అమెరికా: ఎట్టకేలకు ఒప్పందం, సంక్షోభం వాయిదా


John Zangas, a furloughed worker

సెనేట్ లో ఉభయ పార్టీల మధ్య ఒప్పందం కుదరడంతో ఎట్టకేలకు అమెరికా ఋణ పరిమితి సంక్షోభం, ప్రభుత్వ మూసివేత సంక్షోభం తాత్కాలికంగా పరిష్కారం అయ్యాయి. జనవరి 15 వరకు ప్రభుత్వ ఖర్చులు ఎల్లమారే బడ్జెట్, ఫిబ్రవరి 7 వరకూ అందుబాటులో ఉండే ఋణ పరిమితి పెంపుదల… ఒప్పందంలోని ప్రధాన అంశాలు. అనగా సంక్షోభం వాయిదా వేశారు తప్ప పరిష్కారం కాలేదు. పరిష్కారం చేసుకోడానికి వీలయిన చర్చలు చేయడానికి సమయం మాత్రం దక్కించుకున్నారు. దానర్ధం పరిష్కారం తధ్యం అని కాదు. ఫిబ్రవరి 7 తేదీతో ఋణ పరిమితి పెంపుదల సంక్షోభం మరోసారి రంగం మీదికి వస్తుంది. జనవరి 15 నాటికి మరొకసారి ప్రభుత్వం మూసివేతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.

అయితే రెండు వారాల పాటు కొనసాగిన మూసివేత, ఋణ పరిమితి పెంపుదల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు చేయవలసిన నష్టాన్ని చేసేశాయి. ‘స్టాండర్డ్ & పూర్’ రేటింగ్ సంస్ధ ప్రకారం ఈ 16 రోజుల్లో రోజుకి 1.5 బిలియన్ డాలర్ల చొప్పున 24 బిలియన్ల మేరకు ఆర్ధిక వ్యవస్ధ నష్టపోయింది. ఈ నష్టం వలన 2013 చివరి త్రైమాసికంలో అమెరికా జి.డి.పి వృద్ధి రేటు 0.6% మేరకు కోతకు గురయిందని ఎస్&పి అంచనా వేసింది. అంటే చివరి త్రైమాసికంలో జి.డి.పి వృద్ధి రేటు 0.5 శాత్రమే (వార్షిక వృద్ధి 2%) నమోదవుతుంది. ఈ నష్టం ఒక ఎత్తయితే ఆర్ధిక వ్యవస్ధ పైన ప్రపంచ వ్యాపితంగా నమ్మకం సడలడం మరొక ఎత్తు. ఫలితంగా ఋణ సేకరణ మునుపటిలా నల్లేరు మీద నడక అయితే కాబోదు.

“బాటమ్ లైన్ ఏమిటంటే ప్రభుత్వ మూసివేత అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు నష్టం కలిగించింది” అని పరపతి మూల్యాంకనా సంస్ధ (Credit Rating Agency) ఎస్&పి పేర్కొంది. బుధవారం సెనేట్ లో కుదిరిన ఒప్పందం ద్వారా ప్రభుత్వానికి జనవరి 15 వరకే నిధులు అందిస్తుందని, ఋణ సేకరణ ద్వారాలు ఫిబ్రవరి 7 వరకు మాత్రమే తెరిచి ఉంటాయని ఎస్&పి గుర్తు చేసింది. దానర్ధం ఇదే సంక్షోభం మూడు నెలల తర్వాత మళ్ళీ తలెత్తుతుందని స్పష్టం చేసింది. ఇంత కొద్ది కాలంలో వినియోగదారుల ఉరవడి కొనసాగడం కష్టమేనని హెచ్చరించింది.

సెనేట్ లో ఉభయ పార్టీలు కలిసి కూర్చుని తాజా బిల్లును తయారు చేశాయి. ఫలితంగా సెనేట్ లో 81-18 ఓట్ల తేడాతో బిల్లు నెగ్గింది. ప్రతినిధుల సభ మెజారిటీ నాయకుడు (స్పీకర్) జాన్ బోయ్ నర్ ఈ బిల్లుకు అడ్డు చెప్పకపోవడంతో అక్కడ 285-144 ఓట్ల తేడాతో బిల్లు నెగ్గింది. అధ్యక్షుడు ఒబామా సంతకం చేయడంతో బిల్లు వెంటనే చట్టం రూపం దాల్చింది. ఉభయ పార్టీల ఆమోదంతో తయారయిన బిల్లే అయినప్పటికీ ప్రతినిధుల సభలో దానిని 144 మంది సభ్యులు వ్యతిరేకించడం గమనార్హం.

పేదలకు ప్రభుత్వమే ఆరోగ్య భీమా ప్రీమియం చెల్లించేందుకు అవకాశం ఇచ్చే ‘ఒబామా కేర్’ చట్టాన్ని రిపబ్లికన్ సభ్యులు వ్యతిరేకించడం వల్లనే తాజా సంక్షోభం తలెత్తింది. ఒబామా కేర్ కు నిధులు ఇవ్వకుండా నిరోధించాలని రిపబ్లికన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా పాలనా వ్యవస్ధలో తన ముద్ర ఉండే చట్టం ఉండాలని అభిలషిస్తున్న ఒబామా, వారి డిమాండ్లకు తలొగ్గలేదు. ఆరు వారాల పాటు తమ పట్టు సడలిస్తామన్న రిపబ్లికన్ల ప్రతిపాదనను ఒబామా తిరస్కరించడంతో ప్రతిష్టంభన మరిన్ని రోజులు కొనసాగింది.

