్ధంలో) అని పిలిచారని కన్నింగ్ హామ్ తెలిపారు. బైస్ రాజపుత్రులు అందమైన దుస్తులు ధరించేవారని, మంచి ఇళ్ళలో నివసించేవారని పేరుతో పాటు విపరీతమైన సంపదలకు కూడా పేరు గాంచారని పురావస్తు చరిత్రకారుడు కన్నింగ్ హామ్ రాసినట్లు తెలుస్తోంది. బహుశా వారి నుండి వచ్చిన సంపదనే రావ్ రామ్ బక్ష్ సింగ్ తన కోటలో దాచి పెట్టారన్న నమ్మకం తరాల వెంట అందుతూ వచ్చి ఉండవచ్చు.
బంగారం ఉన్నదంటూ తనకు కలలో కనిపించి చెప్పాడని శోభన్ సర్కార్ చెప్పినప్పటికీ వాస్తవానికి ఆ నమ్మకం గురించి ఆ ప్రాంతంలో అందరికీ తెలిసిన విషయమే. కోటకింద బంగారం నిధులున్నాయని అక్కడి వాడుక. ఈ వాడుకకు ఒక స్వామీజీ కల, ప్రభుత్వం సహకారం తోడు కావడంతో అది కాస్తా నెరవేరబోతున్న కలగా రూపుదాల్చింది. శుక్రవారం మొదలయిన తవ్వకాలు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజులు తవ్వకాలు జరిపితే తప్ప లోపల ఉన్నది బంగారమా లేక వెండా లేక ఇనుమా అనేది తేలే అవకాశం లేదు. కనీసం 20 రోజులయినా తవ్వకాలు చేయాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. మామూలుగా గొయ్యి తవ్వడం అయితే అన్నీ రోజులు అవసరం లేదు. పురావస్తు తవ్వకాలు ఒక పద్ధతి ప్రకారం పురావస్తు అవశేషాలకు నష్టం జరగకుండా జరుగుతాయి. బహుశా అందుకే 20 రోజులు పట్టొచ్చని నిపుణులు చెప్పి ఉంటారు. బంగారం కాకుండా చారిత్రక అవశేషాలు ఉన్నాయన్న సంగతి నిర్ధారణ అయినా తవ్వకాలు మరిన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది.
స్వామి చెప్పాడని కాదు
శోభన్ సర్కార్ ప్రోద్బలం, మంత్రి ఒత్తిడితోనే తవ్వకాలు మొదలయ్యానేది దాదాపు అన్నీ పత్రికలూ చెబుతున్న విషయం. అయితే ఎ.ఎస్.ఐ మాత్రం తాము బంగారం కోసం తవ్వకాలు జరపడం లేదనీ నిపుణుల సూచనలు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే తవ్వకాలు చేపట్టామని ఎ.ఎస్.ఐ అధికారులు చెబుతున్నారు. గ్రామస్ధులు మాత్రం బంగారం దొరకడం తధ్యమని గాఢంగా నమ్ముతున్నారు.
“అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎ.ఎస్.ఐ 150 సంవత్సరాల చరిత్ర ఉన్న వృత్తి నైపుణ్య సంస్ధ. కాబట్టి దేవాలయం ప్రధాన పూజారి బంగారం గురించి కలగనడం వల్లనే ఎ.ఎస్.ఐ తవ్వకాలు మొదలుపెట్టిందన్న వార్తలు పూర్తిగా అర్ధరహితం. నిజం ఏమిటంటే భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి ఒక సమగ్ర నివేదిక అందుకుంది. శిధిలాల కింద లోహాలు ఉండవచ్చని ఆ నివేదిక తెలిపింది” అని ఎ.ఎస్.ఐ అడిషనల్ డైరెక్టర్ డి.ఆర్.మణి అన్నారని ది హిందు తెలిపింది.
