ప్రధాని సేవ ప్రజలకు కాదు, ప్రభు వర్గాలకు -కార్టూన్


Please refrain

మంత్రి: దయచేసి అలాంటి దాడులు చేయకుండా సంయమనం పాటించండి. మన దేశ పెట్టుబడి వాతావరణానికి అది నష్టకరం- గౌరవనీయులైన పారిశ్రామికవేత్తలను గాయపరిస్తే…

ప్రధాని: ?!

———————————

ప్రధాన మంత్రి మన్మోహన్ గారికి ప్రభుత్వం లోనూ, కాంగ్రెస్ లోనూ ఉన్న గౌరవం ఏపాటిదో వివరించే ఉదాహరణలు కోకొల్లలు. సోనియా గాంధీ విదేశీయత ప్రధాని పదవికి అడ్డు రావడం, పి.వి.నరసింహారావు ఏలుబడిలో భారత దళారీ పెట్టుబడిదారులకు, విదేశీ సామ్రాజ్యవాదులకు నమ్మకంగా సేవలు చేయడం ద్వారా సాధించిన పలుకుబడి అచ్చిరావడంతో దేశ అత్యున్నత అధికార పదవిని మన్మోహన్ అధిరోహించగలిగారు. ప్రధానిగా మన్మోహన్ ఎంపిక సోనియా గాంధీ తన ప్రతిపక్ష ప్రత్యర్ధులపై విసిరిన ‘మాస్టర్ స్ట్రోక్’ గా అప్పట్లో కొందరు అభివర్ణించారు.

సదరు మాస్టర్ స్ట్రోక్ ప్రతిపక్షాల పైనా లేక నేరుగా తనమీదనేనా అని తర్కించుకోవాల్సిన అవసరం మన్మోహన్ కి వచ్చిందనుకుంటాను. లేకపోతే “బొగ్గు కుంభకోణంలో నేను దోషి, కుట్రదారు అయితే బొగ్గు కేటాయింపులపై అంతిమ నిర్ణయం తీసుకున్న బొగ్గు మంత్రి, ప్రధాని మన్మోహన్  దోషి, కుట్రదారు కాకుండా ఎలా పోతారు?” అని అప్పటి బొగ్గు శాఖ కార్యదర్శి పరఖ్ ప్రశ్నిస్తుంటే, ఆయనకి రక్షణగా నిలవడం మాని పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా పై చార్జి షీటు నమోదు చేసినందుకు సి.బి.ఐ పై కేంద్ర మంత్రులు విరుచుకుపడడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

Click to enlarge

Click to enlarge

వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ ప్రకారం పారిశ్రామికవేత్తలపై సి.బి.ఐ చార్జి షీటు నమోదు చేయకూడదట! కుమారమంగళం బిర్లా లాంటి దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్తలపై కేసులు పెడితే దేశంలో పారిశ్రామిక వాతావరణం దెబ్బతింటుందట! ఇక పెట్టుబడులు పెట్టి దేశాన్ని అభివృద్ధి చేయడానికి పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తారట! విదేశీ పెట్టుబడులు కూడా బెదిరిపోయి దేశంలోకి ఇక రానే రావట! ప్రధానిపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పడం మాని ఆయన బిర్లాపై కేసు పెట్టినందుకు సి.బి.ఐని విమర్శించే పనిలో పడిపోయారు.

