ఛత్తీస్ ఘర్: పటేల్ హత్యకు సారీ -మావోయిస్టులు


ఛత్తీస్ ఘర్ పి.సి.సి అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్ పటేల్ ల హత్యకు సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీ క్షమాపణ చెప్పింది. తండ్రి కొడుకుల హత్య ద్వారా తమ కామ్రేడ్స్ భారీ తప్పిదం చేశారని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నూతన కార్యదర్శి రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారని ది హిందు తెలిపింది. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు ఎవరో తమకు తెలియదని కానీ ఏడు పేజీల ఇంటర్వ్యూ తమకు చేరిందని పత్రిక తెలిపింది.

ఛత్తీస్ ఘర్ లో పచ్చి ప్రజావ్యతిరేక భూస్వామిగా పేరు పొందిన మహేంద్ర కర్మ, తదితరులు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను అడ్డుకుని చేసిన దాడిలో పలువురు కాంగ్రెస్ నేతలు చనిపోయిన సంగతి విదితమే. మహేంద్ర కర్మ తో పాటు మాజీ కేంద్ర మంత్రి వి.సి.శుక్లా కూడా ఈ దాడిలో చనిపోయాడు. మావోయిస్టుల కాల్పుల్లో గాయపడిన శుక్లా రెండు వారాలు ఆసుపత్రిలో ఉండి చనిపోయాడు. నందకుమార్ పటేల్, దినేష్ లను అడవిలోకి లాకెళ్లిన మావోయిస్టులు ఆ తర్వాత వారిని కూడా చంపేశారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన హోరా హోరీ కాల్పుల్లో చిక్కుకుని పలువురు కాంగ్రెస్ ఛోటా నాయకులు, కార్యకర్తలు కూడా చనిపోయారు. మావోయిస్టుల దాడిలో మొత్తం 30 మందికి పైగా చనిపోయారు.

చనిపోయినవారిలో పి.సి.సి మాజీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్ లను చంపినందుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నామని రామన్న ఇప్పుడు ప్రకటించారు. ఈయన ఇటీవలే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయినట్లు పత్రిక తెలిపింది. “అది భారీ తప్పిదం” అని తండ్రీ, కొడుకుల హత్యను ఉద్దేశిస్తూ రామన్న వ్యాఖ్యానించారు. అలాగే జర్నలిస్టు నేమిచంద్ జైన్ హత్యకు కూడా ఆయన క్షమాపణలు కోరారు. కింది కమిటీలకు చెందిన కార్యకర్తలు ఈ పొరపాటు చేశారని ఆయన చెప్పారు. పార్టీకి వర్గశత్రు నిర్మూలన పంధా అంటూ ఒకటి ఉన్నపుడు కింది కార్యకర్తలు ఆ పంధాకి భిన్నంగా ఎలా వ్యవహరించగలరు? పంధాని వదిలి నెపాన్ని కింది కార్యకర్తలపైకి నెట్టడం ఎంతవరకు సమంజసం?

మహేంద్ర కర్మ వరకు చూస్తే ఆయన చావుకి ఆయనే బాధ్యుడు. సల్వా జుడుం (శాంతి యాత్ర) పేరుతో గిరిజనుల మధ్య తగవులు పెట్టి భారీ హత్యాకాండలను ప్రేరేపించిన క్రూరుడు మహేంద్ర కర్మ. గిరిజనాల భూముల్ని బహుళజాతి ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి వీలుగా వారిని పెద్ద ఎత్తున అడవిలోని స్వస్ధలాల నుంచి పునరావాస శిబిరాలకు తరలించిన పచ్చి ప్రజా వ్యతిరేకి. ఆయన దొరికాడని తెలిసినపుడు దాడిలో పాల్గొన్న గిరిజనులు సంతోషంతో నృత్యం చేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు, ఆయన పట్ల గిరిజన ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత గూడుకట్టుకుని ఉన్నదో.

Photos: Deccan Chrnonicle

ఏడు పేజీల ఇంటర్వ్యూలో రామన్న వివిధ అంశాలను విస్తృతంగా చర్చించారని ది హిందు తెలిపింది. దక్షిణ ఛత్తీస్ ఘర్ లో పార్టీ బలా బలాలను ఆయన చర్చించారని తెలిపింది. ప్రభుత్వ విధానాల లోపాలను విశ్లేషిస్తూ, సహ కామ్రేడ్ల బలహీనతలను కూడా ఆయన నిశితంగా చర్చించారని తెలిపింది. పి.సి.సి అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్ ల హత్యలను ఆయన తీవ్రంగా విమర్శించారని తెలుస్తోంది.

