అమెరికాలో ఋణ పరిమితి చర్చలు మళ్ళీ పతనం అయ్యాయి. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ నాయకులు ప్రతిపాదించిన బిల్లుకు ఆ పార్టీ సభ్యల్లోనే మద్దతు కొరవడడంతో అది సభలోకి ప్రవేశించకముందే ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దని కన్సర్వేటివ్ గ్రూపులు కోచ్ బ్రదర్స్, టీ పార్టీలు ప్రచారం చేయడంతో ప్రతినిధుల సభలో రిపబ్లికన్ నేత, స్పీకర్ జాన్ బోయ్ నర్ ప్రయత్నాలు వమ్ము అయ్యాయి. దానితో అమెరికా పరపతి రేటింగును తగ్గించాల్సి ఉంటుందని ఫిచ్ ఋణ రేటింగు సంస్ధ హెచ్చరించింది. అమెరికా ప్రభుత్వ పరపతి రేటింగును పరిశీలనలో ఉంచుతున్నట్లు ఫిచ్ ప్రకటించింది.
ఫెడరల్ ప్రభుత్వం తిరిగి పని చేయడం ప్రారంభించడానికి, జాతీయ బిల్లుల చెల్లింపులు కొనసాగడానికి వీలుగా ఋణ పరిమితిని కొద్ది మేర పెంచడానికి బిల్లు తయారు చేసిన రిపబ్లికన్ పెద్దలు దానికి మద్దతును మాత్రం కూడగట్టలేకపోయారు. వాస్తవానికి సెనేట్ లో ఇరు పార్టీల మద్దతుతో బిల్లు తయారీ ప్రక్రియకు మంగళవారం శ్రీకారం చుట్టారు.
కానీ స్వల్పకాలం పాటు ఋణ పరిమితి పెంచడానికి ప్రభుత్వం పని తిరిగి పని ప్రారంభించడానికీ ఒక తాత్కాలిక బిల్లు తయారు చేస్తున్నామని ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీ చెప్పడంతో సెనేట్ చర్చలు వాయిదా వేసుకున్నారు. కానీ ప్రతినిధుల సభ ప్రయత్నాలకు ఆరంభంలోనే గండి పడడంతో ఇరు సభలూ ఎటువంటి బిల్లు లేకుండా తెల్లమొఖం వేశాయి. మరోవైపు తుదిగడువు అక్టోబర్ 17 మాత్రం వేగంగా సమీపిస్తూ మార్కెట్లను వణికిస్తోంది.
ప్రతినిధుల సభ వైఫల్యంతో బుధవారం అమెరికన్ స్టాక్ మార్కెట్లు పతనం అయ్యాయి. సెనేట్ చర్చలు సఫలం అవుతాయన్న ఆశాభావంతో మంగళవారం లాభాలు నమోదు చేసిన అమెరికా స్టాక్ మార్కెట్లు, వారి ఆశలపై ప్రతినిధుల సభ నీళ్ళు చల్లడంతో బుధవారం నష్టాలు ఎదుర్కొన్నాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీ 133 పాయింట్లు పతనం అయింది. భారత స్టాక్ మార్కెట్లకు ఈ రోజు సెలవు. కాబట్టి బతికిపోయాయి. కానీ ఈ ప్రభావం గురువారం ఉండదన్న గ్యారంటీ ఏమీ లేదు.
చర్చలు వరుసగా విఫలం అవుతున్న నేపధ్యంలో అమెరికా పరపతి రేటింగు అనిశ్చితిలో, ప్రమాదంలో ఉన్నదని ఫిచ్ హెచ్చరించింది. AAA రేటింగును పరిశీలనలో పెడుతున్నామని తెలిపింది. అంటే త్వరలో తగ్గిస్తామని చెప్పినట్లే. స్టాండర్డ్ & పూర్ రేటింగ్ సంస్ధ 2011 లోనే అమెరికా పరపతిని AAA+ నుండి AA+ కి తగ్గించింది.
అక్టోబర్ 1 తేదీతో ప్రారంభమయిన ప్రభుత్వ పాక్షిక మూసివేతకు ఇంకా పరిష్కారం దొరకనే లేదు. ఋణ పరిమితి పెంచడంలో కూడా అమెరికా విఫలం అయితే ఆ నష్టాన్ని పూడ్చడం అమెరికా చేతుల్లో ఉండదు. డాలర్ ఆధిపత్యానికి గండిపడడం ఎంతోకాలం పట్టదు.
అమెరికా ముందు ఇప్పుడు మూడు తక్షణ కర్తవ్యాలు ఉన్నాయి. ఫెడరల్ ప్రభుత్వాన్ని తెరవడం. ఋణ పరిమితి పెంచడం. ఈ లోపు ప్రభుత్వ ఖర్చులు నడవడానికి తాత్కాలిక బడ్జెట్ ఆమోదించడం. ఇవి అక్టోబర్ 17 లోపు పూర్తి కావాలి. లేనట్లయితే అమెరికాతో పాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరొకసారి మాంద్యంలోకి జారుకుంటుంది.




