గడ్డి కోసం తాటిచెట్టెక్కిన అమెరికా ప్రైవేటు ఓడ!


‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే, దూడ మేత కోసం’ అన్నాట్ట వెనకటికొకడు. భారత సముద్ర జలాల్లో చట్ట విరుద్ధంగా ప్రవేశించిన ఓడ యజమాని అయిన అమెరికా ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ చెబుతున్న కారణం కూడా అలాగే ఉంది.

అమెరికా ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ ‘అడ్వాన్ ఫోర్ట్’ కి చెందిన ‘సీమన్ గార్డ్ ఓహియో’ గత శుక్రవారం తమిళనాడు లోని ట్యుటికోరిన్ ఓడ రేవు సమీపంలోని భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడంతో భారత తీర రక్షణ దళాలు దానిని పట్టుకొచ్చాయి. ఓడ సిబ్బంది 10 మందితో పాటు అదనంగా ఉన్న 25 మంది అత్యాధునికమైన ఆయుధాలు ధరించి ఉండడంతో తమిళనాడు, భారత ప్రభుత్వాలకు చెందిన పలు భద్రతా సంస్ధలు వారిని విచారిస్తున్నాయి.

అయితే అడ్వాన్ ఫోర్ట్ యాజమాన్యం మాత్రం ఒక వింత వివరణతో ముందుకు వచ్చింది. ఫైలిన్ తుఫానును తప్పించుకునే క్రమంలో తమ ఓడ తమిళనాడు తీరం వైపుకు వచ్చిందని అడ్వాన్ ఫోర్ట్ ప్రెసిడెంట్ విలియం వాట్సన్ ప్రకటించాడని ది హిందు తెలిపింది. మళ్ళీ అదే ఊపుతో ఓడ నడవడానికి ఇంధనం అయిపోవడం వలన తీరానికి వచ్చిందని కూడా చెబుతున్నాడాయన.

ఫైలిన్ తుఫాను ప్రధానంగా ఒడిషా తీరాన్ని మాత్రమే తాకింది. దాని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా జిల్లాల వరకు మాత్రమే విస్తరించింది తప్ప తమిళనాడు తీరంపై ఏ ప్రభావమూ చూపలేదు. అలాంటింది ఫైలిన్ ను తుఫాను తాకిడికి దారి తప్పి తమిళనాడు తీరానికి ఎలా వస్తుంది? అదీ కాక సీమన్ గార్డ్ ఓహియో ఓడకు సోమాలియా జలాల్లో ప్రవేశించడానికి మాత్రమే అనుమతి ఉంది. అంటే అరేబియా సముద్రంలో అది కూడా ఆఫ్రికా ఈశాన్య తీరం వరకూ మాత్రమే అనుమతి ఉందని అర్ధం. అలాంటిది అరేబియాను వదిలి చుట్టూ తిరిగి బంగాళాఖాతంలోకి రావడం ఏమిటీ, ఫైలిన్ తుఫానులో చిక్కుకోవడం ఏమిటీ?

మరీ విచిత్రంగా తమ ఓడను భద్రంగా ఒక స్ధిరమైన రేవుకు చేర్చినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అని ప్రకటించాడు విలియం వాట్సన్. సముద్ర దొంగల నుండి వాణిజ్య నౌకలకు రక్షణ అందించే తమ సాయుధ బలగాలు విశ్రమించడానికి ‘సీమన్ గార్డ్ ఓహియో’ ఉద్దేశించామని ఫైలిన్ కు చిక్కుకుని దారి తప్పి తమిళనాడు తీరానికి తమ ఓడ చేరిందని ఆయన చెప్పుకొచ్చాడు.

తమిళనాడు పోలీసులు మాత్రం ఓడ సిబ్బంది, ప్రయాణికులపై అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు, రవాణా చేస్తున్నందుకు కేసులు మోపారు. తగిన అనుమతి లేకుండా డీజిల్ కొనుగోలు చేసినందుకు కూడా కేసు పెట్టారు. తమిళనాడులో సాయుధ నేరస్ధ ముఠాల నేర కార్యకలాపాలను నిరోధించడంలో ప్రావీణ్యం ఉన్న Q బ్రాంచి సి.ఐ.డి కి కేసు అప్పగించినట్లు కూడా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకుంటున్నట్లు ప్రకటించింది. వెంటనే తమకు నివేదిక ఇవ్వాలని తమిళనాడును కోరింది.

వ్యాఖ్యానించండి