“పదేళ్ళ క్రితం హోమ్ మంత్రిగా ఉన్నపుడు నందకుమార్ పటేల్ మా ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించారు. కానీ ఆయన వ్యక్తిగతంగా మమ్ములని వ్యతిరేకించలేదు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పదేళ్లుగా అధికారం లేదు కూడా” అని రామన్న వ్యాఖ్యానించారని పత్రిక తెలిపింది. గిరిజనుల సమస్యలను లేవనెట్టడంలో నందకుమార్ పటేల్ పాత్రను రామన్న పొగిడినట్లు కూడా పత్రిక తెలిపింది. “సర్కే గూడ, ఎడేస్ మెట్ట లలో భద్రతా బలగాలు గిరిజనులపై సాగిస్తున్న హత్యలకు వ్యతిరేకంగా ఆయన తరచుగా గొంతెత్తారు” అని ఆయన పేర్కొన్నారు.

పాలక పక్షాన్ని వదిలి ప్రతిపక్ష పార్టీ నాయకులను టార్గెట్ చేయడం పట్ల అప్పట్లో అనేక ఊహాగానాలు వ్యాపించాయి. కుట్ర సిద్ధాంతాలు పుట్టాయి. కాంగ్రెస్ పార్టీ లోని ఒక వర్గమే మహేంద్ర కర్మ ఇతర నాయకుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇచ్చిందని కొందరు, పాలక పక్షమే సమాచారం ఇచ్చిందని కొందరు వాదించారు. ఈ వాదనలన్నీ ఊహాలేనని రామన్న కొట్టిపారేశారు. కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్ గురించి గిరిజనులే సమాచారం ఇచ్చారని వారి సమాచారం మేరకే తాము దాడి చేశామని రామన్న స్పష్టం చేశారు.

“సాధారణ ప్రజలే పి.ఎల్.జి.ఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) కు కాంగ్రెస్ పార్టీ పరివర్తన్ యాత్ర గురించి సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఆధారంగా పి.ఎల్.జి.ఏ దాడి పధకం రచించింది. ఎన్నికల్లో లబ్ది పొందడానికి బి.జె.పి, కాంగ్రెస్ లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు తప్పితే నిజం లేదు. వారి రాజకీయ దివాలాకోరుతనాన్నే ఇది సూచిస్తోంది. రాజకీయ కుట్ర అంటూ ఏమీ లేదు” అని రామన్న తెలిపారు.

రామన్న ఇంటర్వ్యూ పైన కూడా ది హిందూ ఊహలు చేయడం గమనార్హం. రాష్ట్ర ఎన్నికలు నెల లోపే ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ అనుకూల వ్యాఖ్యలతో రామన్న ఇంటర్వ్యూ వలన ఆ పార్టీకి కలగనున్న మేలు పై ఆ పత్రిక ఊహాగానం చేసింది. కాంగ్రెస్ వ్యతిరేక కుట్ర సిద్ధాంతాన్ని కొట్టివేయడం మరిన్ని ఊహాగానాలకు తెరలేపుతోందని తానే ఒక ఊహాగానం వదిలింది.

ఊహాగానాల సంగతి అలా ఉంచితే హత్యలు జరిగిన తర్వాత జారీ చేసే క్షమాపణల వల్ల ప్రజలకు, ఉద్యమానికి ఎలాంటి ఉపయోగం ఉన్నదో ఆలోచించవలసిన విషయం. క్షమాపణలు చేప్పే పరిస్ధితి వరకూ ఒక హత్య రాకుండా ఉండడమే ప్రజా ఉద్యమానికి శ్రేయస్కరం. ఎందుకంటే ప్రాణం తీసిన చర్య తప్పని తేలితే, ఆ తర్వాత ఆ చర్యను ఏ విధంగానూ సరిదిద్దలేము కనుక. వర్గ శత్రు నిర్మూలన పంధా లోనే అసలు లోపం ఉన్నపుడు కింది స్ధాయి కార్యకర్తలను హత్యలకు బాధ్యులుగా చేయడం కూడా సమంజసం కాదు. ఈ లోపాన్ని గుర్తించగలిగితే ప్రజలకు దీర్ఘకాలికంగా గొప్ప మేలు జరుగుతుంది.

2 thoughts on “ఛత్తీస్ ఘర్: పటేల్ హత్యకు సారీ -మావోయిస్టులు

  1. మావోల చర్యలు(ముఖ్యంగా హత్యలు)భయపెట్టేవిధంగా ఉంటుంది.బలప్రయోగం వలన తమకోర్కెలను తీర్చుకోవలుకొంటే ఈ క్షమాపనలకు అర్ధంలేదు!

వ్యాఖ్యానించండి