ఇకనేం?! మంత్రివర్యులు, రాజకీయ పెద్దలు, పారిశ్రామికవేత్తలు, ఇతర పెద్దమనుషులు ఇంకా ఎవరన్నా ఉంటే వారంతా కలిసి తమకొక చట్టం, మిగిలిన జనానికి ఒక చట్టం రాసుకుని ఆమోదింపజేసుకుంటే సరిపోతుంది. దానికి ఎవరుమాత్రం అడ్డొస్తున్నారు? సుప్రీం కోర్టు తీర్పును ఎగతాళి చేస్తూ, చార్జిషీటు నమోదయినా ఎన్నికల్లో పోటీకి అర్హత కోల్పోని విధంగా చట్టం ఆమోదిస్తే ఎవరు అడిగారు? కావాల్సి వస్తే చట్టం చేసుకోండి గానీ మా తీర్పు వెనక్కి తీసుకోబోమని సుప్రీం కోర్టే స్వయంగా చేతులెత్తేసింది మరి! (సరే, నేరం రుజువై దోషిగా తేలినా ఎన్నికల్లో అర్హత కోల్పోకుండా ఉండేలా ఆర్డినెన్స్ తేబోయి భంగపడ్డారనుకోండి! రేపు రాబోయే ప్రభుత్వం ఎలాగూ అలాంటి చట్టం తెచ్చి తీరుతుంది. అందులో సందేహం అనవసరం.)

కొత్త చట్టం చేసినప్పుడల్లా తమకు వర్తించడానికి ఒకటి, మిగిలిన జనానికి వర్తించేలా మరోకటి జంట చట్టాలు చేసేసుకుంటే ఇక విమర్శల గోల ఉండదు. పత్రికలూ అడగవు. పాత చట్టాల్లో కూడా సవరణలు చేసుకుని ప్రతిదానికీ రెండు అర్ధాలు వచ్చేలా చేసుకుంటే ప్రతిసారీ పత్రికలకు, విమర్శకులకు సమాధానాలు చేప్పే అవసరమూ తప్పుతుంది.

ఆనంద్ శర్మ పరోక్షంగానే అయినా ఒక సంగతి స్పష్టంగా చెప్పినందుకు అభినందించాలి. అవినీతి, అక్రమాలు, క్రోనీయిజం, నిలువు దోపిడి, చట్టాలకు వక్ర భాష్యాలు… తదితర అనేకానేక జబ్బులు లేకుండా పెట్టుబడికి దేశసేవ చేయడం అసాధ్యమని ఆయన తన మాటల్లో చెప్పేశారు. కుమారమంగళం బిర్లాకి అప్పటికే ఒక బొగ్గు బ్లాకు కేటాయించినా సంవత్సరాల తరబడి దానిని తవ్వి తీయకుండా అదనంగా బొగ్గు బ్లాకులు కావాలని అడిగినా అది తప్పు కాదు. రెండో బొగ్గు బ్లాకులో అనుమతి లేకుండానే బొగ్గు తవ్వేసి వాడుకుంటూ ఆనక అనుమతి కోరితే తప్పు కాదు గానీ, అది తప్పని చెప్పిన సి.బి.ఐ డి మాత్రం మహానేరం.

Click to enlarge

Click to enlarge

రిలయన్స్ రిఫైనరీస్ కంపెనీనే తీసుకోండి. సాక్ష్యాత్తూ కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నే అడ్డంగా ఉల్లంఘించి సహజవాయువు ఉత్పత్తిని అమాంతం తగ్గించేసినా ముఖేష్ అంబానీ నుండి సదరు ఒప్పందం నిర్దేశించిన మేరకు రుసుము వసూలు చేయడం కేంద్ర ప్రభుత్వం వల్ల కావడం లేదు. పైగా ముఖేష్ కంపెనీ చేస్తున్న వెర్రిమొర్రి వాదనలను నెత్తినేసుకుని ఆయనను బైటపడేయడానికే చమురు మంత్రి వీరప్ప మొయిలీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తన ప్రయోజనం కోసమే జైపాల్ రెడ్డి గారిని ఆ పదవి నుండి తప్పించి మొయిలీని నియమింపజేసుకోగల శక్తి, పలుకుబడి ముఖేష్ సొంతమై కూర్చుంది.

