విదేశీ పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం పడని పాట్లే లేవు. ఎన్ని పాట్లు పడినా ఫలితాలు మాత్రం సరిగ్గా విరుద్ధంగా వస్తున్నాయి. దానికి కారణాలు భారత ప్రభుత్వం చేతుల్లో లేకపోవడమే అసలు సమస్య. అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ, అనగా రెండు వారాల్లో రు. 7,800 కోట్లు లేదా 1.2 బిలియన్ డాలర్లు దేశం నుండి పరారీ అయ్యాయి. ఈ పలాయనం అమెరికా ప్రభుత్వం మూసివేత ఫలితమేనని పి.టి.ఐ తెలిపింది. భారత ఋణ మార్కెట్ నుండే ఈ మొత్తం తరలిపోవడం మరింత ఆందోళనకరం. అమెరికా దివాలా అంటూ సంభవిస్తే గనక భారత ఋణ మార్కెట్ కి కూడా ఆకర్షణ ఉండదని దీనివల స్పష్టం అవుతోంది.
అక్టోబర్ నెలలో భారత ఋణ మార్కెట్ లో ప్రధాన కొనుగోలుదారులు ఎఫ్.ఐ.ఐ లే. ఎఫ్.ఐ.ఐ అంటే ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లేదా విదేశీ సంస్ధాగత పెట్టుబడులు. అక్టోబర్ 1 నుండి 11 తేదీ వరకు ఎఫ్.ఐ.ఐ లు రు. 5,541 కోట్ల మేర భారత ఋణ సెక్యూరిటీలను (ఋణ బాండ్లు) కొనుగోలు చేయగా అమ్మకాలు మాత్రం ఏకంగా రు. 13,365 కోట్ల మేరకు జరిపారు. అంటే నికరంగా భారత ఋణ మార్కెట్ నుండి ఈ 11 రోజుల్లో రు. 7,824 మేర ఎఫ్.ఐ.ఐ లు దేశం విడిచి వెళ్లిపోయాయి.
కొత్త ఎఫ్.ఐ.ఐ లను ఆకర్షించడానికీ, ఉన్న ఎఫ్.ఐ.ఐ లు దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడానికీ భారత ప్రభుత్వం, ఆర్.బి.ఐ లు ఈ మధ్య కాలంలో తీసుకోని చర్య అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. జాతీయంగా గానీ, అంతర్జాతీయంగా గానీ అందుబాటులో ఉన్న ప్రతి వేదికపైనా వాళ్ళు తాము తీసుకున్న చర్యల గురించి డప్పు కొట్టుకున్నారు. నిజానికి ఎఫ్.ఐ.ఐ లను నమ్మడానికి వీలు లేదు. అవి అత్యంత అస్ధిరమైనవి. అందుకే వాటిని ‘హాట్ మనీ’ అని కూడా అంటారు. అవి తమ అస్ధిరతను తరచుగా దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు అంటిస్తుంటాయి. అందువల్ల ఆర్ధిక వ్యవస్ధల గమనాన్ని తల్లకిందులు చేసేస్తుంటాయి.
సెప్టెంబర్ నెల మొత్తానికి గాను ఎఫ్.ఐ.ఐ లు రు. 5,600 ఋణ సెక్యూరిటీలను వదిలిపోయాయి. అంటే తమ చేతుల్లో ఉన్న భారత ఋణ సెక్యూరిటీలను అమ్మేసి సమాన మొత్తాన్ని డాలర్లలో మార్చుకుని వెళ్లిపోయాయి. దీనివలన మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆ మేరకు తగ్గిపోతాయి. ఈ అమ్మకాలకు కారణం అమెరికా ఫెడరల్ మూసివేత అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న సత్యం.
ఎఫ్.ఐ.ఐ ల పలాయనం ఫలితంగా భారత కరెంటు ఖాతా లోతు మరింత పెరిగింది. గత సంవత్సరం మొదటి త్రైమాసికం (Q1) లో కరెంటు ఖాతా లోటు 16.9 బిలియన్ డాలర్లు ఉంటే అది ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి గాను 21.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. శాతంలో చెప్పుకుంటే గత సంవత్సరం Q1 కరెంటు ఖాతా లోటు జి.డి.పిలో 4 శాతం ఉంటే అది ఈ సంవత్సరం 4.9 శాతానికి పెరిగిందని ఆర్.బి.ఐ సెప్టెంబర్ 30 తేదీన చెప్పింది.
