ఏనుగు గారు: ఆర్ధిక వ్యవస్ధ నడక సాగాలంటే -మన పౌరులను ఖర్చు చేసేలా ప్రోత్సహించడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను.
నిద్ర లోంచి మేల్కొన్న అలారం: పొదుపు… పొదుపు…
అమెరికా ఆర్ధిక వ్యవస్ధ గురించి ఆ దేశ ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రతిబింబించే కార్టూన్ ఇది. రిపబ్లికన్ పార్టీ గుర్తు ఏనుగు. ఏనుగు గారు పడక కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని జనాన్ని తమ వద్ద ఉన్న డబ్బుని ఖర్చు పెట్టించి తద్వారా అమెరికా ఆర్ధిక వృద్ధి రేటును పెంచేలా చేయడం ఎలా అని దీర్ఘాలోచనలో పడిపోయినట్లు కార్టూన్ సూచిస్తోంది. కానీ అసలు విషయం ఏమిటంటే అదే పార్టీ ప్రభుత్వాన్ని పొదుపు చేయాలని గట్టిగా నిర్దేశిస్తోంది. అసలు దానివల్లనే అమెరికా ప్రభుత్వం మూతపడి, అక్టోబర్ 17 తేదీతో దివాలా తీసే పరిస్ధితికి కూడా చేరిపోయింది.
అమెరికా ప్రభుత్వ వ్యయ బిల్లును తగ్గించాలని, తద్వారా బడ్జెట్ లోటు తగ్గించాలని రిపబ్లికన్ పార్టీ పట్టు బట్టడం వల్ల అక్కడ ఆర్ధిక వ్యవస్ధ ప్రతిష్టంబనకు గురయింది. వ్యయ బిల్లు తగ్గించడం అంటే సాధారణంగా ప్రభుత్వాల దృష్టిలో ప్రజలపై పెడుతున్న ఖర్చును తగ్గించడమే. జనంపై పెట్టే ఖర్చు వృధా ఖర్చనీ వాటి అభిప్రాయం. కంపెనీలు కష్టపడి ఉత్పత్తి తీస్తుంటే ప్రభుత్వం దాన్ని ఉద్యోగులు, కార్మికులు, పేదల కోసం వృధాగా ఖర్చు పెడుతోందని అవి ఊదరగొడతాయి. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ ఆ వాదనలే చేస్తోంది. (డెమోక్రటిక్ పార్టీ కూడా తన వంతు వచ్చినప్పుడు ఇదే వాదన చేస్తుంది)
కానీ వాస్తవం ఏమిటంటే కంపెనీల్లో గానీ, ప్రభుత్వంలో గానీ, ఉత్పత్తి జరిగే మరే చోటయినా గానీ… ఉద్యోగులు, కార్మికులు, పేదలు లేకుండా ఉత్పత్తి జరగనే జరగదు. వారు శ్రమ చేసి తీసిన ఉత్పత్తిని లాభాలుగా, స్పెక్యులేటివ్ ద్రవ్య పెట్టుబడులుగా వృధా చేసేది కంపెనీలే తప్ప జనం కాదు. ఆ క్రమంలో ప్రపంచం నెత్తి మీదికి సంక్షోభాలను రుద్దేదీ కంపెనీలే. అంటే ప్రభుత్వాలు, కంపెనీలు లేదా కార్పొరేషన్లూ ఏ వాదనలైతే వినిపిస్తాయో సరిగ్గా వాటికి విరుద్ధమైనదే అసలు వాస్తవం.
కాబట్టి పొదుపు పాటించాల్సిందే. కానీ అది పాటించాల్సింది. కంపెనీలు. ఖర్చు లేదా వ్యయం చేయాల్సిందే. కానీ అది చేయాల్సింది జనం. కానీ జనం దగ్గర డబ్బు లేదు. పొదుపు పేరుతో ఉద్యోగాలు ఊడబెరికితే వారి దగ్గర డబ్బు ఎలా ఉంటుంది? ఖర్చు చేయడానికి జనం దగ్గర డబ్బు లేని పరిస్ధితుల్లో ప్రభుత్వమే విద్య, వైద్యం, ఆహారం తదితర సౌకర్యాలను అరకొరగా అయినా వివిధ సంక్షేమ పధకాల్లో ఖర్చు చేస్తోంది. ఈ ఖర్చును కూడా రద్దు చేయాలని రిపబ్లికన్ పార్టీ డిమాండ్. అంటే జనం పస్తులతో మాడి చావాలి. జనం పస్తులతో, రోగాలతో చచ్చినా ఫర్వాలేదు గానీ కంపెనీలకు పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇవ్వడం మాత్రం కొనసాగించాలన్నది వారి డిమాండ్.
