అమెరికా: ఒక్క రోజులో 328 బిలియన్ల అప్పు


న్యూయార్క్ లో అక్టోబర్ 15, 2013 న నేషనల్ డెట్ క్లాక్ రీడింగ్

న్యూయార్క్ లో అక్టోబర్ 15, 2013 న నేషనల్ డెట్ క్లాక్ రీడింగ్

ఋణ పరిమితి పెంపుకు అంగీకరిస్తూ అమెరికా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య కుదిరిన ఒప్పందం చట్టంగా మార్చుతూ ఒబామా సంతకం చేసిన అనంతరం ఒక్క రోజులోనే అమెరికా 328 బిలియన్ డాలర్ల అప్పు చేసింది. ఇది దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలకు సమానం. అనగా 2013-14 ఆర్ధిక సంవత్సరానికి మన వార్షిక బడ్జెట్ అయిన 16.65 లక్షల కోట్ల రూపాయల కంటే 3.35 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ.

ఒబామా కేర్ పధకానికి నిధుల కేటాయింపు ఒక యేడు వాయిదా వేస్తే తప్ప ఋణ పరిమితి పెంచడానికి ఒప్పుకునేది లేదని హఠాయించిన రిపబ్లికన్ పార్టీ తీరా ఒప్పందంలో అసలు పరిమితే విధించలేదు. మళ్ళీ ఫిబ్రవరి 7 గడువు వచ్చేలోపు ఎంత అప్పయినా తీసుకునే అవకాశం ఈ ఒప్పందం ద్వారా ఒబామా ప్రభుత్వానికి వచ్చేసింది.

అనగా: అప్పు పరిమితికి మించి తీసుకోడానికి రిపబ్లికన్ పార్టీకి అభ్యంతరం లేదన్నమాట! ఆ పార్టీ అభ్యంతరం అల్లా ‘ఒబామా కేర్’ ద్వారా వచ్చే రాజకీయ ప్రతిష్ట ప్రత్యర్ధి పార్టీకి దక్కకూడదనేనా? అమెరికా అగ్ర ధనికుడు వారెన్ బఫెట్ అన్నట్లు ఋణ పరిమితి అనేది కేవలం రాజకీయ లాభాలు నెరవేర్చుకునేందుకు వినియోగించే ఉపకరణం మాత్రమేనా?

అక్టోబర్ 18 తేదీన అమెరికా చేసిన రికార్డు స్ధాయి తప్పు గత రికార్డును తిరగరాసింది. రెండేళ్ల  క్రితం అమెరికా ఒక్క రోజులోనే 238 బిలియన్ డాలర్లు అప్పు చేసిందని, ఆ రికార్డు ఇప్పుడు బద్దలయిందని రష్యా టుడే తెలిపింది. తాజా అప్పుతో అమెరికా రుణం 17.075 ట్రిలియన్ (= లక్ష కోట్లు) డాలర్లకు చేరుకుందని ట్రెజరీ డిపార్టుమెంటు అక్టోబర్ 18 తేదీన తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన సమాచారం ద్వారా తెలిపింది.

ఒక్కరోజులోనే 328 బిలియన్ డాలర్ల అప్పు చేసేంత అవసరం అమెరికాకు ఎందుకొచ్చింది? నిజానికి ఇది ఒక్క రోజు అవసరం కాదు. గత ఐదు నెలలుగా అమెరికా ఉగ్గబట్టుకున్న ఖర్చు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వం తన విశేషాధికారాలను వినియోగించి ప్రత్యేక చర్యలు చేపట్టడం ద్వారా ఋణ పరిమితి 16.7 ట్రిలియన్లు దాటకుండా చూసుకుంటూ వచ్చింది. తన అవసరాలను ప్రత్యేక ఉపకరణాల ద్వారా తీర్చుకుంటూ వచ్చింది. ఖాళీ అయిన ఆ ఉపకరణాలను మళ్ళీ నింపడం కోసమే ఒక్కరోజులోనే ఇంత భారీ అప్పు చేసింది.

