ఋణ పరిమితి పెంచడానికి, మూసేసిన ప్రభుత్వాన్ని తిరిగి తెరవడానికీ అమెరికా రాజకీయ పార్టీలు ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ చైనా సంతృప్తి పడలేదు. చైనాకు చెందిన పరపతి మూల్యాంకనా సంస్ధ (Credit Rating Agency) ఒకటి ఒప్పందం కుదిరినాక కూడా అమెరికా పరపతి రేటింగును తగ్గించి సంచలనం సృష్టించింది. బీజింగ్ నుండి పని చేసే డెగాంగ్ రేటింగ్ ఏజన్సీ అమెరికా ప్రభుత్వ ఋణ రేటింగును A నుండి A- కు తగ్గించింది. అమెరికా పరపతి వాస్తవంగా ఉన్నదాని కంటే అత్యధిక స్ధాయిలో పలుకుతోందని, పశ్చిమ రేటింగ్ కంపెనీల పక్షపాత దృష్టే దీనికి కారణమని డెగాంగ్ స్పష్టం చేస్తోంది.
అమెరికన్ సెనేట్ లో ఉభయ రాజకీయ పార్టీలు చివరి నిమిషంలో ఒక అంగీకారానికి వచ్చి ఋణ చెల్లింపుల సంక్షోభాన్ని మరో మూడు నెలలు వాయిదా వేయగలిగాయి. సెనేట్ పాలక, ప్రతిపక్ష నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా ఫెడరల్ ప్రభుత్వం జనవరి 15 వరకు పని చేయడానికి అవకాశం దొరుకుంది. అలాగే ఋణ సేకరణ ఫిబ్రవరి 7 వరకు అవకాశం ఇచ్చారు. ఋణ పరిమితి పెంచడంలో నిర్దిష్ట నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. అనగా గరిష్టంగా ఎంతవరకు రుణం సేకరించవచ్చునో నిర్దిష్టంగా ఒప్పందం పేర్కోలేదు.
ఈ నేపధ్యంలో అమెరికా ఋణ (పరిమితి) సంక్షోభం/ఫిస్కల్ క్రైసిస్/బడ్జెట్ సంక్షోభం/వ్యయ బిల్లు సంక్షోభం తాత్కాలికంగా వాయిదా వేశారే తప్ప పరిష్కారం జరగలేదని డెగాంగ్ తెలిపింది. అందువలన అమెరికా సార్వభౌమ ఋణ పత్రాల పరపతిని A నుండి A- కు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. “ప్రభుత్వం ఇప్పటికీ దివాలా ప్రమాదం వైపుకి ప్రయాణం చేస్తోంది. భవిష్యత్తులో అయినా ఇది మెరుగుపడే పరిస్ధితి కనిపించడం లేదు” అని డెగాంగ్ తన చర్యకు కారణం వివరించింది.
అయితే అమెరికా పరపతి ఉన్నదాని కంటే ఎక్కువగా చెబుతున్నారని చెబుతున్న డెగాంగ్, ఇంతవరకూ తాను కూడా అదే తప్పు ఎందుకు చేసిందో చెప్పాల్సి ఉంది. అమెరికా రుణంలో సింహ భాగం చైనా చేతుల్లో ఉన్నందుకే దానికి అత్యున్నత రేటింగు ఇచ్చిందా? తాను చేస్తే ఒప్పు పశ్చిమ కంపెనీలు చేస్తే తప్పు ఎలా అవుతుందో కూడా డెగాంగ్ చెప్పాలి.
ఎస్&పి పరపతి రేటింగ్ సంస్ధ 2011 లోనే అమెరికా రేటింగ్ ను AAA+ నుండి AA+ కి తగ్గించింది. సెనేట్ లో ఒప్పందం కుదిరి దానిని ప్రతినిధుల సభ, అధ్యక్షుడు ఒబామా ఆమోదించడానికి ఒక రోజు ముందే ఫిచ్ సంస్ధ అమెరికా రేటింగ్ ను పరిశీలనలో ఉంచుతున్నట్లు చెప్పింది. మరి డెగాంగ్ ఆ పని ముందే చేయలేదు కదా?
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పశ్చిమ రేటింగ్ కంపెనీల గురించి డెగాంగ్ చెప్పింది వాస్తవమే. ఎస్&పి, ఫిచ్, మూడీస్ ఎనలిటిక్స్ ఈ మూడూ ప్రపంచంలో ప్రధాన పరపతి రేటింగ్ కంపెనీలుగా పేరు పొందాయి. ఇవి మూడూ పశ్చిమ దేశాల కంపెనీలే. పైగా ఈ కంపెనీలను నియంత్రించేది కూడా వాల్ స్ట్రీట్, ద సిటీ (లండన్) లకు చెందిన బ్యాంకింగ్ దిగ్గజాలే. కాబట్టి అవి పశ్చిమ దేశాల ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభంలో ఈ రేటింగ్ కంపెనీల పాత్ర విస్మరించలేనిది. కానీ డెగాంగ్ వాటికి భిన్నంగా వ్యవహరించకపోవడమే ఆక్షేపణీయం.
అమెరికా యేతర రేటింగ్ కంపెనీలలో డెగాంగ్ కే కాస్త పేరుంది. అయితే ఈ సంస్ధ రేటింగ్ పై ఆధారపడి అంతర్జాతీయ స్ధాయిలో ఎంతమంది మదుపు చేస్తున్నదీ అనుమానమే.
అమెరికా పరపతిపై ఎన్ని అనుమానాలు వ్యక్తం చేసినా చైనా మాత్రం ఇరుక్కుపోయి ఉందనే చెప్పాలి. ఎందుకంటే చైనా, ఆ మాటకొస్తే ఏ దేశం అయినా, అమెరికా ట్రెజరీలను వదిలించుకునే పనిలో పడితే ద్రవ్య, కరెన్సీ మార్కెట్లు వెనువెంటనే అప్రమత్తం అవుతాయి. ఇతరులు కూడా అమ్మకాలు మొదలు పెడితే అమెరికా రుణంపై వడ్డీ రేట్లు పెరిగిపోయి మరిన్ని అమ్మకాలు జరగకుండా ఆగిపోతుంది. అంటే ఇక అమ్ముదామన్నా ఎవరూ కొనని పరిస్ధితి వస్తుంది. అనగా తన ఆస్తుల విలువని తానే తగ్గించుకునే పరిస్ధితి ఏర్పడుతుంది. ఫలితంగా చైనాతో పాటు ఇతర దేశాలు మింగలేకా, కక్క లేకా సతమతం అవుతున్నాయి.
కానీ ఎన్నడో ఒకరోజు చైనా తన అమెరికా ఆస్తుల్లో కొంత భాగాన్ని వదులుకోవలసి రావడం అనివార్యం కావచ్చు.








