మేం కాపలా కాసేది మీ నౌకలకే, ఇండియాతో అడ్వాన్ ఫోర్ట్


Seman Guard Ohio

ఆయుధాలతో పట్టుబడిన అమెరికన్ ప్రైవేటు సెక్యూరిటీ ఓడ కధ ఆసక్తికరమైన మలుపు తిరిగింది. పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు పట్టుబడ్డాయని చెబుతున్న అడ్వాన్ ఫోర్ట్ కి చెందిన ఓడలో లో భారతీయులు కూడా ఉన్న సంగతి గమనించాలని, ఆ ఓడ వాస్తవానికి భారత నౌకల రక్షణ కోసమే నియమించబడిందని కంపెనీ అధ్యక్షుడు విలియం వాట్సన్ చెబుతున్నాడు. భారత నౌకలకు సముద్ర దొంగల నుండి రక్షణ ఇస్తున్న ‘సీమన్ గార్డ్ ఓహియో’ ను అదుపులోకి తీసుకోడం వలన భారత్ కే నష్టం అని వాట్సన్ అన్నాడని ది హిందు తెలిపింది.

“నిజానికి, నా దృష్టిలో తమాషా ఏమిటంటే అక్కడ ఉన్న మా ఓడల్లో అనేకం భారతీయ నౌకలకు కాపలా కాసేవే. అవి ఓడ రేవులో ఉన్నట్లయితే తమకు అప్పజెప్పిన కర్తవ్యాన్ని నిర్వర్తించలేవు కదా” అని వాట్సన్ వ్యాఖ్యానించాడు. వాట్సన్ వ్యాఖ్యలు అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి ఉద్దేశించినట్లు కనిపిస్తోంది. భారత నౌకలకు భద్రత కల్పిస్తున్నంత మాత్రాన అక్రమంగా భారత సముద్ర జలాల్లో ప్రవేశించడానికి లైసెన్స్ ఎలా దొరుకుతుంది? అక్రమంగా ఇంధనం ఎలా కొనుగోలు చేస్తారు? లైసెన్స్ లేని ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఎలా కలిగి ఉండగలరు?

“ఆయుధాలు, మందుగుండు కొన్నవారి దగ్గరనుండి అందిన సరైన పర్మిట్లు, లైసెన్స్ లు మావద్ద ఉన్నాయి. మా నౌకలు ఎవరికోసమైతే పని చేస్తున్నాయో వారికి వర్తించే ‘ఎండ్ యూజర్ సర్టిఫికేట్స్’ కూడా మా వద్ద ఉన్నాయి” అని వాట్సన్ చెప్పాడు. ఉన్నట్లయితే వాటిని భారత అధికారులకు చూపించవచ్చు గదా? అనుమతి పత్రాలు చూపమనే కదా భారత అధికారులు అడుగుతోంది! భారత అధికారులు చెబుతున్నదాని ప్రకారం పర్మిట్లు, లైసెన్స్ లు తదితర పత్రాలేవీ అడ్వాన్ ఫోర్ట్ వాళ్ళు చూపించలేదు. పత్రాలు చూపకుండా అవి ఉన్నాయని చెపితే ఎలా సరిపోతుంది? తాము అమెరికా కంపెనీ కాబట్టి ‘మా మాటే చాలు’ అని అడ్వాన్ ఫోర్ట్ అధినేత చెప్పదలిచాడా?

“ఓడలో ఉన్న ఆయుధాలన్నీ పూర్తిగా చట్టబద్ధమైనవి. వాటన్నిటిని రిజిస్టర్ చేశాము. చట్టబద్ధంగానే ఆ ఆయుధాలను కొనుగోలు చేశాము. తీవ్ర ప్రమాదం ఉన్న సముద్ర జలాల్లో ఓడల రక్షణ కోసం మా సొంత ఉపయోగం రీత్యానే మేము వాటిని కొనుగోలు చేశాము” అని వాట్సన్ అన్నట్లుగా పి.టి.ఐ తెలిపింది. మాటలు చెప్పే బదులు ఆ పత్రాలేవో చూపిస్తే ఎంచక్కా ఓడను విడిపించుకుని పోవచ్చు. ఆ పని చేయలేకపోతున్నారంటేనే ఏదో ఉందని అనుమానించాల్సి వస్తోంది.