ఇంకా అనగా: అమెరికా ఋణ పరిమితి 16.7 ట్రిలియన్ల గీత అక్టోబర్ 17 తేదీన దాటడం కాదు, ఐదు నెలల క్రితమే ఆ గీత దాటేశారు. కానీ అవసరాల్ని అత్యవసర పరిస్ధితుల్లో మాత్రమే వినియోగించే విశేష అధికారాల (ఉపకరణాల)తో తీర్చుకుంటూ వచ్చారు. ఆ ఉపకరణాలు కూడా నిండుకున్న తర్వాతే అసలు సంగతి చెప్పకుండా ఋణ పరిమితి ‘దాటనున్నామంటూ’ కాక పుట్టించి రిపబ్లికన్లను దారికి తెచ్చుకున్నారు. నిజానికి ‘రిపబ్లికన్లను దారి తెచ్చుకోవడం’ అనేది పెద్ద మాట. ఎందుకంటే ‘కంపెనీల కోసం’ దారికి రావడానికి వారికి అభ్యంతరం ఏమీ ఉండదు.

పాలకపక్షాన్ని రాజకీయంగా దెబ్బకొట్టాలని రిపబ్లికన్ పార్టీ చేసిన ప్రయత్నమే ‘అక్టోబర్ 17’ సంక్షోభం. కానీ దానివలన ఆ పార్టీ ప్రతిష్టే దెబ్బతినక తప్పలేదు. ఆఫ్ కోర్స్! ప్రతిష్ట దెబ్బతినడం రాజకీయ పార్టీలకు పెద్ద విషయం కాదు. మరో సందర్భంలో ప్రత్యర్ధి ప్రతిష్టని దెబ్బతీస్తే తమ ప్రతిష్ట పెరగడం ఎలాగూ అనివార్యమే! సొంత ప్రతిష్ట కంటే దెబ్బతిన్న ఎదుటివాడి ప్రతిష్ట పైన ఆధారపడే కదా ఎన్నికల ప్రహసనంలో ప్రభుత్వాలు తరచుగా ఎన్నికవుతోంది!

వాషింగ్టన్ టైమ్స్ పత్రిక ప్రకారం ఐదు నెలలపాటు విశేష అధికారాలతో అవసరాలు గడిపిన ప్రభుత్వం అప్పు చేయడానికి చట్టబద్ధ అవకాశం వచ్చినవెంటనే విశేష ఉపకరణాలను మళ్ళీ నింపి దాన్ని కాస్తా అప్పు కింద జమ చేసేసింది. దానితో ఒక్క రోజులోనే అమెరికా రుణం 328 బిలియన్లు పెరిగి అసలు గుట్టు విప్పింది.

రష్యా టుడే ప్రకారం ‘అసాధారణ పరిస్ధితుల’ పేరుతో మే నెలలోనే ట్రెజరీ డిపార్టుమెంటు 400 బిలియన్ల రుణం సేకరించింది. కానీ దానిని రుణం కింద చూపకుండా విశేష ఉపకరణాల ఖాతాలో ఉంచుకుంది.

వాషింగ్టన్ టైమ్స్ ఇలా చెబుతోంది: “సాధారణంగా కాంగ్రెస్, రుణంపై పరిమితి విధిస్తుంది. ప్రభుత్వం తెచ్చుకునే రుణాన్ని ఆ విధంగా కాంగ్రెస్ నియంత్రిస్తుంది. కానీ (అక్టోబర్ 17) ఒప్పందంలో ఋణ పరిమితి విధించే బదులు కాలపరిమితి విధించింది. అనగా ఫిబ్రవరి 7 లోపల ప్రభుత్వం ఎంత వ్యయం చేస్తే అంతా అప్పు కింద చేరిపోతుంది.”

గత అయిదు నెలల ధోరణే కొనసాగితే ఫిబ్రవరి 7 గడువు లోపు రుణం 700 బిలియన్ డాలర్ల మేరకు పెరగవచ్చని వాషింగ్టన్ టైమ్స్ పత్రిక అంచనా వేసింది. ప్రభుత్వ మూసివేత ద్వారా పాలనా వ్యవస్ధను బందీగా చేసుకుందని, ప్రజోపయోగ చట్టం ఒబామా కేర్ ను విషం కక్కుతోందని సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న రిపబ్లికన్ పార్టీ చివరికి అప్పుపై పరిమితి విధించకుండా విమర్శకులను, జనాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వ్యాఖ్యానించండి