ఎలాగైతేనేం, ప్రధానీ నెంబర్ 1 అయ్యారు! -కార్టూన్


No. 1

భారత దేశంలో అత్యున్నత అధికార పీఠం ప్రధాన మంత్రి పదవి. రాష్ట్రపతిని ప్రధమ పౌరుడిగా చెప్పినా రాజ్యాంగం ఆయన చేతుల్లో అధికారాలు ఏమీ ఉంచలేదు. ఉన్న అధికారాలు అలంకార ప్రాయం మాత్రమే. కేబినెట్ సలహాను పాటించడమే ఆయనకి ఉన్న అధికారం. ప్రతి చట్టం పైనా ఆయన సంతకం అయితే ఉండాలి గానీ, నిర్ణయం మాత్రం కేబినెట్, దాని అధినేత అయిన ప్రధాని చేతుల్లోనే ఉంటుంది. అంటే ఆచరణ, అధికారాల రీత్యా ప్రధాన మంత్రే నెంబర్ 1.

కానీ మన్మోహన్ సింగ్ మాత్రం పదేళ్లుగా ప్రధాని పీఠంపై కూర్చున్నా అసలు అధికారాన్ని మాత్రం ఆయన అనుభవించలేకపోయారని పత్రికలు తరచూ చెప్పే మాట! ప్రతిపక్షాల విమర్శ కూడా అదే. ‘కాదు, కాదు. నిర్ణయాలన్నీ నావే’ అని ప్రధాని అప్పుడప్పుడూ చెప్పినా ‘నా చెప్పుల్లో కాళ్ళు దూర్చడానికి రాహుల్ ఎప్పటికీ ఆహ్వానితుడే’ అని చెప్పడం ద్వారా అసలు విషయాన్ని ఆయనే చెబుతుంటారు. ఇటీవల నేరస్ధ నాయకులను కాపాడే ఆర్డినెన్స్ ను ‘నాన్సెన్స్’ గా కొట్టిపారేసి, దాన్ని రద్దు చేయించడం ద్వారా రాహుల్ ఎవరు ‘ఇన్-ఛార్జో’ చెప్పకనే చెప్పారు.

బొగ్గు కుంభకోణం పుణ్యాన ప్రధాని అసలైన నెంబర్ 1 గా బిరుదు పొందారని, అలాగయినా నెంబర్ 1 స్ధానం దక్కినందుకు ఆయన సంతోషిస్తున్నారని కార్టూన్ సూచిస్తోంది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పరఖ్, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా ల పేర్లను సి.బి.ఐ చార్జిషీటులో చేర్చినందుకు స్పందిస్తూ “మేము కుట్రదారులం అయితే ప్రధాని కుట్రదారు కాకుండా ఎలా పోతారు? మా సూచనలపై అంతిమ నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రే నెంబర్ 1 కుట్రదారు” అని నొక్కి వక్కాణించారు.

ఆ విధంగా ప్రధాన మంత్రి మన్మోహన్ ఏదో ఒక కేటగిరీలో నెంబర్ 1 స్ధానాన్ని కైవశం చేసుకున్నారు. విక్టరీ స్టాండు పైన నెంబర్ 1, 2 స్ధానాలపై నిలబడి ఉన్న సోనియా, రాహుల్ గాంధీలు మొఖం మాడ్చుకుని చూస్తుండడం చూపరుల దృష్టినుండి దాటిపోకూడని విషయం. నెంబర్ 1 స్ధానం పైన రాహుల్ అప్పుడే కాస్త పీఠాన్ని ఆనించి ఉంచారు కూడాను. ‘ప్రధాని, ఇన్ వెయిటింగ్’ అన్నమాట!

వ్యాఖ్యానించండి