మరొక పరపతి మూల్యాంకనా సంస్ధ ‘మూడీస్ ఎనలిటిక్స్’ ప్రకారం ప్రభుత్వ మూసివేత వలన అమెరికా ప్రభుత్వానికి 55 బిలియన్ డాలర్ల నష్టం చేకూరింది. 2005 నాటి భీకర తుఫాను కత్రినా వలన అమెరికాకు జరిగిన నష్టంతో ఇది సమానం కావడం గమనార్హం. ప్రకృతి ప్రకోపాన్ని ఎలాగూ అడ్డుకోలేము. కానీ ప్రభుత్వ మూసివేత అనివార్యం ఏమీ కాదు. మానవ నిర్మిత ఉత్పాతాలకూ, ప్రకృతి ప్రకోపాలకు తేడా లేకుండా పోవడమే ఇక్కడి విషాధం.

నష్టం నష్టమే

ప్రస్తుతానికి ఒప్పందం కుదిరినప్పటికీ అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పలువురు నిపుణులు, సంస్ధలు వ్యాఖ్యానిస్తున్నారు. “శాశ్వత పరిష్కారం కోసం చర్చలు చేయడానికి మరింత సమయం అందిపుచ్చుకోవడం కోసమే రాజకీయ నాయకులు తాత్కాలిక ఒప్పందానికి వచ్చారన్న అవగాహన వినియోగదారుల నమ్మకంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో అపనమ్మకం బాగా పెరుగుతుంది. ప్రభుత్వ విధాన సంక్షోభం మళ్ళీ తలెత్తుతుందని, మరో మూసివేత తప్పదనీ ప్రజలు భావిస్తే వాళ్ళు (వ్యయం కోసం) తమ చెక్ బుక్ ని తెరవడానికి నిస్సందేహంగా తటపటాయిస్తారు. దానివల్ల మరో హాలిడే సీజన్ వృధా పోనుంది” అని ఎస్&పి వ్యాఖ్యానించింది. శాశ్వత ఒప్పందం సాధ్యం కాకపోతే ఈసారి లేమాన్ సంక్షోభం కంటే ఘోరమైన పరిస్ధితి ఉత్పన్నం కాక తప్పదు” అని ఎస్&పి విశ్లేషకుడు జాన్ చాంబర్స్ అన్నాడని ది హిందు తెలిపింది.

చైనా ప్రభుత్వ మీడియా అమెరికా పాలకులు ‘సంక్షోభాలను తయారు చేస్తున్నారని’ మండి పడింది. అమెరికా అప్పులో ప్రధాన భాగం చైనా ప్రభుత్వానిదే కావడంతో ఆ దేశం ఆందోళన చెందుతోంది. అక్టోబర్ 17 లోపల ఒప్పందం కుదరనట్లయితే డాలర్ విలువ తగ్గిపోయి చైనా రుణం విలువ కోసుకుపోయి ఉండేది. రాజకీయ నాయకుల ఆటలు మొత్తం ప్రపంచ ద్రవ్య మార్కెట్ ను అంచు మీదికి నెట్టేస్తున్నదని, అమెరికా పరపతి కూడా నష్టపోతున్నదని చైనా మీడియా హెచ్చరించింది.

డాలర్ కరెన్సీయే ప్రస్తుతం అనధికార ప్రపంచ కరెన్సీగా వ్యాప్తిలో ఉంది. అంటే ప్రపంచ దేశాలు విదేశీ వాణిజ్యం కోసం తమ విదేశీ నిధులను డాలర్లలోనే నిల్వ చేసుకుంటున్నాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో కొనసాగుతున్న అనిశ్చితి డాలర్ విలువను కూడా అనిశ్చితిలో పడేస్తోంది. దానితో డాలర్ అంతకంతకూ ఆకర్షణ కోల్పోతోంది. దేశాలు ప్రత్యామ్న్యాయ రిజర్వ్ కరెన్సీ సృష్టించాలన్న డిమాండ్ తో స్వరం పెంచుతున్నాయి.

ప్రత్యామ్న్యాయ కరెన్సీ సృష్టికి తగిన పరిస్ధితులను ఏర్పరచడంలో చైనా దూకుడుగా వెళ్తోంది. దాదాపు 16కి పైగా దేశాలతో సొంత కరెన్సీలలో వ్యాపారం చేసుకునే ఒప్పందాలు చేసుకున్న చైనా బ్రిక్స్ దేశాలతో కూడా అదే తరహా ఒప్పందం చేసుకుంది. చైనా, మూడు రోజుల క్రితమే యూరోపియన్ యూనియన్ తో యూరో-యువాన్ కరెన్సీ మార్పిడి ఒప్పందం చేసుకోవడం గమనార్హం. ఈ ఒప్పందాలన్నీ డాలర్ ప్రాముఖ్యతను తగ్గిస్తున్నాయి. డాలర్ ఆకర్షణ తగ్గిపోతే అమెరికా సార్వభౌమ ఋణ పత్రాలకు కూడా ఆకర్షణ పడిపోతుంది. అనగా అమెరికాకి ఋణ సేకరణ ఇంకా కష్టం అవుతుంది.

దురహంకార విధానాలు మానుకుని, సమానత్వ ప్రాతిపదికన ఇతర దేశాల సార్వభౌమ హక్కులను గుర్తించకపోతే, పూర్వ ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవడం అమెరికాకు కష్ట సాధ్యమైన పని.

Source: rt.com

Source: rt.com

వ్యాఖ్యానించండి