ఒప్పందం మేరకు ప్రభుత్వానికి అప్పజెప్పాల్సిన సహజవాయు క్షేత్రాలను కూడా సగానికి సగం తగ్గించి లెక్కిస్తున్నా అడిగే దిక్కు లేదు. ఇంకా వారికే ప్రధాని, మంత్రులు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ పోతున్న పరిస్ధితుల్లో… ఈ దేశ ప్రజలకు చెందిన సహజ వనరులను ఒక తెగ _ _సిన పారిశ్రామికవేత్తకు అప్పనంగా అప్పజెప్పడానికి కుట్రలు జరగడం లేదంటే ఎలా నమ్మాలి?

అసలు పారిశ్రామిక అనుకూల వాతావరణం, పెట్టుబడి అనుకూల వాతావరణం, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్… ఇత్యాది పదాడంబరాల అర్ధం ఏమిటి? భారత దేశం ప్రజాస్వామ్య దేశం అని చెబుతుంటిరి. ప్రజలు ఎన్నుకున్న నేతలు ప్రజల అవసరాల కోసమే పని చేయాలని చెబుతుంటిరి. దేశ వనరులన్నీ ప్రజలవేననీ, వాటికి ప్రభుత్వం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలనీ వల్లిస్తుంటిరి. ఈ ఆదర్శాల అమలు కోసమే చట్టాలనీ, చట్టాల ప్రకారమే ప్రభుత్వాలు పాలించాలని చెబుతుంటిరి. అలాంటి ఒక చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తే, కేవలం ప్రయత్నం మాత్రమే సుమా, అంతమాత్రానికే పారిశ్రామిక వాతావరణం చెడేపోతే, అంతోసి వాతావరణం ఉంటే ఎంత? పోతే ఎంత?

ఒకప్పటి రాజులు, మంత్రులు, సైన్యాధికారులు, ఉన్నతోద్యోగులు ప్రజల పరిపాలన విషయంలో చేసిందేమిటి? నిజం చెప్పాలంటే ఏమీ లేదు. రాజ్యంలోని భూములన్నీ రాజు సొంతం. లేదా ఆయన దయతలచిన మంత్రులు, సామంతులు, సైనిక సేవకులు, పూజారులు ఇత్యాది ప్రముఖుల సొంతం. జనం చేయాల్సింది వాటిల్లో పని చేయడమే. జనం చేసిన శ్రమ ద్వారా జరిగిన ఉత్పత్తిని సొంతం చేసుకోవడానికి రాజులు యుద్ధాలు చేసుకున్నారు. దండయాత్రలు చేశారు. రాజభక్తి పేరుతో స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నవారిని రాజద్రోహం నేరం మోపి జైళ్ళలో తోశారు. రాజ్యకాంక్షకు లేదా తద్వారా ఒనగూతే సంపదల కాంక్షను తీర్చుకోడానికి ఊచకోతలు కోశారు. నెత్తురు పారించారు.

అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమన్నా ఉన్నదా? అప్పుడు రాచరికం అన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటున్నారు. అప్పుడు రాజు ఒక్కడే. ఇప్పుడూ ప్రధాని ఒక్కరే. అప్పుడు మంత్రులు, సామంతులు, సైన్యాధికారులు, ఉన్నతోద్యోగులు… ఇప్పుడేమో మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మేల్యేలు, ఎం.పిలు, బ్యూరోక్రాట్స్, భూ-వాయు-జల తలాల సైన్యాధికారులు. అప్పుడు రాజభటులు, ఇప్పుడు ఆర్మీ, పోలీసులు, సి.ఆర్.పి.ఎఫ్, ఆర్.ఏ.ఎఫ్, బి.ఎస్.ఎఫ్, వగైరా, వగైరా…. అప్పుడు రాజుగారి కొలువు, ఇప్పుడు ప్రభుత్వోద్యోగి!