బంగారం దిగుమతులు కూడా మన కరెంటు ఖాతా లోటుపైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఉదాహరణకి ఆర్.బి.ఐ లెక్కల ప్రకారం గత సంవత్సరం Q1 తో పోలిస్తే ఈ సంవత్సరం Q1 లో బంగారం దిగుమతులు 7.3 బిలియన్ డాలర్లు పెరిగాయి. బంగారం దిగుమతులే లేకపోయినట్లయితే మన కరెంటు ఖాతా లోటు 21.8 బిలియన్లకు బదులు 14.5 బిలియన్లు మాత్రమే ఉండేది. అనగా జి.డి.పిలో 3.2 శాతం మాత్రమే ఉండేది. కరెంటు ఖాతా లోటు జి.డి.పి లో 2.5 శాతం లోపు ఉంటే ఆర్ధిక వ్యవస్ధకి మంచ్చిందని ఆర్.బి.ఐ చెబుతుంది.
బంగారం అనగానే నెపాన్ని ఆడవాళ్ళ మీదికి నెట్టేస్తారు. బంగారు నగల పట్ల ఆడవారి మోజు వల్లనే దిగుమతులు పెరుగుతున్నాయని అంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఆభరణాల కొనుగోలుని భారతీయులు నమ్మకమైన, భద్రమైన పెట్టుబడిగా భావిస్తారు. (అది నిజం కూడా.) అంటే ఆడవారి మోజుతో సంబంధం లేకుండానే తమ ఆస్తిని కాపాడుకోవడం కోసం కుటుంబాలు బంగారం కొంటాయి. ఈ కొనుగోళ్ళు ఆభరణాల రూపంలోనే కాకుండా బిస్కట్ల రూపంలోనూ పెద్ద ఎత్తున జరుగుతుంది. అనగా ధనికులే ఎక్కువగా బంగారం కొంటారు. వారిని నియంత్రిస్తే దేశ ఆర్ధిక వ్యవస్ధకి కాస్త భరోసా దక్కుతుంది.
ఈ సంవత్సరం ఇప్పటివరకు ఎఫ్.ఐ.ఐ లు 44,400 కోట్ల రూపాయలు (6.9 బిలియన్ డాలర్లు) భారత ఋణ మార్కెట్ (ప్రభుత్వ రుణాలు + కార్పొరేట్ రుణాలు) నుండి ఉపసంహరించుకున్నాయి. ఇది భారీ మొత్తమే. ఆర్.బి.ఐ, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, భారత ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టి సరళీకరణ చర్యలు అమలు చేసినా ఈ పలాయనం కొనసాగుతోందంటే దానిక్కారణాలు అమెరికా, ఐరోపాల ఋణ సంక్షోభాలు, ఆర్ధిక మాంద్యం, పొదుపు విధానాలే.
కరెంటు ఖాతా లోటు పెరుగుతూ ఉంటే ఆ మేరకు రూపాయి విలువ కూడా తగ్గుతూ ఉంటుంది. లోటును పూడ్చడానికి ఆర్.బి.ఐ విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఖర్చు చేస్తుంది. అనగా కరెన్సీ మార్కెట్ లో రూపాయి అమ్మకాలు జోరందుకుని డాలర్ కొనుగోళ్ళు పెరుగుతాయి. ఈ ప్రక్రియ రూపాయి విలువపై ఒత్తిడి పెంచి కిందికి నెడుతుంది. ఫలితంగా రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి విలువ పడిపోతుంటే ఎఫ్.ఐ.ఐ లు తమ పెట్టుబడుల ఉపసంహరణ ఇంకా వేగిరమ్ చేస్తారు. ఆ విధంగా కరెంటు ఖాతా లోటు, రూపాయి విలువ పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఆర్ధిక వ్యవస్ధపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
ఈ విష వలయాన్ని ఆపాలంటే నమ్మకమైన దారి దేశీయ మార్కెట్ ని అభివృద్ధి చేసుకోడం. అంటే దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి. అందుకు తిరుగులేని మార్గం ప్రజలకు, నమ్మకమైన, స్ధిరమైన ఉపాధి కల్పించడం. ‘ఆ ఒక్కటీ అడక్కు’ తరహాలో పాలకులు చేయనిది ఇదొక్కటే. ఉన్న ఉపాధి కూల్చివేసే విధానాలు అనుసరిస్తున్న పాలకులు కొత్త ఉపాధి కల్పిస్తారంటే నమ్మగలమా?

ఇంత మంది నెత్తినోరు కొట్టుకుంటూ ఉంటే, ప్రభుత్వానికి ఎందుకు పట్టడంలేదు!?. ఈ విషయంలో పౌరుల బాధ్యత ఏమిటి? ఏంచేయాలి?
ఇప్పుడు ఎఫ్ ఎఫ్ ఐ లు షేరు ధరలు ( ఇండెక్సు) పెంచి తక్కువలొ కొన్న షేరులను అమ్ము కొని డలర్లలొ దబ్బులు చేసుకుంటున్నారు.
ఇది అరికట్టగలమా, లేము. దేశానికి చాలా గడ్డు కాలం దాపురిస్తున్నది .