తవ్వకాల్లో నిధి దొరికితే అది రాజా రావ్ రామ్ బక్ష్ కి చెందినదేనా అన్న ప్రశ్నకు మణి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. “వేచి చూడాలి. కానీ చరిత్ర పుస్తకాల ప్రకారం బ్రిటిష్ వాళ్ళు 1857లో ఇక్కడ ఉన్న రాజా రామ్ బక్ష్ సింగ్ కోటను కూల్చివేశారు. ఆయనే చివరి రాజు. కానీ ఇక్కడ నిధులు ఉన్నాయా లేవా అన్న విషయంలో ఎ.ఎస్.ఐ కి ఆసక్తి లేదు. ఈ స్ధలానికి చారిత్రక ప్రాముఖ్యత ఉన్నది, అందుకే మా ఆసక్తి” అని మణి తెలిపారు. అయితే ఈ ఆసక్తి ఇన్నాళ్ళు ఏమయిందన్నదే అసలు ప్రశ్న. శోభన్ సర్కార్ బంగారు కలకు ముందు కూడా అవే చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. అవి కొత్తగా వచ్చినవి కావు. గతంలో లేని ఆసక్తి ‘బంగారం కల’ తర్వాతే ఎందుకు జనించినట్లు?
శోభన్ రెండో కల
శోభన్ సర్కార్ ఒక కలతోనే ఆగిపోలేదు. దాండియా ఖేడా పక్కనే ఉన్న మరో గ్రామం ఆదంపూర్ లో కూడా బంగారం ఉన్నట్లు తనకు కల వచ్చిందని శోభన్ సర్కార్ మరోసారి ‘కల’కలం సృష్టించాడు. శోభన్ సర్కార్ శిష్యుడు స్వామి ఓం ఈ రెండో కల గురించి బైటికి చెప్పాడు. ఈసారి ఏకంగా 2,500 టన్నుల బంగారం ఉన్నట్లు కలగన్నాడని పత్రికలు తెలిపాయి. దాండియా ఖేడా గ్రామంలో కంటే ఆదంపూర్ గ్రామంలో నిధుల్ని వెలికి తీయడం ఇంకా సులభం అని శోభన్ చెప్పారని స్వామి ఓం చెబుతున్నారు. ఈ మేరకు ఆదంపూర్ లోనూ తవ్వకాలు చేయాలని ఆయన జిల్లా అధికారులకు మహాజరు సమర్పించాడు.
ఆదంపూర్ తవ్వకాల కోసం జి.ఎస్.ఐ నుండి బృందాలను పంపాలని తాను ప్రభుత్వానికి సిఫారసు చేశానని జిల్లా మేజిస్ట్రేట్ అభయ్ కుమార్ అప్పుడే పత్రికలకు చెప్పేశాడు కూడా. శోభన్ సర్కార్ రెండో కల గురించి తెలుసుకున్న కొంతమంది రాత్రికి రాత్రే ఆదంపూర్ లో తవ్వకాలు జరిపారట. వాళ్ళకి ఏమైనా దొరికిందో లేదో గానీ పోలీసులు మాత్రం అక్కడ కాపలా కాస్తున్నారు. శివాలయంకు చెందిన గంగా ఘాట్ వద్ద దాదాపు 3 అడుగుల వెడల్పు 4 అడుగుల లోతు గొయ్యి తవ్వారని పోలీసులను కాపాలాకు నియమించామని అధికారులు చెబుతున్నారు.
సాధారణ వ్యక్తులు ఇలాంటి కలలు ఎన్నో కానీ ఉంటారు. డబ్బుతోనే సకల కోరికలు, సుఖాలు ముడి పడి ఉన్నపుడు మనిషి సహజంగానే డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తక్కువ పరిమాణంలో ఎక్కువ విలువ కలది కాబట్టి బంగారం కూడా డబ్బు ఆకర్షణీయ వస్తువు. డబ్బు దొరికినట్లు, బంగారం దొరికినట్లు, లాటరీ తగిలినట్లు… ఇలాంటి కలలు సామాన్యులకు చాలా సహజం.