ఆయుధాలు, మందుగుండు అసలు విషయం  కాదని, ఇంధనం కొనుగోలు చేయడమే భారత అధికారులకు ప్రధాన సమస్యగా తోచినట్లు తాను భావిస్తున్నానని వాట్సన్ వ్యాఖ్యానించాడు. కానీ భారత అధికారులు చెబుతున్నది అది కాదు. వారి ప్రకారం అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం, అక్రమంగా భారత సముద్ర జలాల్లో ప్రవేశించడం, అక్రమంగా సరైన అనుమతి లేకుండా హై స్పీడ్ డీజెల్ ఇంధనాన్ని కొనుగోలు చేయడం. ఈ మూడు సమస్యలను భారత అధికారులు చెబుతుండగా డీజెల్ సమస్య ఒక్కటే అసలు సంగతి అని సొంత భాష్యం చెప్పడం వాట్సన్ ని తగునా?

“ఇది ప్రాధమిక దర్యాప్తు. ఆయుధాలు విషయంలో భారత ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది, అది మాకు తెలుసు. మా ఓడల్లో ఆయుధాలు ఉండడంతో వాళ్ళు మా రికార్డులన్నింటినీ పరీక్షిస్తున్నారు. వారి ఆడిట్ ని ఆహ్వానిస్తున్నాం. మేము దాచవలసింది ఏమీ లేదు” అని వాట్సన్ అన్నాడని పి.టి.ఐ తెలిపింది. బహుశా తమ రికార్డులను భారత ప్రభుత్వం అనుమానంతో పరిశీలించడమే వాట్సన్ కి నచ్చలేదు లాగుంది. మీ నౌకలకే రక్షణ ఇస్తుంటే మమ్మల్నే అనుమానిస్తారా? రికార్డులన్నీ పరిశోధిస్తారా? అన్నదే ఆయన ఉక్రోషంలా కనిపిస్తోంది.

అదే నిజమైతే అమెరికా సాగించే అక్రమ పరీక్షలకీ, ఏకపక్ష అక్రమ ఆంక్షలకీ ఎంతమంది, ఎన్ని దేశాలు, ఎన్ని అంతర్జాతీయ సంస్ధలు ఆగ్రహించాలి? డబ్ల్యూ.టి.ఓ జంట టవర్లపై దాడి చేసింది లేదా చేయించింది బిన్ లాడెన్ అని రుజువు చేయడానికి కనీస సాక్ష్యాలు ఇస్తే తామే ఆయన్ని స్వయంగా అప్పజెబుతామని ఆఫ్ఘనిస్ధాన్ ప్రభుత్వం చెప్పినా పట్టించుకోకుండా దాడి చేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నందుకు అమెరికాకు ఎన్ని శిక్షలు వేస్తే సరిపోతుంది? ఇరాక్ లో అసలు సామూహిక విధ్వంసక మారణాయుధాలు లేనే లేవని ఐ.ఏ.ఇ.ఏ ఇనస్పెక్టర్లు స్పష్టం చేసినా వినకుండా ఆ దేశంపై దాడి చేసి ఇప్పటికీ రావణ కాష్టంలా రగులుస్తున్నందుకు అమెరికానూ, యుద్ధాల ద్వారా లబ్ది పొందుతున్న అమెరికా కంపెనీలను ఎన్ని మాటలతో నిందించాలి? ఎన్నిసార్లు అంతర్జాతీయ కోర్టుల్లో విచారించి శిక్షలు వేయాలి?

అడ్వాన్ ఫోర్ట్ తరపున అమెరికా జోక్యం చేసుకోలేదని చెబుతున్నారు గానీ, అది నమ్మశక్యంగా లేదు. ‘అమెరికా ప్రభుత్వం పరిస్ధితిని పరిశీలిస్తోంది’ అని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పినట్లు కొన్ని పత్రికలు తెలిపాయి. ఆ ఒక్కమాట చాలు, అమెరికా ప్రభుత్వం లాబీయింగ్ చేస్తోందని చెప్పడానికి.

వ్యాఖ్యానించండి