కావాలంటే లెక్క తీసుకోవచ్చు. ఒక్కో రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మేల్యేలు, ఎం.పిలు ఎవరో ఒక్కొక్కరినీ పట్టి చూస్తే పూర్వాశ్రమంలో వారి వంశాలన్నీ రాజ వంశాలు, సుల్తానులు, మంత్రుల సైన్యాధికారుల వారసులు, వారి కింద పని చేసిన జమీందారులు, పటేళ్ళు మొదలైన వారి వారసులే. ఒకటీ అరా ఎస్.సి, ఎస్.టి, బి.సీలు ఉంటే ఉండవచ్చు. ప్రజాస్వామ్యమే అని చెప్పుకోవడానికి ఉపయోగపడే నలుసులు అవన్నీ.

రాచరికంలో రాజు చెప్పిందే శాసనం. రాజు గారి రంకు సౌందర్య ప్రియత్వమే గాని తప్పు కాదు. ఆయనగారు ఒక గుర్రాన్ని వదిలి అది నడిచిన నేలంతా నాదే అంటే అది ‘అశ్వమేధయాగం.’ ఎవరన్నా తిరగబడితే పీక తెగ్గొసే భయంకర నేరం. నేడది ‘టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం!’ ఇప్పుడేవరన్నా తిరగబడితే టెర్రరిస్టు, నక్సలైట్!

అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదు. రూపం మారిందే కానీ సారం అలాగే కొనసాగుతోంది. పేర్లు మారాయి, వర్ణన మారింది, గాలి మారింది. కానీ పునాది మారలేదు. నిర్మాణం మారలేదు. అణచివేత, దోపిడి, దుర్మార్గాలు అస్సలు మారనే మారలేదు.

ప్రజల అధికారానికి ఏ మాత్రం అవకాశం ఏర్పడినా ఆ మేరకు మార్పు జరిగింది. భావజాలం అభివృద్ధి చెందింది. కానీ అది అనుమతించబడిన పరిమితుల మేరకే. అనుమతించబడిన పరిమితులు దాటిన చోట చట్టం వస్తుంది, పోలీసులోస్తారు, కోర్టులూ వస్తాయి. చివరికి సైన్యం కూడా వస్తుంది. 1940ల చివర తెలంగాణకు నెహ్రూ, పటేల్ లు సైన్యం ఎందుకు పంపారు? నిజాంని లొంగదీసుకోవడానికి అని పాఠాలు చెబుతాయి. కానీ ‘రైతులు దున్నేవాడికే భూమి ఇవ్వాలి’ అని అడిగినందుకే సైన్యం దిగింది అని నిజాలు చెబుతాయి.

కాబట్టి అప్పుడైనా, ఇప్పుడైనా వ్యవస్ధలు పని చేసింది, పని చేస్తున్నదీ ధనిక వర్గాల కోసమే. భూములు, పరిశ్రమలు ఎవరి చేతుల్లో అయితే ఉన్నాయో వారికోసమే ప్రభుత్వాలు పని చేస్తాయి. ధనిక వర్గాల తప్పును ఎంచితే మెచ్చి మేడల్స్ ఇచ్చేవారు ఇపుడుండరు. వారి ఆస్తులు పెంచే ఒక ఆవిష్కరణ చెయ్యండి, పద్మశ్రీ అంటారు. వారి ఆస్తులు కాపాడడానికి ప్రాణం ఇవ్వండి, ‘పరమ వీర చక్ర’ అంటారు. వారి జీవితాన్ని పుస్తకం రాయండి, ‘సాహిత్య అకాడమీ పురస్కారం’ ఇస్తారు. వారి ఆనందాన్ని గానం చెయ్యండి, ‘గాన గంధర్వ’ అని బిరుదులిస్తారు.

వారి తప్పును ఎంచి చూడండి, మక్కెలు ఇరగదన్ని బొక్కలో తోస్తారు. కుమారమంగళం ఆస్తులు, ఆయన గౌరవం ముఖ్యం గానీ, ప్రధాని పదవిలో ఉన్నవారికి ఎన్ని బాణాలు తగిలినా లెక్క ఉండదు. ఈ వ్యవస్ధ లక్షణమే అంత! జనం దాన్ని మార్చుకోవాలి.

వ్యాఖ్యానించండి