ఉదాహరణకి ‘ఆకలి రాజ్యం’ సినిమా గుర్తుంటే… అందులో ఒక నిరుద్యోగికి ఎక్కడ చూసినా రూపాయి నాణేలు దొరికినట్లు కల వస్తుంది. పెరట్లో నడుస్తుంటే ఒక రూపాయి కనపడుతుంది. అది తీసుకోవడానికి వంగితే ఇంకో రూపాయి కనపడుతుంది. ఆ రూపాయి తీసుకోబోతే ఇంకో రూపాయి సగం నేలలోకి వెళ్ళి కనిపిస్తుంది. దానికోసం తవ్వితే రూపాయిలు వరుసగా బైటికి వస్తూ ఉంటాయి. ఉద్యోగం కోసం ఢిల్లీ చేరి ఉద్యోగాలు దొరక్క, ఆకలితో పస్తులుంటూ బతికే నిరుద్యోగికి తన ఆకలి తీర్చే రూపాయి దొరికినట్లు కలగనడం సహజంగానే చూడాలి. దాన్ని పట్టుకుని ఆ నిరుద్యోగి పెరట్లో తవ్వకాలు మొదలు పెడితే పిచ్చోడిని చూసినట్లు చూస్తారు. (ఆ సినిమాలో ఆ నిరుద్యోగి చివరికి పిచ్చోడే అవుతాడు.) నాకు చిన్నప్పుడు చాలా గోలీలు దొరికినట్లు తెగ కలలు వచ్చేవి. ఎందుకంటే నాకు గోలీలాట సరిగ్గా రాదు. ఎప్పుడు చూసినా ఆటలో గోలీలు పోగొట్టుకోవడమే నా పని. పైగా గోలీలు కొనడానికి మా నాన్న అసలు డబ్బు ఇచ్చేవాడు కాదు. ఆ విధంగా గోలీలపై తీరని ఆశ కలలో తీరేది.
కానీ ఇక్కడ కలగన్నది ఒక స్వామీజీ లేదా శివాలయం ప్రధాన పూజారి. శంఖంలో పోస్తే మామూలు నీరే తీర్ధం అవుతుంది. నిరుద్యోగి కన్న కలనే ఒక స్వామీజీ కనేసరికి అద్భుతం అయిపోయింది. దానికి చారిత్రక స్ధలం జత కలిసేసరికి సమర్ధించుకోవడానికి కారణం కూడా దొరికింది. ఈ సందర్భంగానయినా మూఢనమ్మకాలు పారద్రోలే చారిత్రక వాస్తవాలు బైటపడితే ఆమేరకు ఎ.ఎస్.ఐ మాటలు నిజాలవుతాయి. ఖర్మకాలి కాసింత బంగారం దొరికిందా, ఇక ప్రభుత్వాలకు మూడినట్లే. దేశంలో బాబాలకు, గురువులకు, సాధువులకు కొదవలేదు. వాళ్ళంతా కలలు కనడం మొదలు పెడితే ఇక ఖజానా సోమ్మంతా తవ్వకాలకే సరిపోదా మరి?
















is that swamy measured 1000 tonnes of gold, how he told it is 1000, 2500 tonnes, rubbish. what if it becomes true, omg tough to expect media halchal then
సరిపోయింది! ఇంతోటి శాస్త్రప్రగతీ, ఇంతడేసి చదువులూ ఒక స్వామి/మోస గాడి చేతిలో చచ్చుదెబ్బతిన్నాయన్నమాట. అందుకేమరి చదువుకున్నంతమాత్రాన బుఱ్ఱలెదిగినట్లుకాదు. ఈ అర్ధంలేని నమ్మకాలొదలనంతకాలం అక్షరమ్ముక్క తెలియకపోయినా అదే పెట్టుబడిగా ఇలాంటివాళ్ళందరూ చెవుల్లో క్యాబేజీలు మొలిపించగలుగుతారు.
పిచ్చిముదిరింది!నాకు ఓ సినిమా డైలాగ్ గుర్తుకు వస్తొంది”ఎవరికీ లాజిక్స్ అక్కరలేదు అందరికీ మాజిక్స్ కావాలి,అందుకే మనదేశంలో శాస్త్రవేత్తలకు కన్నా స్వామిజీలకు ప్రాచూర్యం ఎక్కువ!”