ఫుకుషిమా: అణువు చిదిమేసిన జ్ఞాపకం -ఫోటోలు


అణువు ఎంతని? కంటికి సైతం కనపడని అణువు ‘ఇంతింతై, వటుడింతింతై’ అన్నట్లుగా విశ్వరూపం దాల్చింది. ఫుకుషిమా జనానికి జ్ఞాపకాన్ని కూడా భయపెట్టే భూతంలా మార్చివేసింది. అలా పొద్దున్నే నడిచి వెళ్ళిన రోడ్డూ, పెరట్లో ఇష్టంగా పెంచుకున్న మొక్కా, జీవిత పర్యంతం కష్టించి ఆర్జించుకున్న ఇల్లూ, చివరికి తనను తాకిన పాదానికి ధరణీ మాత ఇష్టంతో అద్దిన ధూళీ అన్నీ ఇప్పుడు అణు రక్కసి కోరల్లో చిక్కి పెను భూతాలుగా మారాయి.

2011 మార్చి 11 తేదీన మానవుడి దురాశతో ఆగ్రహించిన ప్రకృతి భీభత్సంగా చెలరేగి భూకంపం, సునామీలతో విరుచుకుపడడంతో పది వేల మందికి పైగా చనిపోయారు. ఇంకా అనేకమంది ఆచూకీ గల్లంతయింది. ఇదంతా ఒక ఎత్తయితే సునామీ, భూకంపాల ధాటికి పేలిపోయిన ఫుకుషిమా అణు కర్మాగారం అణు కర్మాగారాలు సృష్టించిన విలయం మరో ఎత్తు. రియాక్టర్ల పేలుడు వల్ల రేడియేషన్ పెద్ద ఎత్తున విడుదల కావడంతో దాదాపు 1,60,000 మందిని ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలించారు. ఫలితంగా ఫుకుషిమా ఇప్పుడు ఒక ‘ఘోష్ట్ సిటీ’.

రేడియేషన్ విడుదలను అరికట్టడంలో అణు కర్మాగారం యజమాని టెప్కో, ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో ఫుకుషిమా మానవ నివాసానికి శాశ్వతంగా మూసుకుపోయింది. దాదాపు 30 సంవత్సరాల పాటు పట్టే క్లీనింగ్ ప్రక్రియకు ఆదిలోనే హంసపాదు ఎదురయింది. కరిగిపోయిన అణు ఇంధనంతో కూడిన నీటిని భారీ ట్యాంకర్లలో భద్రపరిచామని చెప్పిన టెప్కో, ఆ ట్యాంకర్లు కూడా పెద్ద ఎత్తున లీక్ అవుతుండడంతో దాదాపు చేతులెత్తేసింది.

‘ఫుకుషిమా షట్ డౌన్’ కు ఇప్పుడు టెప్కో, ప్రభుత్వాల వద్ద కూడా స్పష్టమైన ప్రణాళిక లేదు. ఫలితంగా అణు ధార్మికత ప్రమాదకరంగా ఫుకుషిమా గాలి, నీరు, మట్టి అన్నింటినీ కలుషితం చేస్తోంది. రేడియేషన్ ప్రమాదం ఎంత ప్రమాదకరంగా ఉన్నదంటే చివరికి మట్టిని కూడా కూడా భద్రంగా మూటలు కట్టి రేడియేషన్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్ధితి.

ఇప్పుడు ఫుకుషిమాలో మానవమాతృడంటూ లేడు. అణు కర్మాగారానికి చుట్టూ 20 కి.మీ పరిధిలో ఉన్న అందరినీ ఖాళీ చేసి తరలించారు. ఒకప్పుడు మనిషి అక్కడ నివసించాడు అనేందుకు మాసిపోయిన ఇళ్ళు, మూసుకుపోయిన దారులు, పిచ్చి మొక్కలతో నిండిన రోడ్లు మాత్రమే మిగిలాయి. ఇటీవల ఫుకుషిమా సందర్శించిన రాయిటర్స్ విలేఖరి దమీర్ సగోల్జ్, ఈ ఫోటోలను బయటి ప్రపంచానికి అందించగా, బోస్టన్ పత్రిక ప్రచురించింది.

వ్యాఖ్యానించండి